23 July, 2026 | 4:24 AM

నన్ను ఉద్దేశపూర్వకంగానే సినిమాల నుంచి తప్పించారు!

23-07-2026 01:43 AM

తనదైన వైవిధ్యమైన నటనతో హిందీ చిత్రపరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్న కథానాయకి ప్రియాంకా చోప్రా. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్‌బాబు కథానాయకుడిగా, దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘వారణాసి’లో నటిస్తోంది. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో రానున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 7న విడుదల కానుంది. ఇదిలావుంటే, ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రియాంక చోప్రా.. పరిశ్రమలోని అనుభవాలను పంచుకుంది.

కెరీర్ ఉన్నత దశలో ఉన్నప్పుడు తాను బాలీవుడ్‌ను ఎందుకు వదిలేసిందనే విషయమై స్పందించింది. “కొందరిని మెప్పించనందుకు.. వారు చెప్పినట్టు చేయనందుకు నా సినిమా అవకాశాలు మరొకరికి ఇచ్చారు. ఇతరులు రాజీ పడినట్లుగా.. వాళ్లకు అనుకూలంగా మారేందుకు నేను ఇష్టపడలేదు. ఈ విషయం గురించి నేను ఎక్కువగా మాట్లాడను. కొందరు అగ్ర హీరోలు నన్ను ఉద్దేశపూర్వకంగా సినిమాల నుంచి తప్పించారు” అని ప్రియాంక వెల్లడించింది.

అలాగే ఒకనాటి సంఘటనను గుర్తు చేసుకుంటూ.. “2007లో ‘సలామ్ ఏ -ఇష్క్’ షూటింగ్ సమయంలో నేను మరో చిత్రంలో నటించాల్సి ఉంది. ఆ సినిమా హీరో ఒకరోజు నా సెట్‌కు వచ్చారు. తర్వాత నెలలోనే మా సినిమా షూటింగ్ ప్రారంభం కానుండటంతో.. నాకు మద్దతుగా వచ్చారని అనుకున్నా. కానీ, ఆయన ఊహించని మాట చెప్పారు. ‘దర్శకుడు పొరపాటున ఈ సినిమా నీకు ఇచ్చారు. నిజానికి ఈ పాత్ర మరో హీరోయిన్ చేయాల్సింది. మనం భవిష్యత్తులో మరో సినిమా చేద్దాం.

ఈ విషయం నీకు స్వయంగా చెబుదామనే వచ్చాన’ని చెప్పారు” అని ప్రియాంక ఆవేదన వ్యక్తం చేసింది. పరిశ్రమలో తనకు ఎదురైన పరిస్థితుల గురించి చెబుతూ.. “ఇలా ఒకసారి కాదు.. చాలాసార్లు జరిగింది. ఆ పరిస్థితుల్లో నా కెరీర్ గురించి ఆలోచించా. నా నటనపైనే పూర్తి దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నా. నా కష్టమే నా కెరీర్‌ను నిలబెట్టి, మరిన్ని అవకాశాలు తెచ్చిపెట్టింది” అని స్పష్టం చేసింది.