27 August, 2026 | 4:04 PM

వరంగల్ పాలిటెక్నిక్ కాలేజీ వద్ద ఉద్రిక్తత.. రాకేష్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు

27-08-2026 12:45 PM

హైదరాబాద్: వరంగల్ పాలిటెక్నిక్ కాలేజీ(Warangal Polytechnic College) వద్ద భారీగా పోలీసులు మోహరించారు. విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీలు చేసిన తర్వాతనే పోలీసులు లోపలికి అనుమతిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా GO 97 రద్దు చేయాలని నిరసనలు తెలుపుతున్న విద్యార్థులకు సంఘీభావం తెలిపేందుకు మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు(MLA Harish Rao) వరంగల్ పాలిటెక్నిక్ కాలేజీకి వెళ్లనున్నట్లు సమాచారంతో పోలీసులు హరీశ్ రావును హౌస్ అరెస్ట్ చేశారు. అనుమతి లేకపోవడంతో అడ్డుకునేందుకు ముందస్తుగా పోలీసులు చర్యలు తీసుకున్నారు. బీఆర్ఎస్ నేత రాకేశ్ రెడ్డి వరంగల్ పాలిటెక్నిక్ కాలేజీకి దగ్గరకు వెళ్లారు. ఏనుగుల రాకేశ్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు అక్కడి నుంచి పంపించేశారు.

హరీష్ రావు పర్యటన సందర్బంగా విద్యార్ధులతో మాట్లాడటానికి పాలిటెక్నిక్ కాలేజీకి వెళ్లినట్లు రాకేశ్ రెడ్డి తెలిపారు. కారణం తెలపకుండా కళాశాల వద్ద తనను, తనతో పాటు ఉన్న వారిని పోలీసులు అడ్డుకున్నారని పేర్కొన్నారు. జీవో 97 రద్దు చేయాలని శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వాళ్లపై అణిచివేత ఎందుకని మండిపడ్డారు. హరీష్ రావు పర్యటనలు భంగం కలిగించాలని ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలిటెక్నిక్ కళాశాలల ఆస్తుల మీద రేవంత్ రెడ్డి కన్ను పడిందని ఆరోపించారు. ఎట్టి పరిస్థితుల్లో జీవో 97 రద్దు చేసేదాక బీఆర్ఎస్ పార్టీ విద్యార్ధులకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.