నిలోఫర్ ఆస్పత్రిలో పేషెంట్ అటెండర్‌పై సెక్యూరిటీ గార్డు దాడి
హైదరాబాద్: నిత్యం రద్దీగా ఉండే ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిలోఫర్ ఆసుపత్రి ఒకటి. నిలోఫర్ ఆసుపత్రిలో( Niloufer Hospital) ఒక రోగికి చికిత్స అందిస్తున్న మహిళపై సెక్యూరిటీ గార్డు దాడి చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ దాడి క్లోజ్డ్ సర్క్యూట్ టెలివిజన్ (CCTV) కెమెరాలలో రికార్డయింది. సోషల్ మీడియాలోవిపరీతంగా వైరల్ అవుతున్న వీడియోలో మహిళా సెక్యూరిటీ గార్డు అటెండెంట్‌ను గోడకు నెట్టి, ఆమెను కొట్టడం కనిపిస్తుంది.
ఈ దాడికి ముందు, అటెండెంట్ గార్డును ఆపి వాగ్వాదానికి దిగింది. అటెండెంట్ గార్డును కొట్టడానికి ప్రయత్నించడంతో ఉద్రిక్తత పెరిగింది. ఆ తర్వాత ఆసుపత్రి సిబ్బంది, ఇతర అటెండెంట్లు ఆ ఇద్దరు మహిళలను విడదీశారు. ఈ గొడవకు గల కారణం స్పష్టంగా తెలియరాలేదు. చిన్నపిల్లల ఆస్పత్రిలో ఇలాంటి ఘర్షణలు జరగడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.






