18 April, 2026 | 4:13 AM

నేనే స్వయంగా పాక్ వెళ్తా!

18-04-2026 12:00 AM
  1. త్వరలో శాంతి ఒప్పందానికి అవకాశం
  2. అమెరికా, ఇరాన్ మధ్య చర్చల్లో పాక్‌ది కీలకపాత్ర
  3. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ 

వాషింగ్టన్, ఏప్రిల్ 17: పశ్చిమాసియాలో యుద్ధం త్వరలోనే ముగుస్తుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలు ఒకవైపు.. ఇటు ఇరాన్‌ను మరింత ఉక్కిరిబిక్కిరి చేస్తామని ఆయన యంత్రాంగం మరోవైపు ప్రపంచాన్ని తీవ్ర గందరగోళంలోకి నెట్టేస్తున్నాయి. ఇస్లామాబాద్ వేదికగా ఇరాన్‌తో శాంతి ఒప్పందం కుదిరితే తాను పాకిస్తాన్ పర్యటనకు వెళ్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇరాన్‌తో రెండు నెలలే యుద్ధం చేశామని పేర్కొన్నారు.

ఇరాన్‌తో సంబంధం ఉన్న నౌకలను టార్గెట్ చేస్తామని జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ జనరల్ డాన్‌కైన్ హెచ్చరించారు. ఇరాన్‌తో జరుగుతున్న చర్చల పట్ల ట్రంప్ సానుకూలత వ్యక్తం చేశారు. నెవాడా పర్యటనకు వెళ్లే ముందు వైట్‌హౌస్ లాన్‌లో విలేకరులతో ఆయన మాట్లాడారు. ఇరాన్‌తో పరిస్థితులు ఆశాజనకంగా ఉన్నాయని తెలిపారు. త్వరలోనే ఒప్పందం ఖరారు అయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇస్లామాబాద్‌లో ఈ ఒప్పందం జరిగితే తాను తప్పకుండా వెళ్తానని ట్రంప్ చెప్పారు.

అక్కడ వారు తనను ఆహ్వానిస్తున్నారని వెల్లడించారు. అమెరికా, ఇరాన్ మధ్య చర్చలను విజయవంతం చేయడానికి పాకిస్తాన్ నిర్మాణాత్మక పాత్ర పోషిస్తోందని ప్రశంసించారు. పాక్ మధ్యవర్తులు ఈ విషయంలో ఎంతో అద్భుతంగా పనిచేస్తున్నారని కొనియాడారు. ఈ చర్చలు సఫలమైతే చమురు సరఫరా మెరుగుపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. చమురు ధరలు గతంలో కంటే భారీగా తగ్గుతాయని అంచనా వేశారు.

ఇరాన్ వద్ద అణ్వాయుధాలు లేకుండా చూడటమే తమ ప్రధాన లక్ష్యమని ట్రంప్ స్పష్టం చేశారు. అణ్వాయుధాలు ఉంటే పెద్ద సమస్యలు ఎదురవుతాయని హెచ్చరించారు. అణ్వాయుధాలు తయారు చేయబోమని ఇరాన్ కూడా అంగీకరించిందని ఆయన తెలిపారు. చర్చల్లో భాగంగా భూగర్భంలో ఉన్న యురేనియాన్ని అప్పగించడానికి కూడా ఇరాన్ ఒప్పుకున్నట్లు పేర్కొన్నారు.

ఇరాన్, అమెరికా మధ్య చర్చలు పునరుద్ధరించేందుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ టెహ్రాన్ వెళ్లారు. అక్కడ ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహ్మద్ బాఘేర్ ఘాలిబాఫ్‌తో ఆయన సమావేశమయ్యారు. ఇరుదేశాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించేందుకు దౌత్యపరమైన కసరత్తు కొనసాగుతోంది.

రెండు నెలలే యుద్ధం చేశాం 

ఇరాన్‌తో రెండు నెలలే యుద్ధం చేశామని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా చేసిన ఇతర యుద్ధాలు 18 ఏళ్లు, నాలుగేళ్లు కొనసాగాయని చెప్పారు. తాజా యుద్ధంలో తాము త్వరలోనే విజయం సాధించనున్నట్లు వెల్లడించారు. ఇరాన్‌పై సైనిక చర్యకు దిగకపోయుంటే.. చెడు పరిణామాలు ఎదురయ్యేవని పేర్కొన్నారు. ఇక ఇరాన్‌లో త్వరలో కీలక పరిణామాలు చోటుచేసుకోవచ్చని ట్రంప్ వెల్లడించారు.

చమురు ధరల గురించి పేర్కొంటూ.. రానున్న వారం రోజుల్లో ఏం జరుగుతుందో చూద్దాం అని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా తాను ఇప్పటివరకు 9 యుద్ధాలను ఆపానంటూ మరోసారి ట్రంప్ పేర్కొన్నారు. తాను ఆపే యుద్ధాల్లో ఇది పదోది కాబోతుందని ట్రూత్ సోషల్ మీడియాలో ఆయన పోస్టు చేశారు. శుద్ధి చేసిన యూరేనియంను అమెరికాకు అప్పగించేందుకు ఇరాన్ అంగీకరించిందని యూఎస్ అధ్యక్షుడు డొనాల్ ట్రంప్ పేర్కొన్నారు.

త్వరలో రెండు దేశాల మధ్య డీల్ కుదరవచ్చని శ్వేతసౌధంలో జరిగిన పత్రికా సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ‘శుద్ధి చేసిన యూరేనియాన్ని అప్పగించేందుకు వారు అంగీకరిం చారు. త్వరలో ఇరు దేశాల మధ్య ఒప్పందం కూడా కుదిరే అవకాశం ఉంది. ఇరాన్, అమెరికా సంబంధాలు చాలా వరకూ మెరుగు పడ్డాయి.

దీన్ని చాలా మంది నమ్మలేకపోవచ్చు. నాలుగు వారాల పాటు సాగిన దాడులు, దిగ్బంధనం వంటివి ఫలితాన్ని ఇచ్చాయని నేను అనుకుంటున్నాను’ అని ట్రంప్ అన్నారు. రెండు దేశాల మధ్య ఈ వారాంతంలోనే మరోసారి చర్చలు జరిగే అవకాశం ఉందని కూడా ట్రంప్ అన్నారు. అయితే, కాల్పుల విరమణను మరోసారి పొడిగించే అవకాశాలు తక్కువగా ఉన్నాయని, కాల్పుల విరమణ ఒప్పందం గడువు ముగిసిపోనున్న విషయం తెలిసిందే. గతంలో బెట్టు చేసిన ఇరాన్ అనేక విషయా ల్లో రాజీధోరణితో ఉందని చెప్పుకొచ్చారు.