21 July, 2026 | 5:43 PM

భక్తి పారవశ్యంలో దక్షిణముఖి ఆంజనేయస్వామి దేవాలయంలో 72 గంటల అఖండ రుద్రాభిషేకం

21-07-2026 12:21 AM

బోధన్, జులై 20 (విజయ క్రాంతి): బోధన్ పట్టణంలోని బ్రాహ్మణ గల్లిలో ఉన్న శ్రీ దక్షిణముఖి ఆంజనేయ స్వామి దేవాలయం ‘ఓం నమఃశివాయ‘ నామస్మరణతో, వేద మంత్రోచ్ఛారణలతో మారుమోగింది. సోమవారం ప్రారంభమైన 72 గంటల అఖండ రుద్రాభిషేక మహోత్సవంలో ఉదయం నుంచే ప్రత్యేక అభిషేకాలు, రుద్రపారాయణం, మహామంగళ హారతులు, విశేష పూజలు భక్తిశ్రద్ధల నడుమ అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి.

ఈ ఆధ్యాత్మిక మహోత్సవాన్ని రాష్ట్రంలో, దేశంలో సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని, రైతులు మరియు ప్రజలు పాడి పంటలతో సుఖసంతోషాలతో ఉండాలని సంకల్పిస్తూ వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక అభిషేకాలు, రుద్రపారాయణం, పూజా కార్యక్రమాలను బోధన్ బ్రాహ్మణ సేవా సమాజ్ మరియు వీడీసీ పట్టణ అభివృద్ధి కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. మూడు రోజుల పాటు నిరంతరాయంగా అఖండ రుద్రాభిషేకాలు, ప్రత్యేక పూజలు కొనసాగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.ఆలయానికి తరలివచ్చిన భక్తులు భక్తి పారవశ్యంలో పూజల్లో పాల్గొని స్వామివారికి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

ఆలయ ప్రాంగణమంతా శివనామస్మరణ, వేదఘోషలతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. ఈ సందర్భంగా వీడీసీ పట్టణ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు గంగాధర్ రావు పట్వారి, ప్రధాన కార్యదర్శి బీర్కూర్ బుజ్జి శంకర్, కోశాధికారి శ్రీను, బ్రాహ్మణ సేవా సమాజ్ అధ్యక్షులు ప్రవీణ్ మహారాజ్, గౌరవ అధ్యక్షులు వినోద్ పట్వారి, ప్రధాన కార్యదర్శి ఉమానందు వైద్యతో పాటు కార్యవర్గ సభ్యులు మహోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఈ పవిత్ర అఖండ రుద్రాభిషేక మహోత్సవంలో పాల్గొని శ్రీ దక్షిణముఖి ఆంజనేయ స్వామివారి అనుగ్రహం పొందాలని నిర్వాహకులు భక్తులకు పిలుపునిచ్చారు.