27 April, 2026 | 4:05 AM

గుట్కా, పాన్, డ్రగ్స్, ఖైనీతో ప్రాణహాని

27-04-2026 01:59 AM

యువత వాటికి దూరంగా ఉండాలి

  1. మంచి అలవాట్లను అలవర్చుకోవాలి
  2. మాదక ద్రవ్యాల వినియోగంపై కఠిన చర్యలు
  3. ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

హైదరాబాద్, ఏప్రిల్ 26 (విజయక్రాంతి): పొగాకు వినియోగం వల్ల క్యాన్సర్ వంటి వ్యాధులు పెరుగుతున్నాయని, గుట్కా, పాన్, డ్రగ్స్, ఖైనీతో ప్రాణహాని తప్పదని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు హెచ్చరించారు. వాటికి దూరంగా ఉండాలని, ముఖ్యంగా యువత ఇలాంటి వ్యసనాలకు దూరంగా ఉండి, ఉజ్వల భవిష్యత్తు దిశగా ముందుకు సాగాలని, మంచి అలవాట్లు అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు.

ఆదివారం హైదరాబాద్ రాయదుర్గం సత్త్వ నాలెడ్జ్ పార్క్‌లో గ్లోబల్ ఓరల్ క్యాన్స ర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన నోటి క్యాన్సర్ మరాథాన్‌లో మంత్రి శ్రీధర్‌బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 10కే రన్‌ను జెండా ఊపి ప్రారంభించి మాట్లాడారు. మాదక ద్రవ్యాల వినియోగం, అక్రమ అమ్మకాలపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసు కుంటూ అణచివేస్తున్నదని తెలిపారు. ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని, యువత యోగా, వ్యాయామం వంటి మంచి అలవాట్లను అలవరచుకోవాలని కోరారు.

చెడు అలవాట్ల వల్ల ప్రాణనష్టాలు పెరుగుతు న్నాయని ఆందోళన వ్యక్తంచేస్తూ, సమాజంలో అవగాహన పెంపు అత్యవసరమని పేర్కొన్నారు. గుట్కా వంటి హానికర అలవాట్లపై చైతన్య కార్యక్రమాలు మరింత విస్తృతంగా నిర్వహించాలని చెప్పారు. సైబరాబాద్ సీపీ రమేశ్ 5 కే రన్‌ను జెండా ఊపి ప్రారంభించారు. మరో అతిథి బీసీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు 2 కే రన్‌ను జెండా ఊపి ప్రారంభించారు.

అనంతరం మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం నోటి క్యాన్సర్ కారణంగా దేశంలో లక్షల మంది విలువైన ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. గ్లోబల్ ఓరల్ క్యాన్సర్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ దిలీప్‌కుమార్ మాట్లాడుతూ.. నోటి క్యాన్సర్‌పై అవగాహన పెంపు కోసం ఈ మరాథాన్ నిర్వహించినట్టు తెలిపారు.

ప్రారంభ దశలోనే వ్యాధిని గుర్తిస్తే చికిత్స సాధ్యమవుతుందని, కాబట్టి ప్రజలు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డాక్టర్ నాగ దీపిక, డాక్టర్ సౌమ్య, డాక్టర్ వినూత్న, డాక్టర్ చంద్రకాంత్ తదితరులు పాల్గొన్నారు. నగరంలోని వివిధ సాఫ్‌వేర్ సంస్థల ఐటీ ప్రొఫెషనల్స్, డాక్టర్లు, ప్రముఖులు, యువతతోపాటు మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రత్యేకంగా పాల్గొన్నారు.