5 April, 2026 | 6:18 AM

ఘనంగా సాంస్కృతిక వార్షికోత్సవ వేడుక

05-04-2026 12:00 AM

రెజొనెన్స్ ఇన్‌ఫో పాఠశాల ఆధ్వర్యంలో నిర్వహణ

ఖమ్మం, ఏప్రిల్ 4(విజయక్రాంతి): ఖమ్మం నగరంలోని వీడీఓస్ కాలనీలోని రెజొనెన్స్ ఇన్‌ఫో పాఠశాల సాంస్కృతిక వార్షికోత్సవ వేడుక వేదిక ఫంక్షన్ హాల్‌లో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఖమ్మం ఎడిషనల్ డీసీపీ ఎడ్మిన్ బి.రామానుజమ్, రెజొనెన్స్ డైరెక్టర్స్ ఆర్‌వీ నాగేంద్రకుమార్, కె.శ్రీధర్‌రావు, నీలిమ పాల్గొని జ్వోతి ప్రజ్వలన చేశారు. ముఖ్య అతిథి బి.రామానుజమ్ మాట్లాడుతూ తల్లిదండ్రులు ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా కొంత సమయాన్ని పిల్లలతో కేటాయించాలన్నారు.

విద్యార్థులు కూడా క్రమశిక్షణ, పట్టుదల కలిగి ఏకాగ్రతతో దేనినైనా సాధిస్తారని, మంచి భవిష్యత్తు కలిగి ఉన్నత శిఖరాలను చేరాలని ఆకాంక్షించారు. దేశానికి, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు మంచి పేరు తేవాలన్నారు. ఆర్‌వీ నాగేంద్రకుమార్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి పట్టుదలతో అనుకున్న లక్ష్యాన్ని చేరేవరకు విశ్రమించరాదన్నారు. విలువలతో కూడిన విద్యను అందిస్తూ విద్యార్థులను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ సామాజిక అవగాహన పెంచే విధంగా పిల్లలను తీర్చిదిద్దుతున్నా మని తెలిపారు.

పిల్లలు మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండేలా చూసుకోవాలన్నారు. పాఠశాల డైరెక్టర్ కె. శ్రీధర్‌రావు మాట్లాడుతూ కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా ఆటపాటలతో పాటు అన్ని రంగాల్లో విద్యార్థులు ముందుండే విధంగా తమ విద్యార్థులను తీర్చిదిద్దుతున్నామన్నారు. పాఠశాల డైరెక్టర్ నీలిమ మాట్లాడుతూ నైతిక విలువలతో కూడిన విద్యను అభ్యసించి ఉన్నతస్థాయికి ఎదిగి చదువుకున్న పాఠశాలకు పేరు తేవాలని ఆశించారు.

సాంప్రదాయ వస్త్రాలతో, సాంస్కృతిక కార్యక్రమాలతో, చిన్న పిల్లల స్టెప్‌లతో ఫంక్షన్ హాల్ మారుమ్రోగింది. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు ఎంతో ఉత్సాహంతో పాల్గొన్నారు.