10 August, 2026 | 2:10 PM

వెంటనే కాళేశ్వరం మోటార్లు ఆన్ చేయండి

10-08-2026 12:40 PM

నీళ్లు లేక ఆందోళనలో అన్నదాతలు 

సాగు నీరు కోసం రైతాంగం ఎదురు చూపు

ఉత్తమ్ కుమార్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు లేఖ

హైదరాబాద్:  తెలంగాణ ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి(Minister Uttam Kumar Reddy) మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు లేఖ(Harish Rao letter) రాశారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో వివిధ జిల్లాలోని రిజర్వాయర్ లు అన్నపూర్ణ, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్, నృసింహ (బస్వాపూర్) రిజర్వాయర్ లను నింపి సుమారు 4లక్షల ఎకరాల ఆయకట్టు పరిధిలోని రైతుల ప్రయోజనాల దృష్ట్యా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మోటార్లను ఆన్ చేసి వెంటనే నీటి పంపింగ్ చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి హరీష్ రావు రైతుల పక్షాన రాసిన లేఖలో పేర్కొన్నారు.  ప్రస్తుత వానాకాలం పంట సీజన్ రైతులు ఇటు ఎలినినో వల్ల తక్కువ వర్షాభావం, అటు ప్రాజెక్టుల్లో రిజర్వాయర్ లలో నీటిని సకాలంలో నింపక పోవడం తద్వారా పంటల సాగు ముందుకు సాగక రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్న విషయం పేర్కొన్నారు. ఇటీవల ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాల వలన వచ్చే వరదను తద్వారా ప్రతి నీటి చుక్కని ఒడిసి పట్టి  సకాలంలో కాళేశ్వరం ప్రాజెక్టు పంపులను ఆన్ చేసి రైతుల ప్రయోజనాల దృష్ట్యా నీటి పంపింగ్ ప్రారంభించాలని హరీష్ డిమాండ్ చేశారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో(Kaleshwaram Project) అంతర్భాగమైన మిడ్ మానేరు రిజర్వాయర్ పూర్తి నీటి సామర్థ్యం 27 టీఎంసీలు, ప్రస్తుతం సుమారు 22 టీఎంసీల నీటి లభ్యత ఉందని, అదేరకంగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల వలన గోదావరి లోని వరద నీటి లభ్యత కూడా ఏర్పడనుందని తెలిపారు. ఈ విషయం దృష్టిలో ఉంచుకొని మిడ్ మానేరు నుండి మోటార్లను ఆన్ చేసి నీటి పంపింగ్ ప్రారంభించాలని, తద్వారా కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన  అన్నపూర్ణ (అంతగిరి), రంగనాయక సాగర్, మల్లన్న సాగర్,కొండపోచమ్మ సాగర్, నృసింహ (బస్వాపూర్ ) తదితర రిజర్వాయర్ లను, వాటి పరిధిలోని చెరువులను, చెక్ డ్యామ్ ల అన్నింటిని నింపి సుమారు 4లక్షల ఎకరాల కు నీరందించేలా చర్యలు చేపట్టలని సూచించారు. రైతు సాగు ప్రయోజనాలు తీర్చడానికి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా నీటి పంపింగ్ చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు.

అదేవిధంగా లోయర్ మానేరు డ్యామ్ (LMD) పూర్తి నీటి సామర్థ్యం 24 టీఎంసీలు, ప్రస్తుత నీటి లభ్యత 6.9 టీఎంసీలు ఉన్నాయని తెలిపారు. మిడ్ మానేరు నుండి లోయర్ మానేరు (LMD) కు నీటిని నింపి SRSP STAGE -2 లోని అవసరమగు ఆయకట్టుకు నీరు అందించి రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. గత యాసంగి పంటలో కాళేశ్వరం ప్రాజెక్టులోని పైరిజర్వాయర్ల ఆయకట్టు పరిధిలో 4లక్షల ఎకరాలు సాగు అయిన విషయం గుర్తించి ఈ వానాకాలం పంటకి అదేవిధంగా వచ్చే యాసంగి పంటకు కూడ సాగునీరు అందించేలా కాళేశ్వరం ప్రాజెక్టు అంతర్భాగంలోని అన్ని రిజర్వాయర్లు నింపి తద్వారా వాటి అనుసంధానంగా నిర్మించిన కాలువలు, చెరువులు చెక్ డ్యామ్ లు అన్నింటినీ నింపి రైతుల్లో నెలకొన్న ఆందోళనను తొలగించి రైతు ప్రయోజనాల దృష్ట్యా రాజకీయలకు అతీతంగా వెంటనే నీటి పంపింగ్ ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని మంత్రి ఉత్తమ్ కుమార్ ను మాజీ మంత్రి కోరారు.