కాంగ్రెస్‌లో కొనసాగలేను
- మరోసారి తేల్చిచెప్పిన మాజీ మంత్రి జీవన్‌రెడ్డి
- జగిత్యాలలో ఆయనను కలిసిన పీసీసీ అధ్యక్షుడు మహేశ్, ఏఐసీసీ కార్యదర్శులు వంశీచంద్‌రెడ్డి, సచిన్ సావంత్
- ఫలించని బుజ్జగింపులు
- ఈరోజే రాజీనామా చేసి, భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానన్న జీవన్‌రెడ్డి
జగిత్యాల, మార్చి 24 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీలో ఇకపై కొనసాగనని, బుధవారమే రాజీనామా చేసి భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తానని మాజీ మంత్రి జీవన్‌రెడ్డి స్పష్టం చేశారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, ఏఐసీసీ కార్యదర్శులు వంశీచంద్‌రెడ్డి, సచిన్ సావంత్, పార్టీ విప్ ఆది శ్రీనివాస్ మంగళవారం జగిత్యాలకు చేరుకుని జీవన్‌రెడ్డితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
మహేశ్‌కుమార్‌గౌడ్, సచిన్ సావంత్, ఆది శ్రీనివాస్ ముగ్గురు కలిసిరాగా.. వంశీచందర్‌రెడ్డి ప్రత్యేకంగా వచ్చి ౨౦ నిమిషాల పాటు జీవన్‌రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సందరర్భంగా జీవన్‌రెడ్డికి కాంగ్రెస్ కండువా వేసేందుకు ప్రయత్నించగా.. ‘ప్లీజ్ నాకు ఇప్పటికి జరిగిన అన్యాయం చాలు, కాంగ్రెస్ కండువా కప్పుకోలేను’ అని చెప్పారు.
పీసీసీ అధ్యక్షుడు, ఏఐసీసీ కార్యదర్శులు స్వయంగా జగిత్యాలకు వచ్చి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగించేలా చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. పార్టీ మరొద్దని కోరినా ఆయన వినలేదు. అయితే బుధవారం తన అనుచరులతో సమావేశం అనంతరం పార్టీకి రాజీనామా చేసి, భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని జీవన్‌రెడ్డి ప్రకటించారు.
కాంగ్రెస్‌ను వీడొద్దని కోరాము: మహేశ్‌కుమార్‌గౌడ్
జీవన్‌రెడ్డితో భేటీ అనంతరం మీడియా తో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ మాట్లాడారు. కాంగ్రెస్‌ను వీడొద్దని తాము కోరినట్టుగా చెప్పారు. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ 63 సీట్లు గెలుచుకోగా తర్వాత జరిగిన పరిణామాలతో చాలా ఇబ్బంది పడ్డానని, కార్యకర్తల సూచనల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నా నని జీవన్‌రెడ్డి తమో చెప్పారని పేర్కొన్నారు. రాజీనామా చేయడనే ఆశతో తిరిగి వెళ్తున్నాము అని అన్నారు. జీవన్‌రెడ్డితో చర్చించిన విషయాలు అధిష్ఠానానికి తెలుపుతామని తెలిపారు.




