అన్ని వర్గాల సంక్షేమం దిశగా ప్రభుత్వం చర్యలు
భీం విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి వివేక్ వెంకట స్వామి
జైపూర్, ఆగస్టు 5 : అన్ని వర్గాల ప్రజల సంక్షేమం దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, రాష్ట్రంలో సమర్థవంతమైన ప్రజా పాలన అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగార , గనులు భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకట స్వామి అన్నారు. బుధవారం జైపూర్ మండల కేంద్రంలో ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొమురం భీం విగ్రహాన్ని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, మండల తహసిల్దార్ వనజా రెడ్డి, ఎంపీడీవో శ్రీపతి బాపు, ఆదివాసీ సంఘాల ప్రతినిధులతో కలిసి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజల కోసం, ఆదివాసీల హక్కుల కోసం కొమురం భీం చేసిన వీరోచిత పోరాటం చిరస్మరణీయమని, భావితరాలకు చరిత్ర అందించేలా కొమురం భీం విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. కమ్యూనిటీ హాళ్ల ఏర్పాటుకు రూ. 20 లక్షలు మంజూరు చేయడం జరుగుతుందని, కమ్యూనిటీ హాళ్ల ఏర్పాటుకు స్థల కేటాయింపు కోసం పరిశీలించడం జరుగుతుందని తెలిపారు.
ఈ నెల 15న స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని అర్హులైన లబ్ధిదారులకు నూతన పెన్షన్లు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. చెన్నూర్ నియోజకవర్గంలో సి.సి. రోడ్లు, మురుగు కాలువ వ్యవస్థ, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణంపై దృష్టి సారించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆదివాసీ పిల్లలు చక్కగా చదువుకొని ఉన్నత స్థాయిలో నిలవాలని, విద్యకు ఉన్న శక్తి అనిర్వచనీయమైనదని తెలిపారు.
అడ్వాన్సుడ్ టెక్నాలజీ సెంటర్ల ద్వారా వృత్తి విద్య కోర్సులను అందించి నిరుద్యోగులకు ఉపాధి కల్పించడం జరుగుతుందని, జర్మన్ భాష నేర్పించి విదేశాలలో ఉద్యోగ అవకాశాలను కల్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.






