15 August, 2026 | 4:37 PM

జాతీయ జెండా ఎగరని గృహ నిర్మాణ శాఖ కార్యాలయం

15-08-2026 03:44 PM

శ్రీరంగాపూర్: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండాను ఎగురవేసి వేడుకలు నిర్వహించాల్సి ఉండగా, వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్ మండల కేంద్రంలోని తెలంగాణ గృహ నిర్మాణ సంస్థ అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేయకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఆగస్టు 15న కార్యాలయం మూసి ఉండటంతో ఎలాంటి స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమాలు నిర్వహించలేదని స్థానికులు తెలిపారు. జాతీయ పండుగ రోజున ప్రభుత్వ కార్యాలయంలో కనీసం జెండా ఎగురవేయకపోవడంపై వారు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయంపై కార్యాలయ ఏఈని వివరణ కోరగా.. జిల్లా నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని తెలిపారు. అయితే ప్రభుత్వ కార్యాలయాల్లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నిర్వహణపై స్పష్టత ఇవ్వాలని, ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.