అక్రమ కమర్షియల్ నిర్మాణాలు
అధికారుల మౌనం ఎందుకు..?
కాప్రాలో నిబంధనల ఉల్లంఘనలు
విచారణకు స్థానికుల డిమాండ్
కుషాయిగూడ, జూన్ 8 (విజయక్రాంతి): కాప్రా మున్సిపల్ పరిధిలోని జమ్మిగడ్డ ఎల్లారెడ్డిగూడ ప్రధాన రహదారి పక్కన బీఆర్ రెడ్డి నగర్ కాలనీలో కొనసాగుతున్న కమర్షియల్ భవన నిర్మాణాలపై స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిర్మాణాలు నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్నాయని ఆరోపణలు వస్తున్నప్పటికీ, సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శిస్తున్నారు.
ప్రధాన రహదారి పక్కనే వేగంగా నిర్మాణ పనులు కొనసాగుతున్నప్పటికీ, వాటికి అవసరమైన అనుమతులు ఉన్నాయా, సెట్బ్యాక్లు, పార్కింగ్ సదుపాయాలు, భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారా అనే అంశాలపై మున్సిపల్ అధికారులు తనిఖీలు నిర్వహించడం లేదని స్థానికులు ఆరోపించారు. అక్రమ నిర్మాణాలపై పలుమార్లు ఫిర్యాదులు చేసినా స్పందన లేకపోవడంతో ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కొందరు ప్రభావశీలుల ఒత్తిళ్లు లేదా రాజకీయ జోక్యాల కారణంగానే అధికారులు చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. నిర్మాణ నిబంధనలు ఉల్లంఘించబడితే భవిష్యత్తులో ట్రాఫిక్ సమస్యలు, రోడ్డు ప్రమాదాలు, ప్రజా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కాప్రా మున్సిపల్ కమిషనర్, టౌన్ ప్లానింగ్ అధికారులు, జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని సంబంధిత నిర్మాణాలపై సమగ్ర విచారణ జరిపి, అక్రమాలు నిర్ధారణ అయితే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.






