బరాబర్ తొక్కుకుంట వస్తా
- 2029లో అధికారం మళ్లీ కాంగ్రెస్‌కే
- 2034 వరకు మేమే అధికారంలో ఉంటాం
- సభకు రాకుండా ప్రతిపక్ష నేత నియంత పోకడ.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు
- నాలాలపై నిర్మాణాలను నిర్ధాక్షిణ్యంగా కూల్చాలని గతంలో కేసీఆరే చెప్పారు
- హిల్ట్ పాలసీపై ఎలాంటి దర్యాప్తుకైనా సిద్ధమే: అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, మార్చి18 (విజయక్రాంతి) : ప్రభుత్వ ఆలోచనలు, ఆకాంక్ష లను ప్రతిబింబిస్తూ రాష్ట్ర అభివృద్ధి పట్ల ప్రభుత్వానికి ఉన్న సంకల్పాన్ని నొక్కి చెబు తూ రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్షా అసెంబ్లీలో చేసిన ప్రసంగం చరిత్రాత్మకని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. సభ లో గవర్నర్ ప్రసంగానికి ప్రతిపక్షం హుం దాగా ధన్యవాదాలు తెలుపుతుందని ఆశించామని.. కానీ, వారు అహంకారం దోర ణిని ప్రదర్శించారని మండిపడ్డారు.
ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో కేసీఆర్ ఇంతకాలం రూ. కోటి 6 లక్షల జీత భత్యాలు తీసుకుని సభకు మాత్రం రావడం లేదని దుయ్యబట్టారు. ‘కేసీఆర్ ఇప్పటికైనా అసెంబ్లీకి రావాలి. ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వాలి. విధులకు హాజరుకాకుండా ప్రజాధనాన్ని జీత భత్యాల రూపం లో తీసుకునే వారిపై చర్చ జరగాలి. దీనిపై ఒక నిర్ణయం తీసుకోవాలి’ అని సీఎం పేర్కొన్నారు. ‘2023లో చెప్పినట్లే నెత్తిమీద కాళ్లు పెట్టి తొక్కుకుంటూ ఇక్కడి వచ్చా.. 2029లోనూ బరాబర్ మళ్లీ తొక్కుకుంటూ వస్తాను.
2034 వరకు మేమే అధికారంలో ఉంటాం. ఇదే నా సవాల్’ అంటూ రేవంత్‌రెడ్డి అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఇప్పటికే ఐదు గ్యారెంటీలను అమలు చేశామని, మిగిలిన ఒక్కటి కూడా పూర్తి చేస్తామన్నారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో రూ. 8 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని మాకు అప్పగిస్తే.. మేం అసలు, మిత్తి కలిపి నెలనెలా చెల్లిస్తున్నామని సీఎం వివరించారు. అసెంబ్లీ బడ్జె ట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్ర సంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం మాట్లాడారు.
వివిధ పార్టీల సభ్యులు లెవనెత్తిన అంశాలు, ప్రశ్నలకు సమాధానమిచ్చారు. రాజులు పోయినా, రాజ్యాలు పోయినా, రాచరికపోకడలు పోలేదని.. అధికారం పోయినా నియంత పోకడ ఇంకా ప్రదర్శిస్తున్నారని బీఆర్‌ఎస్‌పై సీఎం మండిపడ్డారు. గత చరిత్ర అనుభవాలు, భవిష్యత్ ప్రణాళికలను అంచనా వేసుకుని విజన్ పాలసీ డాక్యుమెంట్ రూపొందించామని, గవర్నర్ ద్వారా ఆవిష్కరించామని తెలిపారు.
రైతును రాజు చేయాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా, సన్న వరికి బోనస్, రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీ వంటి పథకాలను అమలు చేస్తున్నామన్నారు. హిల్ట్ పాలసీపై ఎలాంటి దర్యాప్తుకైనా సిద్ధమేనని సీఎం చెప్పారు.
వారసత్వంగా రాలేదు..
దేశ స్వాతంత్య్రం కోసం గాంధీ, నెహ్రూ, పటేల్ మొదలుకొని చాలా మంది పోరాటం చేశారని సీఎం అన్నారు. నెహ్రూకు వారసత్వంగా ప్రధాని పదవి రాలేదన్నారు. విద్య, సాగునీటి రంగాలకు మొదటినుంచి కాంగ్రెస్ అత్యంత ప్రాధాన్యత ఇచ్చిందని చెప్పారు. అనేక భారీ ప్రాజెక్టులు, విద్యా సంస్థలను, విశ్యవిద్యాలయాలు చేపట్టారు. నాడు దొరల ఆధీనంలో ఉన్న భూములను స్వాధీనం చేసుకున్న ఇందిరాగాంధీ పేదలకు పంచాలన్నారు.
తెలంగాణ బిడ్డ పీవీ నరసింహరావు, మన్మోహన్‌సింగ్ కలిసి ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి దేశాన్ని సాంకేతిక రంగంలో ముందుంచారని చెప్పారు. కాంగ్రెస్ హయాంలోనే ఐటీకి పునాది పడిందని, ఉమ్మడి రా్రష్ట్రంలో ఐటీని జనార్దన్‌రెడ్డి ప్రారంభిస్తే చంద్రబాబు, రాజశేఖర్‌రెడ్డి కొనసాగించరన్నారు.
మూసీ సుందరీరణ కోసం ముందుకే..
‘ఇప్పుడు ఏఐ సునామీ రాబోతుంది.. లక్షలాది ఉద్యోగులు పోయే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రణాళికలు చేసుకోవాలి. పీవీ, మన్మోహన్ విధానాలతో బలమైన ఆర్థిక వ్యవస్థగా దేశం ఉంది. ఈ విపత్కర పరిణామాల్లో ఎలా నిలబడాలనేది గవర్నర్ ప్రసంగం ద్వారా డాక్యుమెంట్‌ను ప్రవేశపెట్టాం. పదేళ్లు ఉద్యమం చేశామని చెప్పుకునే వాళ్లు అడ్డగోలుగా మాట్లాడం సరైందేనా? భవిష్యత్ ప్రణాళికను సిద్ధం చేసుకోకపోతే సమాజం క్షమిస్తుందా? క్యూర్, ప్యూర్, రేర్‌తో విజన్ డాక్యుమెంట్‌తో ప్రభుత్వం వచ్చింది.
2034 నాటికి 1 ట్రిలియన్, 2047 నాటికి 3 ట్రిలియన్ ఎకానమి సృష్టించాలన్నదే మా విజన్. ఈ విషయంలో ప్రధాన ప్రతిపక్షం సూచనలు చేస్తే బాగుండేది. ప్రతిదాంట్లో రాజకీయం, స్వార్దం, అధికారంలో పోయిందనే దు:ఖంతోనే ఉంటున్నారు. ఎవరు అడ్డుపడినా, కలిసి రాకున్నా ముందుకు వెళాతాం. క్యూర్ పరిధిలో ఉన్న పరిశ్రమలను ప్యూర్‌లోకి తరలించేందుకు హిల్ట్ పాలసీ తీసుకొచ్చాం. డీజీల్ బస్సులు మార్చి ఎలక్ట్రిక్ వాహనాలు, ఈవీ ఆటోలే ఉండే విధంగా చూస్తాం. దీంతో రూ.791 కోట్ల ఆదాయం తగ్గింది.
అయినా పర్యావరణం, కాలుష్యం నియంత్రించడానికి ఈవీ వాహనాలు సున్నా పన్ను ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. నిజాం అద్బుతమైన వారసత్వ సంపద అందించారు. ఇప్పుడు మానవ తప్పిదాల వల్ల జరిగిన పరిణామాలను.. ఆక్రమణలు తొలగించడం, పరిశ్రమలు తరలించడం, పార్కుల అభివృద్ధి జరుగుతుంది. దేవతలు యజ్ఞాలు చేసినప్పుడు మారీచుడు, శుభావుడు అనే రాక్షసులు అడ్డుకున్న విధంగానే ఇప్పుడు బావా బామ్మర్దులిద్దరు (కేటీఆర్, హరీష్‌రావు) మేం చేస్తున్న అభివృద్ధ్దిని అడ్డుకుంటున్నారు.
ఆక్రమించిన చెరువులు బతుకమ్మకుంట , నల్లచెరువు, తుమ్మడి కుంటను అక్రమదారుల నుంచి రక్షించి పునర్ నిర్మించుకున్నాం’ అని సీఎం వివరించారు. గతంలో మూసీ సుందరీకరణ కోసం అక్రమ కట్టడాలను తొలగిస్తామని కేసీఆర్, కేటీఆరే చెప్పారంటూ సీఎం రేవంత్‌రెడ్డి సభలో వీడియో చూపించారు.
నాలాలపై నిర్మాణాలను నిర్దాక్షిణ్యయంగా కూల్చాలని గతంలో కేసీఆరే చెప్పారన్నారు. సోనియమ్మ ఆశీర్వాదనంతో తెలంగాణ వచ్చిందని.. కేసీఆర్ కుటుంబం అంతా పోయి సోనియాగాంధీ కాళ్లు మొక్కారని సీఎం అన్నారు. పెద్ద మనిషి విశ్రాంతి తీసుకుంటూ పార్టీని మీ చేతిలో పెడితే పార్టీని చింపిన విస్తరిలా చేస్తున్నారని కేటీఆర్‌ను ఉద్దేశించి అన్నారు.
వాళ్ల కడుపునిండా విషమే..
ప్రభుత్వం చేస్తున్న అభివృద్దిని అడ్డుకునేందుకు బీఆర్‌ఎస్ నాయకులు కుట్రలు చేస్తున్నారని సీఎం మండిపడ్డారు. కడుపునిండా విషమే పెట్టుకున్నారని, మూసీలో కంటే అది ఎక్కువగా ఉందన్నారు. సబర్మతి, యమున లాంటి నదులు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సుందరీకరణ చేసిందన్నారు. ఇప్పుడు మూసీ పునరుద్ధ్దరణ చేస్తుంటే మీకెందుకు కష్టం వస్తుందని ప్రశ్నించారు. ‘హైదరాబాద్‌ను మూడు కమిషనరేట్లుగా విభజన చేశాం. మెట్రోను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటంది.
రూ. 25 వేల కోట్ల ఆస్తులున్న మెట్రోను రూ. 15 వేల కోట్లు చెల్లించి స్వాధీనం చేసుకుంటున్నాం. రెండో ఫేజ్‌లో 76 కిలోమీటర్ల విస్తరణ చేపట్టనున్నాం. ఓల్డ్ సిటీ ఒరిజన్ సిటీ అభివృద్ధి చేయడానికి ఎవరికి మనుసు రాలేదు. మేం చేపట్టనున్న మెట్రో విస్తరణ నచ్చలేదా? తెలంగాణ వచ్చాక మెట్రో మూడేళ్లు ఆగిపోయింది. దీంతో నిర్వహణ ఖర్చు పెరిగింది. రెండో స్థానంలో ఉన్న హైదరాబాద్ మెట్రో ఇప్పుడు 9వ స్థానానికి పడిపోయింది’ అని సీఎం తెలిపారు. ‘మనిషికి కోరికలు ఉండాలి. అతిగా ఉండొద్దు.
సీఎం కుర్చిలో కూర్చోవాలనే ఆలోచన కేటీఆర్‌కు ఉండొచ్చు. ఆ కోరిను తీర్చుకోవాలంటే సభ వాయిదా పడిన తర్వాత ఇక్కడి వచ్చి కూర్చో’ అంటూ కేటీఆర్‌ను ఉద్దేశించి సీఎం వ్యాఖ్యానించారు. మూడు బుల్లెట్ రైళ్లను కూడా కేంద్రం మంజూరు చేసిందని, శంషాబాద్ నుంచి అమరావతి మచిలిపట్నం పోర్టు , ముంబాయి, చెన్నై, బెంగళూర్‌కు మూడు గంటల్లో చేరుకుంటామన్నారు. ‘తెలంగాణ ప్రాంతం ప్రకృతి ప్రసాదించిన వరం.. ఒక్కో జిల్లా ఒక్కో పంటకు ప్రసిద్ధి.
వికారాబాద్, కొడంగల్ కందులు, నిజామాబాద్‌లో పసు పు, ఇతర వాణిజ్య పంటలు, వరంగల్ ఖ మ్మం మిర్చి, పత్తి, నల్లగొండలో వరి పండిస్తారు. అగ్రికల్చర్‌లో రిఫామ్స్, ఆర్గానిక్ పుడ్ ఉత్పతితో పాటు కోల్డ్ స్టోరేజీలు, మార్కెట్ యార్డులు నిర్మించాల్సిన అవసరం ఉంది. రైతును రాజును చేయాలన్న ఆలోచనతో ఉన్నాం. కేసీఆర్ తన ఫామ్‌హౌస్‌లో ఎకరం పొలంలో క్యాప్సికం పండిస్తే రూ. కోటి ఆదా యం వస్తుందని అన్నారు.. ఆ విద్యను అందరికి నేర్పాలని కదా..?’ అని సీఎం చెప్పారు.
నోటిఫికేషన్లు ఇచ్చినా భర్తీ చేయలేదు..
పదేళ్లు అధికారంలో ఉండి ఉద్యోగాలు భర్తీ చేయలేదని సీఎం అన్నారు. మీరు నోటిఫికేషన్లు ఇచ్చి వదిలేస్తే.. మేం వచ్చాక ఉద్యోగాల భర్తీ చేపట్టామని సీఎం అన్నారు. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ ఉద్యోగాలతో టీచర్ పోస్టులు, పోలీసు, వైద్యారోగ్యంతో దాదాపు 80 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేశామన్నారు. వీటిలో 13 వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకంటున్నట్లు చెప్పారు. గ్రూప్ 1లో 562 పోస్టులు గ్రూప్ 2లో 782, గ్రూప్ లో 1,370 నియామకాలు జరిగాయని తెలిపారు.
గురుకులాలు పరిధిలో 8,400 మం దికి నియామకాలు, పోలీసులు పోస్టుల్లో 16,067 మంది నియామకాలు, మెడికల్ హెల్త్ బోర్డ్ ద్వారా 8,822 ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. నిరుద్యోగులపై గత ప్రభుత్వానికి సానుభూతి లేదని తెలిపారు. గత ప్రభుత్వం అధిక వడ్డీకి రుణాలు తెస్తే, ఆ రుణ శాతాన్ని తగ్గించుకునేందుకు కేంద్రాన్ని, అర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ను అనేకసార్లు తను కలిశానని.. రుణ శాతాన్ని తగ్గించిన నిర్మలా సీతారామన్‌కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెబుతున్నానని సీఎం అన్నారు. కేంద్రం సహకరిస్తుంటే బేషజాలు ఎందుకని.. పార్టీల పరంగా వైరుధ్యాలు ఉంటే ఉండవచ్చునని చెప్పారు.
ఏఐతో ఉద్యోగాలు పోతున్నాయి..
ఏఐతో వైట్ కాలర్ ఉద్యోగాలు పోతున్నాయని, అందుకు ప్రత్యామ్నాయంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. ఐటీఐలను ఏటీసీలుగా మార్చి విద్యార్థులకు సాంకేతప రమైన విద్యను అందించి ఉపాధి కల్పిస్తామన్నారు. వ్యవసాయం దండగు కాదు.. వ్యవసాయం పండుగ చేయాలని నిర్ణయించామన్నారు. వరి నుం చి రైతు దృష్టి మళ్లించి కూరగాయలు, పండ్లు ఉత్పత్తి చేయాలని, అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడాలన్నారు.
పెట్టుబడులు ఆకర్శించేందుకు ఐదు రకాల పాలసీలు తెచ్చామన్నారు. టూరిజం పాలసీ , క్రీడాపాలసీ, హిల్ట్ పాలసీ, గ్రీన్ ఎనర్జీ పాలసీ, లైఫ్‌సెన్సెస్ పాలసీ తీసుకొచ్చామన్నారు. ఈ పాలసీలతో 2030 నాటికి 2 లక్షల కోట్ల పెట్టుబడి 5 లక్షల ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని రేవంత్‌రెడ్డి చెప్పారు.
ఆడబిడ్డను తిడుతుంటే నియంత్రించలేదు..
‘సొంతింటి ఆడబిడ్డను లిక్కర్ రాణి, లిక్కర్ కింగ్ అన్నారు.. సోదరుడిగా కనీసం చీమ కుట్టినట్లుగా ఉండదా? కుటుంబంతో తగాదాలు ఉండొచ్చు.. దాయాదులు పోరు చూశాం. సొంతబిడ్డ ఆడబిడ్డను దుబాయ్ నుంచి ఎమ్మెల్యేలు తిడుతుంటే నియంత్రించలేదు’ అని పరోక్షంగా బీఆర్‌ఎస్‌లో కవిత ఉదంతాన్ని ప్రస్తావించారు.




