22 July, 2026 | 5:43 PM

త్వరితగతిన ఇందిరమ్మ ఇండ్లు పూర్తి చేసుకోవాలి

22-07-2026 05:04 PM

ప్రభుత్వ ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకోండి

జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

సిరిసిల్ల,(విజయక్రాంతి): చందుర్తి మండలం మల్యాల గ్రామంలో పులి పద్మ, పీసరి శిరీషకు సంబంధించిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు కొనసాగుతుండగా, జిల్లా కలెక్టర్ బుధవారం పరిశీలించారు. నిర్మాణ పనులు ఎప్పుడు మొదలు పెట్టారు? ఫోటోలు ఆన్లైన్లో అప్ లోడ్ చేస్తున్నారా? రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక సహాయం అందుతుందా అని ఆరా తీశారు. ఎప్పటిలోగా ఇండ్లు పూర్తి చేస్తారో అడిగి తెలుసుకున్నారు.

జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ  రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పథకాన్ని సద్వినియోగం చేసుకొని  తమ సొంత ఇంటి కల సాకారం చేసుకోవాలని, లబ్ధిదారులకు అధికారులు అందుబాటులో ఉండి లబ్ధిదారుల ఇబ్బందులు దూరం చేయాలని ఆదేశించారు.

బోర్ వెల్ రీచార్జ్ పనులకు శ్రీకారం

 చందుర్తి మండలం మల్యాల గ్రామంలోని కమ్యూనిటీ హాల్ వద్ద బోర్ వెల్ రీచార్జ్ పనులకు జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ శ్రీకారం చుట్టారు. బోర్ వెల్ రీచార్జ్ పనుల విస్తీర్ణం, దానిలో ఏ ఏ మెటీరియల్ ఎంత వేయాలి? తదితర అంశాలపై అధికారులకు సూచనలు చేశారు. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా జిల్లాలో తెలంగాణ జలసిరి కింద నీటి సంరక్షణ పనులు ముమ్మరంగా చేయించాలని ఆదేశించారు. ప్రతి గ్రామం, మున్సిపాలిటీకి నిర్ణయించిన లక్ష్యానికి అనుగుణంగా ప్రణాళిక ప్రకారం పనులు చేయాలని ఆదేశించారు.