24 March, 2026 | 3:49 AM

యుద్ధం ప్రభావం.. 14 లక్షల కోట్లు ఆవిరి

24-03-2026 12:35 AM
  1. నష్టాల్లో స్టాక్ మార్కెట్లు!

ఆల్‌టైమ్ రికార్డు కనిష్ఠానికి రూపాయి

డాలరుతో పోల్చుకుంటే 94.01 చేరిన వైనం 

ముంబై, మార్చి 23: ఇరాన్ యుద్ధం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లన్నీ నష్టాల బాటలోనే సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో సెన్సెక్స్, నిఫ్టీ కూడా భారీ నష్టాలను చవిచూశాయి. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ తొలిసారి 94 మార్కు దాటి 94.1 వద్ద కనిష్ఠానికి పడిపోయింది. దేశీయ స్టాక్ మార్కెట్  సూచీలు మరోమారు నష్టాలను చవిచూశాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరగడం, విదేశీ సంస్థాగత మదుపర్ల విక్రయాలు నడుస్తుండడం సూచీలపై తీవ్ర ప్రభావం చూపాయి. సెన్సెక్స్ ఓ దశలో 2వేల పాయింట్ల మేర నష్టపోగా.. నిఫ్టీ 22,500 పాయింట్ల మార్కు కొంచెం ఎగువన ఆగింది.

ఒక్కరోజులోనే మదుపర్ల సంపద దాదాపు రూ.14 లక్షల కోట్లు ఆవిరై రూ.415 లక్షల కోట్లకు చేరింది. డాలరుతో రూపాయి విలువ 94.01 కనిష్ఠానాకి చేరి, ఆల్‌టైమ్ రికార్డు కొట్టింది. సోమవారం ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 1837 పాయింట్లు పడిపోయి 73,732.58 వద్ద భారీ నష్టాల్లో ప్రారంభమైంది. రోజంతా నష్టాలు కొనసాగాయి. చివరికి 1836.57 పాయింట్ల నష్టంతో 72,696.39 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 601.85 పాయింట్ల నష్టంతో 22,512.65 వద్ద సిథరపడింది. మిడ్ క్యాప్ 100, స్మాల్ క్యాప్ 100లు కూడా నష్టపోయాయి. పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధం, చమురు 110 డాలర్లపైకి ఎగబాకడం, రూపాయి విలువ రికార్డు స్థాయికి పడిపోవడం, ఎఫ్‌ఐఐల విక్రయాలు విపరీతంగా పెరగడం వంటివి మార్కెట్లపనై తీవ్ర ప్రభావం చూపాయి.