2 March, 2026 | 5:01 AM

సెమీస్‌కు భారత్

02-03-2026 12:46 AM
  1. ఈడెన్‌లో సంజూ విధ్వంసం
  2.   50 బంతుల్లోనే 97 పరుగులు
  3. భారీ లక్ష్యాన్ని ఛేదించిన భారత్
  4. సెమీస్‌లో ఇంగ్లాండ్‌తో ఢీ

గల్లీలో సిక్సర్ ఎవరైనా కొడతారు.. స్టేడియంలో కొట్టేవాడికే ఓ రేంజ్ ఉంటుంది.. ప్రస్తుతం ఈ సినిమా డైలాగ్ భారత క్రికెటర్ సంజూ శాంసన్‌కు సరిగ్గా సరిపోతుంది. ఎన్ని అవకాశాలిచ్చినా వృథా చేసుకుంటాడు.. నిలకడ లేదంటూ తీవ్ర విమ ర్శలు ఎదుర్కొన్న సంజూ శాంసన్ కీలక మ్యాచ్‌లో జూలు విదిల్చాడు. వెస్టిండీస్‌తో జరిగిన నాకౌట్ మ్యాచ్‌లో దుమ్మురేపేశాడు. బ్యాట్‌తో విధ్వంసం సృష్టించాడు.

వికెట్లు పడుతున్నా ఒత్తిడికి గురవకుండా అద్భుతమైన ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించడమే కాదు సెమీఫైనల్‌కు తీసుకెళ్లాడు. దీంతో ఈడెన్ గార్డెన్స్‌లో తమకు తిరుగులేదని మరోసారి నిరూపించిన భారత్ 196 పరుగుల టార్గెట్‌ను ఛేజ్ చేసి విండీస్‌ను ఇంటికి పంపించింది. ఈ మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌తో సంజూ సూపర్ శాంసన్ అంటూ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

కోల్‌కత్తా, మార్చి 1 : టీ20 ప్రపంచకప్ లో టీమిండియా సెమీఫైనల్ కు దూసుకెళ్లింది. కోల్‌కత్తా ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరి గిన డూ ఆర్ డై మ్యాచ్‌లో వెస్టిండీస్‌ను చిత్తు చేసింది. ఆసక్తికరంగా సాగిన ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ భారీస్కోరు చేయగా.. భారత్ కూడా ధీటుగా స్పందించి లక్ష్యాన్ని ఛేదించింది. అవకాశాలు ఇచ్చినా వినియోగించు కోలేకపోతూ విమర్శలు ఎదుర్కొన్న సంజూ శాంసన్ ఈ మ్యాచ్‌లో విశ్వరూపం చూపించాడు.

కీలక ఇన్నింగ్స్‌తో భారత్‌ను సెమీస్ కు చేర్చాడు. మొదట బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ భారీస్కోరు చేయడమే లక్ష్యంగా ఆడింది. ఓపెనర్లు హోప్, ఛేజ్ తొలి వికెట్‌కు 68 పరుగులు జోడించారు. హోప్ 32, ఛేజ్ 40 పరుగులకు ఔటవగా.. హెట్ మెయిర్ (12 బంతుల్లో 27 ) మెరుపులు మెరిపించినా అతన్ని భారత బౌలర్లు ఎక్కువ సేపు క్రీజు లో నిలవనివ్వలేదు. రూథర్ ఫర్డ్ (14) ఔటైనప్పటకీ రోవ్ మన్ పావెల్, హోల్డర్ ధాటిగా ఆడారు.

వీరిద్దరూ ఐదో వికెట్ కు 35 బంతుల్లోనే 76 పరుగుల భాగస్వామ్యం నెల కొల్పారు. పావెల్ 19 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 34, హోల్డర్ 22 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 37 రన్స్ తో నాటౌట్ గా నిలిచారు. వీరిద్దరి మెరుపులతో వెస్టిండీస్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 195 పరుగులు చేసింది. భారత బౌలర్లలో బుమ్రా 2 వికెట్లు, హార్థిక్, వరుణ్ చక్రవర్తి ఒక్కో వికెట్ పడగొట్టారు. భారత ఫీల్డర్లు పలు క్యాచ్‌లు జారవి డవడం విండీస్ కు కలిసొచ్చింది. రెండు సులభమైన క్యాచ్ లను అభిషేక్ శర్మ వదిలేయగా ఆ అవకాశాన్ని కరేబియన్ బ్యాటర్లు బాగానే వినియోగించుకున్నారు.

భారీ లక్ష్యమే అయినప్పటకీ ఈడెన్ గార్డె న్స్ ఛేజింగ్ పిచ్ కావడం, మంచు ప్రభావం ఉండడంతో భారత్ విజయం సాధిస్తుందని ముందే అంచనా వేశారు. ఓపెనర్లు సంజూ శాంసన్, అభిషేక్ శర్మ భారీ ఆరంభాన్నివ్వలేకపోవడం షాకిచ్చింది. అభిషేక్ శర్మ మరో సారి నిరాశపరిచాడు. ఇషాన్ కిషవ్ (10) , సూర్యకుమార్ యాదవ్ (18) కూడా త్వరగానే ఔటవడంతో కాస్త టెన్షన్ కనిపించింది.

ఈ దశలో సంజూ శాంసన్‌తో కలిసి తెలుగుతేజం తిలక్ వర్మ అదరగొట్టాడు. తిలక్ వర్మ, సంజూ 42 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. తిలక్ వర్మ భారీ షాట్ కొట్టే ప్రయత్నంలో 27 రన్స్ కు వెనుదిరిగాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్‌తో కలిసి సంజూ శాంసన్ ముందుకు నడిపించాడు. 

పాండ్యా 17 రన్స్ కు ఔటైన తర్వాత ఉత్కంఠ నెలకొంది. ఈ దశలో శివమ్ దూబే రెండు ఫోర్లు కొట్టి ఒత్తిడి తగ్గించాడు. కాగా చాలా రోజుల తర్వాత మెరిసిన సంజూ ఇలాంటి డూ ఆర్ డై మ్యాచ్ లో విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడడం అభిమానులకు ఎక్కడలేని జోష్ ఇచ్చింది. తనపై వచ్చిన విమర్శలకు చెక్ పెడుతూ భారత్ ను సెమీఫైనల్ కు చేర్చిన సంజూ 50 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్లతో 97 పరుగులతో నాటౌ ట్‌గా నిలిచాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా ఏకాగ్రత కోల్పోకుండా బ్యాటింగ్ చేస్తూ జట్టును గెలిపించాడు. 

మ్యాచ్ గెలిపించిన తర్వాత పిచ్‌పైనే కూర్చుని ఆకాశం వైపు చూస్తూ దేవుడిని తలుచుకున్న సంజూ ఉద్వేగానికి లోనయ్యా డు. సంజూ విన్నింగ్ షాట్ కొట్టగానే డ్రెస్సిం గ్ రూమ్‌లో భారత క్రికెట ర్లు సైతం ఎగిరి గంతేశారు. బుధవా రం జరిగే తొలి సెమీఫైనల్లో న్యూజిలాండ్, సౌతాఫ్రికా తలపడనుండగా... గురువారం జరిగే రెండో సెమీఫైనల్లో భారత్, ఇంగ్లాండ్‌ను ఢీకొంటుంది.

స్కోరు బోర్డు 

వెస్టిండీస్ ఇన్నింగ్స్ : 195/4 ( ఛేజ్ 40, హోల్డర్ 37 నాటౌట్, పావెల్ 34 నాటౌట్, హోప్ 32 ; బుమ్రా 2/36, పాండ్యా 1/40, 1/40)

భారత్ ఇన్నింగ్స్ : 199/5 (సంజూ శాంసన్ 97 నాటౌట్, తిలక్ వర్మ 27, పాండ్యా 17; హోల్డర్ 2/38, జోసెఫ్ 2/42, హొస్సేన్  1/22)