నీటి భద్రతోనే పారిశ్రామిక మనుగడ
టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మల జగ్గారెడ్డి
సంగారెడ్డి, జూలై 2 (విజయక్రాంతి): పరిశ్రమల స్థాపనతో పాటు పర్యావరణ పరిర క్షణ, సహజ వనరులను కాపాడుకోవడమే తెలంగాణ ప్రభుత్వ ముఖ్య లక్ష్యమని తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ చైర్‌పర్సన్ నిర్మల జగ్గారెడ్డి స్పష్టం చేశారు. ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటు చేసిన ‘నీటి భద్రత పారిశ్రామిక స్థిరత్వం’ ఉన్నత స్థాయి సదస్సుకు ముఖ్య అతిథిగా ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ నీటి భద్రత లేకపోతే శా శ్వత పారిశ్రామిక వృద్ధి సాధ్యం కాదని పే ర్కొన్నారు.
భవిష్యత్తులో రాష్ట్రంలో ఏర్పాటు చేయబోయే ప్రతి పారిశ్రామిక పార్కులోనూ జీరో లిక్విడ్ డిశ్చార్జ్ విధానాన్ని, అధునాతన మురుగునీటి శుద్ధి ప్లాంట్లను తప్పనిసరి చేస్తామన్నారు. భూగర్భ జలాలు ప డిపోతున్న ప్రస్తుత తరుణంలో పరిశ్రమలు ఐఓటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి స్మార్ట్ సాంకేతికతను ఉపయోగించుకుని నీటి వృధాను, లీకేజీలను అరికట్టాలని నిపుణులు పేర్కొన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన 100 మందికి పైగా పారిశ్రామిక ప్రతినిధులు, పర్యావరణ నిపుణు లు, ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొని పారిశ్రామిక నీటి నిర్వహణపై విస్తృతంగా చర్చించారు.






