మా సినిమా నిరాశపరిస్తే గుండు కొట్టించుకుంటా!
‘సహ’ మూవీ హీరోయిన్ శ్వేత లక్ష్మణ్ ఛాలెంజ్
నిషాంత్ దోటి(Nishanth Doti) దర్శకత్వంలో కుమార్ కాసారం హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం ‘సహ’(Saha) ‘లైఫ్ ఆఫ్ సంజు’ అనేది ట్యాగ్‌లైన్. ఈ చిత్రంలో శ్వేతా లక్ష్మణ్(Swetha Lakshman), వ్రజన పాండ్య కథానాయికలుగా నటిస్తున్నారు. సుమైరా స్టూడియోస్ బ్యానర్‌పై తేజేశ్వర్ వెల్పుచర్ల నిర్మిస్తున్నారు. ఇందులో మహిపాల్, అప్పాజీ, భారతి, మేఘనా సునీల్, బాంబే పద్మ, కొండారెడ్డి, హర్షవర్ధన్ కీలక పాత్రల్లో నటించారు. శేఖర్ చంద్ర సంగీత సారథ్యంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ నేపథ్యంలో మేకర్స్ గురువారం ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ మేరకు హైదరాబాద్‌లో నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో టాలీవుడ్ నిర్మాతలు బన్నీ వాసు, వంశీ నందిపాటి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బన్నీ వాసు మాట్లాడుతూ.. “సహ పోస్టర్ మీద ది బిగ్గెస్ట్ స్మాల్ ఫిల్మ్ ఆఫ్ ది డికేడ్’ అని వేశారు. ఇది కంటెంట్ మీద నమ్మకంతో మేకర్స్ వేశారు. ఆ నమ్మకం నిజమవ్వాలని కోరుకుంటున్నా.
ఈ సినిమా నేను చూశా.. చాలా బాగుంది” అని చెప్పారు. ‘ఖచ్చితంగా ఈ సినిమా అంచనాలను అందుకుంటుంద’ని వంశీ నందిపాటి తెలిపారు. హీరో శివకుమార్ మాట్లాడుతూ.. “ఒక అద్భుతమైన సినిమా ప్రేక్షకులు థియేటర్లలో చూడబోతున్నారు. చిన్న సినిమా బ్లాక్‌బస్టర్ కొడితే ఎలా ఉంటుందో ఈ సినిమాతో చూపిస్తాం. కచ్చితంగా విజయం సాధిస్తుంది. చాలా రోజులపాటు గుర్తుండిపోతుంది” అన్నారు.
హీరోయిన్ శ్వేతా లక్ష్మణ్ మాట్లాడుతూ.. “ఈ సినిమా కథ మీద నాకు చాలా నమ్మకం ఉంది. ఈ సినిమా చూసిన తర్వాత ఎంత మంచి సినిమా తీశామని ప్రేక్షకులు అనుకుంటారు. థియేటర్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఎవరూ నిరాశ చెందరు. ఒకవేళ మీరు డిసప్పాయింట్ అయితే నేను అమీర్‌పేట్ సెంటర్‌లో నిల్చొని గుండు గీయించుకుంటా. అంత స్ట్రాంగ్ కంటెంట్ తీశాం. మేము చాలా గట్టిగా కొట్టబోతున్నాం” అని తెలిపింది.
‘ఈ సినిమా గురించి చాలా గొప్పగా మాట్లాడుకుంటార’ని మరో కథానాయకి వ్రజన పాండ్య చెప్పింది. డైరెక్టర్ నిశాంత్ మాట్లాడుతూ.. “మాది చిన్న సినిమా అయినా ఇందులో ఉన్న ఎమోషన్ చాలా పెద్దది. మా కల దానికంటే పెద్దది. గత పది ఏళ్లలో వచ్చిన సినిమాల్లో గుర్తుండిపోయే సినిమా మాది అవుతుంది” అని చెప్పారు. ఈ వేడుకలో మూవీటీమ్ అందరూ పాల్గొన్నారు.






