5 April, 2026 | 11:34 PM

రైతులు అధైర్య పడవద్దు.. అండగావుంటాం

05-04-2026 04:26 PM

నష్టపోయిన రైతులను ప్రభుత్వం తరుపున ఆదుకుంటాం

 ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

కోనరావుపేట,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మరిమడ్ల గ్రామంలో అకాల వర్షాల కారణంగా నష్టపోయిన పంట పొలాలను రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పరిశీలించారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ నగేష్, వ్యవసాయ శాఖ అధికారులు కూడా పాల్గొన్నారు. శనివారం రాత్రి కురిసిన భారీ వర్షాల ప్రభావంతో గ్రామ పరిధిలో 200 ఎకరాలకు పైగా పంట నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమిక అంచనవేససారు.

చేతికొచ్చిన పంటలు నష్టపోవడం రైతులకు తీవ్ర ఆవేదన కలిగిస్తోందని విప్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... “రైతులు అధైర్య పడవద్దు… ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది” అని భరోసా ఇచ్చారు. నష్టపోయిన పంటల వివరాలను సమగ్రంగా సేకరించి ప్రభుత్వానికి నివేదిస్తామని తెలిపారు. గతంలో నష్టపోయిన రైతులకు సరైన పరిహారం అందకపోయినా, ప్రస్తుత ప్రజా ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో రైతులకు ఆర్థిక సహాయం అందిస్తున్నామని అన్నారు.

అధికారులు పూర్తి స్థాయిలో పంట నష్టం వివరాలు సేకరించాలని, బాధిత రైతులను ప్రభుత్వం తరఫున తప్పకుండా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ వరలక్ష్మి, మార్కెట్ కమిటీ చైర్మన్ కచ్చకాయల ఎల్లయ్య, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు కేతిరెడ్డి జగన్మోహన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు షేక్ ఫిరోజ్ పాషా, పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.