21 August, 2026 | 1:28 AM

ఇనార్బిట్ మాల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

21-08-2026 12:14 AM
  1. యువతి స్పాట్ డెడ్
  2. జనసేన ఎంపీ కుమారుడిపై కేసు

శేరిలింగంపల్లి,ఆగస్టు 20 (విజయక్రాంతి): మాదాపూర్ ఇనార్బిట్ మాల్ ఎదురుగా జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 26 ఏళ్ల యువతి దుర్మరణం చెందింది. లగ్జరీ స్పోరట్స్ కారు అత్యంత వేగంగా ఢీకొట్టడంతో ఆమె తలకు తీవ్ర గాయాలయ్యి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ సభ్యుడు, జనసేన పార్టీ నేత లింగమనేని రమేశ్ కుమారుడు లింగమనేని సంజ్పు మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు.ఆగస్టు 16న మధ్యాహ్నం సుమారు 3 గంటల సమయంలో ఈ విషాదం చోటుచేసుకుంది.

ఇనార్బిట్ మాల్లోని లైఫ్స్టైల్ స్టోర్లో సేల్స్ అసోసియేట్గా పనిచేస్తున్న భారతి ముఖి తన సహోద్యోగి పూజా అశోక్తో కలిసి సమీపంలోని ఐటీసీ కోహినూర్ హోటల్ వద్ద లంచ్ తీసుకురావడానికి వెళ్లింది.తిరిగి మాల్లోకి వెళ్తూ రోడ్డు దాటుతుండగా టీజీ-09-జీ-0666 నంబర్ ప్లేట్ ఉన్న ఆస్టన్ మార్టిన్ కారు దూసుకొచ్చి ఆమెను బలంగా ఢీకొట్టింది.ఆ ధాటికి యువతి గాల్లోకి ఎగిరి కిందపడి తలకు తీవ్ర రక్తస్రావం అయింది. వెంటనే ఆమెను అదే కారులో జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రికి తరలించినా, వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.

లైఫ్స్టైల్ స్టోర్ మేనేజర్ పంజాల అశ్విన్ కుమార్ ఫిర్యాదు మేరకు మాదాపూర్ పోలీసులు విచారణ చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్, వాహన వివరాలు పరిశీలించి కారు నడుపుతున్నది 21 ఏళ్ల లింగమనేని సంజుష్ గా గుర్తించారు. అతివేగంగా, నిర్లక్ష్యంగా వాహనం నడిపి ప్రాణాలు తీసినందుకు గాను భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 106(1) కింద కేసు నమోదు చేశారు. నిందితుడికి చట్టపరమైన నోటీసులు జారీ చేసినట్లు పోలీసులు తెలిపారు.ఈ నేరం బెయిలబుల్ కావడంతో ప్రస్తుతం అరెస్టు చేయలేదని మాదాపూర్ ఏసీపీ చి. శ్రీధర్ వెల్లడించారు.

కారు హానర్ ప్రైమ్ హౌసింగ్ ఎల్‌ఎల్పీ పేరుతో రిజిస్టర్ అయినట్లు తెలిసింది. సైబరాబాద్ ప్రాంతంలో ఐటీ ఉద్యోగులు, సాధారణ ప్రజలు రద్దీగా తిరిగే రోడ్లపై లగ్జరీ కార్లు ర్యాష్ డ్రైవింగ్ చేయడం వల్ల అమాయకులు బలవుతున్నారని ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.ఎంతటి రాజకీయ పలుకుబడి ఉన్నా చట్టం ముందు అందరూ సమానమేనని, పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని ప్రజలు, ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పూర్తి నివేదిక అందాల్సి ఉంది.