20 May, 2026 | 1:30 AM

ప్రిన్స్ యాదవ్, గుర్నూర్‌కు పిలుపు

20-05-2026 12:29 AM

వైస్ కెప్టెన్‌గా కేఎల్ రాహుల్

ఆప్ఘనిస్థాన్‌తో సిరీస్‌కు భారత జట్టు

ముంబై, మే 19: ఐపీఎల్ ముగిసిన వెంటనే ఆప్ఘనిస్థాన్‌తో జరగబోయే సిరీస్ కోసం భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ ప్రకటించింది. ఐపీఎల్‌లో సత్తా చాటిన పలువురు యువ ఆటగాళ్లకు ఈ జట్టులో చోటు దక్కింది. రిషబ్ పంత్‌ను తప్పించి కేఎల్ రాహుల్‌ను గిల్‌కు డిప్యూటీగా నియమించారు. వర్క్ లోడ్ మేనేజ్ మెంట్ దృష్ట్యా స్టార్ పేసర్ బుమ్రాకు విశ్రాంతినిచ్చారు. దీంతో సిరాజ్, ప్రసిద్ధ కృష్ణలతో పాటు యువ పేసర్లు ప్రిన్స్ యాదవ్, మానవ్ సుతార్, గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే ఎంపికయ్యారు.

కొత్తగా ప్రిన్స్ యాదవ్, గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబేలకు చోటు లభించింది. టెస్ట్ జట్టు నుంచి జడేజాకు విశ్రాంతి నిచ్చిన సెలక్టర్లు వన్డే టీంకు సంజూ శాంసన్, జైస్వాల్‌లను ఎంపిక చేయకపోవడం ఆశ్చర్యపరిచింది. ఇదిలా ఉంటే ఆప్ఘనిస్థాన్‌తో ఏకైక టెస్ట్ ముల్లాన్ పూర్ వేదికగా జూన్ 6 నుంచి 10 వరకూ జరుగుతుంది. తర్వాత మూడు వన్డేల సిరీస్ జూన్ 14 నుంచి మొదలవుతుంది. వన్డే సిరీస్‌కు ధర్మశాల, లక్నో, చెన్నై ఆతిథ్యమివ్వనున్నాయి.

భారత టెస్ట్ జట్టు: గిల్ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), జైస్వాల్, సాయి సుదర్శన్, పంత్, పడిక్కల్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, మానవ్ సుతార్, జురెల్.

భారత వన్డే జట్టు: గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్) విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, నితీష్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, హర్ష్ దుబే.