12 May, 2026 | 7:04 PM

మహోన్నత ఆశయంతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం

03-09-2025 01:24 AM
  1. సిమెంట్, స్టీల్ కంపెనీలు ధరలు తగ్గించాలి
  2. ప్రభుత్వ నిర్ణయంలో భాగస్వామ్యం కావాలి 
  3. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 
  4. ఒకే ధరకు సిమెంటు, స్టీలు సరఫరా చేయాలి
  5. పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు 
  6. స్టీల్, సిమెంట్ కంపెనీల ప్రతినిధులతో సమావేశమైన మంత్రులు 

హైదరాబాద్, సెప్టెంబర్ 2 (విజయక్రాంతి): ప్రభుత్వం మహోన్నత ఆశయంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం విజయవంతం చేసేందుకు రాష్ర్టంలోని సిమెంటు, స్టీలు పరిశ్రమలు భాగస్వా ములు కావాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కోరారు. సచివాలయంలో మంగళ వారం మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి సిమెంటు, స్టీలు పరిశ్రమల యజమానులు, అధికారులతో డిప్యూటీ సీఎం ప్రత్యేక సమా వేశం నిర్వహించారు.

ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ప్రభుత్వ పథకాలకు సిమెంటు కంపెనీలు అందిస్తున్న ధరను సమావేశంలో మంత్రులు సమీక్షించారు. 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సు మారు 50 లక్షల టన్నుల సిమెంటు, 27.75 లక్షల టన్నుల స్టీలు అవసరం అవుతుందని అధికారులు వివరించారు.

ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతూ  రూ. 22,500 కోట్లతో 4.50 లక్షల ఇందిరమ్మ ఇల్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఇప్పటికే రాష్ర్టంలో వేగంగా ఇళ్ల నిర్మా ణం చేస్తుందని తెలిపారు. స్టీలు, సిమెంటు పరిశ్రమలను ఈ రాష్ర్టంలో ఎంతగానో ప్రోత్సహించామని, మానవీయ కోణంలో ఆలోచించి ఇందిర ఇళ్ల నిర్మాణానికి స్టీలు, సిమెంటు ధరలు తగ్గించి నాణ్యతతో అందించాలని భట్టి విక్రమార్క కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఇందిరమ్మ ఇళ్లు ప్రారంభించినట్లు భట్టి చెప్పారు. 

రాష్ట్ర ప్రగతికి చేయూతనివ్వాలి: శ్రీధర్‌బాబు

రాష్ర్ట ప్రగతిలో భాగస్వాములై చేయూతనివ్వాలని పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు కోరారు. పెద్ద, చిన్న అనే అంతరం లేకుండా కంపెనీలన్నీ ఒకే ధరకు సిమెంటు, స్టీలు సరఫరా చేయాలని మంత్రి బాబు సూచించారు. రాష్ర్టంలో పరిశ్రమలను పెద్దఎత్తున ప్రోత్సహిస్తున్నామని, ప్రపంచ ప్రసిద్ధిగాంచిన పరిశ్రమలు హైదరాబాద్‌తో పాటు తెలంగాణ రాష్ర్ట వ్యాప్తంగా విస్తరిస్తున్నాయన్నారు.

భవిష్యత్తులో రాష్ర్టంలో సిమెంటు, స్టీలు ఉత్పత్తులకు భారీ డిమాండ్ ఏర్పడుతుందని తెలిపారు. రాష్ర్టంలో సిమెంటు, స్టీలు పరిశ్రమల అభివృద్ధికి రాష్ర్ట ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని తక్కువ ధరకు, నాణ్యతతో కూడిన సిమెంటు, స్టీలును సరఫరా చేయాలని కోరారు. ప్రభుత్వం మానవీయ కోణంలో చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ప్రోత్సహం అందించే అవకాశం కలగడం అదృష్టంగా భావిస్తున్నా మని సిమెంటు, స్టీలు కంపెనీల యజమానులు, ప్రతినిధులు తెలిపారు.

పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో వీలైనంత త్వరగా స్టీలు, సిమెంటు పరిశ్రమల యాజమాన్యాలు, ప్రతినిధులు సమావేశమై ధరలు ఫైనల్ చేస్తామని కంపెనీల ప్రతినిధులు తెలిపారు. సమావేశంలో చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, పరిశ్రమల శాఖ డైరెక్టర్ నిఖిల్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.