బార్ అసోసియేషన్ అభివృద్ధికి కృషి చేస్తా
- ప్రమాణ స్వీకార కార్యక్రమంలో అధ్యక్షుడు కిరణ్ సాగర్ రావు
గజ్వేల్: గజ్వేల్ బార్ అసోసియేషన్ అభివృద్ధికి తన శక్తివంచన లేకుండా కృషి చేస్తానని గజ్వేల్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు కిరణ్ సాగర్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ కోర్టు ప్రాంగణంలో నూతనంగా ఎన్నికైన బార్ అసోసియేషన్ కార్యవర్గ ప్రమాణ స్వీకారం బుధవారం ఘనంగా జరిగింది. ఇటీవల నిర్వహించిన ఎన్నికల్లో విజయం సాధించిన అధ్యక్షుడు కిరణ్ సాగర్, కార్యవర్గం సీనియర్ న్యాయవాదులు మరియు ఎన్నికల అధికారుల సమక్షంలో పదవీ ప్రమాణం చేసి బాధ్యతలు స్వీకరించారు.
ఈ సందర్భంగా అధ్యక్షుడు కిరణ్ సాగర్ మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన న్యాయవాదులకు కృతజ్ఞతలు తెలిపారు. గజ్వేల్ బార్ అసోసియేషన్ ప్రతిష్టను మరింత పెంపొందించేందుకు కృషి చేస్తానన్నారు. న్యాయవాదుల సమిష్టి సహకారంతో సమస్యల పరిష్కారానికి ముందుంటానని, సమన్వయంతో పని చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల అధికారి ప్రశాంత్ కుమార్, ఉపాధ్యక్షుడు నరేష్ చారి, ప్రధాన కార్యదర్శి కరుణాకర్, సహాయ కార్యదర్శి ఉమారాణి, కోశాధికారి అశోక్, క్రీడలు, లైబ్రరీ కార్యదర్శి అబ్దుల్ గఫార్, ఎగ్జిక్యూటివ్ సభ్యులు రామకృష్ణ, పరమేశ్వర్, అనూష, అంజలి తదితరులు పాల్గొన్నారు.




