‘అవిశ్వాసం’పై విశ్వాసమెంత?
లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై విపక్షాలు ఇటీవల ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం సభలో వీగిపోయింది. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో విపక్షాల సభ్యులు సంతకాలు చేసి ఈ తీర్మానాన్ని సిద్ధం చేశారు. ఇది తెలిసిన స్పీకర్ తనపై అవిశ్వాస అంశం తెరపైకి వచ్చిన నేపథ్యంలో, ఆ సంగతి తేలేంత వరకు తాను సభకు రానని ప్రకటించారు. తద్వారా తన ఆత్మవిశ్వాసాన్ని చాటుకున్నారు. అన్నట్లే.. స్పీకర్ సభకు దూరంగా ఉన్నారు. డిప్యూటీ స్పీకర్ అంటూ ఎవరూ లేకపోవడంతో, ప్యానెల్ స్పీకర్లు ఆ బాధ్యతలను నిర్వహించారు.
మొత్తానికి అవిశ్వాస తీర్మానం, చివరకు సభలోకి వచ్చింది. దానిపై ఓటింగ్ నిర్వహించగా, తీర్మానానికి మెజారిటీ సభ్యుల మద్దతు లభించలేదు. దీంతో తీర్మానం విగిపోయియింది. స్పీకర్ ఓం బిర్లా తిరిగి సభలోకి ప్రవేశించారు. ఈ చర్య పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో కొత్త సంప్రదాయానికి నాంది పలికిన చర్యగా నిలిచింది. అయితే, ఈ మొత్తం పరిణామాన్ని విశ్లేషిస్తే కొన్ని అంశాలు మనకు అర్థమవుతాయి.
లోక్‌సభ స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానమనేది ఎంతో సీరియస్ అంశం. స్పీకర్ రాజ్యాంగబద్ధంగా సభ నడపలేకపోయినా, లేదా సభా నియమాలను ఉల్లంఘించినప్పుడు మాత్రమే అవిశ్వాసమనే అస్త్రాన్ని ప్రయోగించాలి. కానీ, తాజా అవిశ్వాస తీర్మానం ఎందుకు? లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీని సభలో ప్రసంగించనివ్వడం లేదని, స్పీకర్ ఆయన గొంతు నొక్కేస్తున్నారనేది ప్రతిపక్ష, విపక్షాల అభ్యంతరం. ప్రజాస్వామ్యంలో విపక్షాల గొంతు వినిపించడం ఎంత ముఖ్యమో, సభా నిబంధనలను పాటించడమూ అంతే ముఖ్యం.
కేవలం ఒక సభ్యుడికి ప్రాధాన్యత లభించలేదనే, కారణంతో ఒక పెద్ద రాజ్యాంగ అస్త్రాన్ని ప్రయోగించడడం సబబేనా? సభలో రాజకీయపరమైన విమర్శలు సహజమే. అయినప్పటికీ, అత్యున్నత వ్యవస్థలను నడిపే వారిపై వ్యక్తిగత కారణాలతో వివాదాల్లోకి నెట్టకూడదు. తీర్మానం వీగిపోయిన తర్వాతే సభలోకి రావడం ద్వారా స్పీకర్ ఓం బిర్లా తన పట్ల సభకు ఉన్న విశ్వాసాన్ని నిరూపించుకున్నారు.
ఇది విపక్షాలకు కూడా ఒక గుణపాఠం. సభను కేవలం రాజకీయ పోరాట వేదికగా కాకుండా రాజ్యాంగబద్ధమైన నిబంధనలతో నడపాల్సిన బాధ్యత అందరిపై ఉంది. స్పీకర్ తీసుకున్న ఈ నిర్ణయం భవిష్యత్తులో పార్లమెంటరీ కార్యకలాపాలకు ఒక మార్గదర్శకం. 1954లో లోక్‌సభ తొలి స్పీకర్ మావ్లంకర్‌పై విపక్షాలు తీసుకువచ్చిన అవిశ్వాస తీర్మానాన్ని నెహ్రూ ప్రభుత్వం స్పీకర్ నిష్పాక్షికతను సమర్థించింది. తర్వాత సభలో జరిగిన ఓటింగ్‌లో అవిశ్వాసం వీగిపోయింది. తద్వారా స్పీకర్ స్థానానికి సభలో నైతిక బలం చేకూరింది. 1966లో అప్పటి స్పీకర్ హుకుమ్ సింగ్ విషయంలోనూ అదే పునరావృతమైంది.
సభా నిబంధనల ఉల్లంఘన పేరుతో విపక్షాలు అవిశ్వాస తీర్మానం తెచ్చినప్పటికీ, అది వీగిపోయింది. 1987లో నాటి స్పీకర్ బలరామ్‌పైనా అవిశ్వాస తీర్మానం సభలోకి వచ్చింది. తీర్మానానికి మెజార్టీ రాలేదు. మళ్లీ వీగిపోయింది. ఈ మూడు అవిశ్వాస తీర్మానాలకు, తాజాగా వచ్చిన నాలుగో తీర్మానానికీ తేడా ఏంటంటే, గత మూడు తీర్మానాలూ వీగిపోయినప్పటికీ, సభ గౌరవాన్ని కాపాడాలనే ఉద్దేశం సభ్యుల్లో బలంగా ఉందని, నాటి పరిణామాలు తెలిసిన వారికి బాగా తెలుసు. కానీ, తాజాగా తీర్మానాన్ని గమనిస్తే, అది కేవలం ప్రతిపక్ష నేతకు సభలో మాట్లాడే అవకాశం ఇవ్వలేదనే కారణం చుట్టూనే తిరిగింది.




