కాళేశ్వర క్షేత్రం.. ఆధ్యాత్మిక వైభవం
ముక్తేశ్వర స్వామికి కర్పూర హారతి
త్రివేణి సంగమంలో ఘనంగా సరస్వతి అంత్య పుష్కరాలు
హారతి కార్యక్రమానికి హాజరైన మంత్రి శ్రీధర్‌బాబు, విశాఖ పీఠాధిపతి స్వరూపానందేంద్ర
కాళేశ్వరం/మహబూబాబాద్, మే 28 (విజయక్రాంతి): సరస్వతి అంత్య పుష్కరాలతో భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ఆధ్యాత్మికతను సంతరించుకున్నది. గురువారం ఎనిమిదో రోజు త్రివేణి సంగమంలో అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి పుణ్య స్నానాలు ఆచరించారు. వేకువ జాము నుండి మొదలు రాత్రి వరకూ నదీ తీరం భక్తుల రాకతో సరికొత్త శోభను సంతరించుకుంది. సాయంత్రం నిర్వహించిన హారతి కార్యక్రమానికి హాజరైన మంత్రి శ్రీధర్‌బాబు, విశాఖ పీఠాధిపతి స్వరూపానందేంద్ర హాజరయ్యారు.
కాగా ఓ వైపున కుటుంబ సభ్యులతో కలిసి పుణ్య స్నానాలు ఆచారస్తూ, మరో వైపున త్రివేణి సంగమానికి చీరె, సారె సమర్పించడం, నది ఒడ్డున సైకత లింగాలకు ప్రత్యేక పూజలతో, వేద పండితుల మంత్రోచ్ఛారణలతో కాళేశ్వరంలోని త్రివేణి సంగమం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. నది తీరంలో పూ ర్వీకులను స్మరించుకుంటూ భక్తులు పితృ తర్పణాలు చేస్తున్నారు.
కాళేశ్వరం త్రివేణి సంగమంలో అంత్య పుష్కరాల సందర్భంగా ప్రతి రోజు నిర్వహించే సరస్వతి నవరత్న మాలా హారతి కార్యక్రమం నిర్వహించే కాశీ పండితులు గురువారం కాళేశ్వర ముక్తీశ్వర స్వామికి కర్పూర హారతి నిర్వహించారు. త్రివేణి సంగమంలో రాష్ట్ర భాషా సాంస్కృతిక, సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేకతగా నిలుస్తున్నాయి. ఈ సందర్భంగా ఒడిస్సీ నృత్య కళాకారులు అద్భుతమైన శాస్త్రీయ నృత్య ప్రదర్శనలతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు.
కార్యక్రమం ప్రారంభంలో మంగళాచరణ్ ప్రదర్శించబడింది. మహాకవి కాళిదాసు రచించిన శ్యామలా దండకంలోని మాణిక్య వీణా శ్లోకాన్ని ఆధారంగా తీసుకొని మాతంగి దేవిని స్తుతిస్తూ ఈ నృత్యాన్ని ఆవిష్కరించారు. త్రివేణి సంగమం వద్ద నిర్వహించిన సరస్వతి నవల నవరత్న మాలా హారతిని విశాఖ పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీ, మాజీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాం తి కుమారి, కలెక్టర్ రాహుల్ శర్మ, ధార్మిక సలహాదారు గోవింద హరి దేవస్థానం చైర్మ న్ మోహన్ శర్మ ఈవో మహేష్‌లతో కలిసి ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వీక్షించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడు తూ.. కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి ప్రాంగణంలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు లో భాగంగా సరస్వతి అంత్య పుష్కరాలలో స్నానం చేయడానికి మనందరికి ఆశీస్సులు ఇవ్వడానికి విచ్చేసిన బ్రహ్మశ్రీ స్వరూపనంద స్వామి గారికి హృదయపూర్వకంగా అందరి తరపున ధన్యవాదాలు తెలియజేశారు.
పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీ మాట్లాడుతూ.. కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం ఈరోజు ఇక్కడికి ఈ కార్యక్రమానికి పాల్గొంటే హిమాలయాల్లో ఉన్నామా అనిపిస్తుందని, ఇంత అత్యద్భుతంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా చాలా గొప్పగా ఏర్పాట్లు చేసిందని కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం దేవాలయాన్ని వేములవాడ వలే అభివృద్ధి చేయాలని, బాసర దేవాలయంలాగా చేయాలని సంకల్పించడం ప్రభుత్వం గొప్పతన మని కొనియాడారు.
కాలేశ్వరం ప్రాంతంలో ఇంత అత్యద్భుతంగా అలంకరణ చేసి ఎంతో గొప్పగా హారతి ఇప్పించడం గంగమ్మ ఒడిన ఇచ్చే హారతి ఇక్కడ చూశానని హర్షం వ్యక్తం చేశారు. దేవాదాయ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజా రామయ్యర్, కమిషనర్ హనుమంతరావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ధార్మిక సలహాదారు గోవింద హరికి, చక్కటి ఏర్పాట్లు చేసిన జిల్లా యంత్రాంగం యొక్క కృషి గొప్ప ఫలితం అని తెలిపారు.






