2 September, 2026 | 4:53 PM

ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి

02-09-2026 | 03:47pm

మహాముత్తారం, సెప్టెంబర్ 02 (విజయ క్రాంతి): ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతో ఉందని ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించాలని కుల సంఘాల జేఏసీ జిల్లా చైర్మన్ పీక కిరణ్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ బడులపై పాలకులు, అధికారులకే నమ్మకం లేకపోతే పేదలు, రైతులు, కూలీలు ఎలా నమ్ముతారని ప్రశ్నించారు.

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విద్యార్థులు లేక 36 ప్రభుత్వ పాఠశాలలు మూతపడటం ఆందోళనకరమన్నారు. ప్రభుత్వ బడులను బలోపేతం చేయకుండా ప్రైవేట్ విద్యాసంస్థలకు ప్రోత్సాహం లభిస్తోందని విమర్శించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చదివించేలా కఠిన చట్టం తీసుకురావాలని కోరారు. ప్రభుత్వం స్పందించకపోతే జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని పీక కిరణ్ హెచ్చరించారు.