12 May, 2026 | 6:04 PM

పోలాండ్‌లో ఉద్యోగమంటూ కుచ్చుటోపీ

03-09-2025 01:29 AM
  1. సియాస్ ఇమిగ్రేషన్ కంపెనీ ఘనకార్యం 
  2. ముంబై, ఢిల్లీ, దుబాయ్‌లో కార్యాలయాలు 
  3. రూ.లక్షల్లో మోసపోయిన నిజామాబాద్‌వాసులు
  4. తిరిగి ఇవ్వమంటే సైబర్ కేసులు పెడతామంటూ గల్ఫ్ ఏజెంట్ల బెదిరింపులు 

నిజామాబాద్, సెప్టెంబర్ 2 (విజయక్రాంతి): పోలాండ్‌లోని సియాస్ ఇమిగ్రేషన్ కంపెనీలో ఉద్యోగాలంటూ బాధితులకు కుచ్చుటోపీ పెట్టి, డబ్బులు దండుకొని మోసం చేసిన ఘటన నిజామాబాద్ జిల్లాలో వెలుగు చూసింది. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది. యూరప్‌లోని పోలాండ్‌లో  మంచి కంపెనీలో ఉద్యోగం అంటూ ఓ ఏజెంట్ మోసం చేశాడని బాధితులు సోమవారం నిజామాబాద్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.

ఒక్కొక్కరు రూ.రెండున్నర లక్షల చొప్పున కట్టామని బాధితులు అల్లకొండ భోజేందర్, గడ్డం శ్రీనివాస్, తోట రాజ్‌కుమార్, వీరి స్నేహితుడైన బట్టి లక్ష్మీనాయుడు, దేవతి లక్పతి తెలిపారు. వీరంతా నిజామాబాద్ జిల్లాకు చెందిన వారు కాగా బట్టి లక్ష్మీనాయుడుది వైజాగ్. సియాస్ గ్రూప్ ఇమిగ్రేషన్ కంపెనీకి చెందిన ఉద్యోగిని అంటూ ఆకాంక్ష అనే మహిళ ఫోన్‌లో పోలాండ్ ఆఫర్ ఉంది.. డబ్బులు కట్టండి అని చెప్పడంతో నమ్మి ఏజెంట్‌కు డబ్బులు కట్టినట్టు తెలిపారు. సియాస్ ఇమిగ్రేషన్ కంపెనీ సీఈఓ సుశీల్ భవేకర్ పేరున ఉన్న అకౌంట్‌కి డబ్బులు పంపామని తెలిపారు.

ఇలా మొత్తంగా ఏజెంట్‌కు దాదాపు రూ.15 లక్షలకు పైగా చెల్లించామని వాపోయారు. సియాస్ గ్రూప్ ఇమిగ్రేషన్ కంపెనీ కార్యాలయాలు ముంబై, ఢిల్లీ, దుబాయిలలో ఉన్నాయని, డబ్బులు ఎక్కడ చెల్లించినా తమ కార్యాలయానికి అందుతాయని కంపెనీ సీఈఓ సుశీల్ భావకర్ తెలిపాడని చెప్పారు. సౌదీలో ఉంటున్న అల్లకొండ భోజేందర్‌కు తాము డబ్బులు కట్టి, అతని ద్వారా దుబాయ్‌లో ఉన్న సియాస్ ఇమిగ్రేషన్ కంపెనీకి సౌదీ నుంచి వెళ్లి డబ్బులు చెల్లించామని తెలిపారు.

మిగితా డబ్బులు తాము హైదరాబాద్ పంజాగుట్ట మెట్రోలో గల విఎఫ్‌ఎస్ గ్లోబల్ కార్యాలయం నుంచి డాక్యుమెంట్లు, పాస్‌పోర్టు పంపించామని తెలిపారు. హైదరాబాద్ నుంచి మిగతా డబ్బును సుశీల్ భవకర్ అకౌంట్‌కి పంపామని తెలిపారు. తమ పాస్‌పోర్టులను పోలాండ్‌కి పంపిన సియాస్ ఇమిగ్రేషన్ కంపెనీ..

అవి రిటర్న్ వచ్చాయని, యూరప్‌లో మీరు ఉండటానికి సరైన అకామిడేషన్ డాక్యుమెంట్ లేవంటూ తిరిగి పంపాలని 30 రోజుల గడువు ఇస్తూ లెటర్ పంపారని పేర్కొన్నారు. డబ్బులు తిరిగి చెల్లించాలని కంపెనీకి ఫోన్ చేస్తే తమనే బెదిరిస్తున్నారని బాధితులు వాపోయారు. సుశీల్ భవకర్‌కు ఫోన్ చేస్తే.. సైబర్ కేసు నమోదు చేయిస్తామని, రెండు లక్షల 50 వేల జరిమానాతో పాటు సంవత్సరం జైలు శిక్ష పడుతుందని బెదిరిస్తున్నాడని బాధితులు వాపోయారు. 

ఎంపీ అరవింద్ కల్పించుకోవాలి

పోలాండ్‌లో మంచి జీతంతో పాటు వేర్ హౌస్ ఫ్యాక్టరీ వర్కర్‌గా ఉద్యోగం ఉందని నమ్మించడంతో రూ.1.29 లక్షలు కంపెనీ సీఈఓ సుశీల్ బావకర్ అకౌంట్‌కు పంపించాను. సరైన వసతితో కూడిన డాక్యుమెంట్స్ లేవంటూ ఇప్పుడు ఉద్యోగం ఇవ్వడం లేదు. ముందుగా చెప్పినట్టు 2, లేదా 3 వేల దినార్లు కట్ చేసుకుని మిగతా డబ్బు ఇవ్వమంటే బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఎంపీ అరవింద్ కల్పించుకొని తమకు న్యాయం జరిగేలా చూడాలి. 

  1.  గడ్డం శ్రీనివాస్, ధర్పల్లి, నిజామాబాద్ 

నా భార్య తాళి అమ్మేశా

పోలాండ్‌లో వేర్‌హౌస్ ఫ్యాక్టరీ వర్కర్‌గా ఉద్యోగం ఉందని, మంచి జీతం ఇస్తామంటూ గల్ఫ్ ఉద్యోగానికి ప్రయత్నిస్తున్న నాకు కంపెనీ ఉద్యోగిని అంటూ ఫోన్ ద్వారా సంప్రదించింది. దీంతో సియాస్ గ్రూప్ ఇమిగ్రేషన్ కంపెనీ సీఈవో సుశీల్ భవేకర్ ఖాతాలోకి లక్ష రూపాయలు కట్టాను. నా భార్య మంగళసూత్రం కుదువపెట్టి డబ్బులు తెచ్చాను. నా స్నేహితులు మోసపోయారని తెలిశాక మిగతా డబ్బు కట్టలేదు.  

 తోట రాజ్‌కుమార్, బాల్కొండ, నిజామాబాద్

2.60 లక్షలు చెల్లించాను

సౌదీలో ఉన్న నాకు ఫోర్ క్లిప్ ఆపరేటర్‌గా యూరప్ పోలాండ్ కంపెనీ లో మంచి ఉ ద్యోగం, జీతం ఉన్నదంటే రూ. 1,18,000 వరకు జీతం లభిస్తుందని నమ్మించడంతో.. సౌదీ నుంచి దుబాయ్‌కి వెళ్లి నాతో పాటు మిగతా ఐదు గురుకు చెందిన డబ్బులు సియాస్ గ్రూప్ ఇమిగ్రేషన్ కంపెనీకి చెల్లించాను. రూ.2.60 లక్షలు కట్టాను. ఇప్పు డు మీ డాక్యుమెంట్‌లలో రెసిడెన్స్ సంబంధించిన పత్రాలు లేవం టూ పాస్‌పోర్టు వెనక్కి వచ్చిందంటూ చెపుతున్నారు. డబ్బులు ఇవ్వమంటే బెదిరింపులకు పాల్పడుతున్నారు. 

 అల్ల కొండ భోజేందర్, కొలిప్యాక్, నిజామాబాద్