ఘనంగా తుడుందెబ్బ ఆవిర్భావ దినోత్సవం
గుండాల, ఆగస్టు 7,(విజయక్రాంతి): మండల కేంద్రంలో తుడుందెబ్బ ఆవిర్భావ దినోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సుభాష్ నగర్ లోని తుడుందెబ్బ వ్యవస్థాపక సభ్యులు జవ్వాజీ లక్ష్మీనారాయణ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరం తుడుందెబ్బ రాష్ట్ర కార్యదర్శి పూనెం శ్రీనివాస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. శ్రీనివాస్ మాట్లాడుతూ.. తుడుందెబ్బ ఆవిర్భవించి 30 సంవత్సరాలు అయిందని, గిరిజన హక్కుల సాధన కోసం తుడుందెబ్బ పార్టీ పుట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అదిలాబాదు మొదలుకొని శ్రీకాకుళం వరకు అనేక ఉద్యమాలు చేస్తూ ఆదివాసీ చట్టాల కోసం పోరాడుతుందని అన్నారు. మండలంలోని శెట్టుపల్లి, శంభునిగూడెం, వెన్నెలబైలు, లింగగూడెం, చీమల గూడెం గ్రామాలలో పార్టీ జెండాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు చింత వెంకటేశ్వర్లు, మండల అధ్యక్షుడు గోవింద నరసింహారావు, ప్రధాన కార్యదర్శి మహేందర్, జిల్లా నాయకులు మోకాళ్ళ కన్నయ్య, కల్తి మల్లయ్య, జవ్వాజీ జోషి, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.






