27 May, 2026 | 4:29 AM

సర్కార్ వైద్యం ‘దూరం’!

27-05-2026 12:05 AM
  1. అర్బన్ హెల్త్ సెంటర్ లేక తీవ్ర ఇబ్బందులు 
  2. చికిత్సకు తప్పని కిలోమీటర్ల ప్రయాణం
  3. రోగులకు ప్రైవేటు దవాఖానాలే దిక్కు

మధిర, మే 26(విజయ క్రాంతి): ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించిన మధిర ప్రభుత్వ వైద్యశాల ప్రస్తుతం ప్రజలకు అందని ద్రాక్షలా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. పట్టణ జనాభా రోజురోజుకు పెరుగుతున్నప్పటికీ అర్బన్ హెల్త్ సెంటర్ ఏర్పాటు చేయకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  ముఖ్యంగా పేద, మధ్యతరగతి కుటుంబాలు సాధారణ వైద్య సేవల కోసం కూడా దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.

రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పేరుతో వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిని పట్టణానికి దూరంగా, తక్కువ రవాణా సౌకర్యం ఉన్న ప్రాంతంలో నిర్మించడంతో చిన్నపాటి అనారోగ్య సమస్యలకే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జ్వరం, వైరల్ ఫీవర్, బీపీ, షుగర్ వంటి సాధారణ వ్యాధుల చికిత్స కోసం నాలుగు నుంచి ఐదు కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి రావడంతో సమయం, డబ్బు రెండూ వృథా అవుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేకంగా గర్భిణీలు, బాలింతలు, చిన్నపిల్లలు, వృద్ధులు అత్యవసర పరిస్థితుల్లో సరైన వైద్య సేవలు అందక ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి సమయాల్లో ప్రభుత్వ వైద్య సేవలు అందుబాటులో లేకపోవడంతో ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించాల్సి వస్తోంది.

దీంతో వేల రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని స్థానికులు చెబుతున్నారు. ఇక రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుంటే డెంగ్యూ, వైరల్ జ్వరాలు, సీజనల్ వ్యాధులు పెరిగే అవకాశం ఉండటంతో ప్రజల్లో మరింత ఆందోళన నెలకొంది. పట్టణ ప్రజలకు సమీపంలోనే అర్బన్ హెల్త్ సెంటర్ ఏర్పాటు చేసి 24 గంటల వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అలాగే ల్యాబ్ పరీక్షలు, ఉచిత మందులు, తల్లి-శిశు సంరక్షణ సేవలు, అత్యవసర వైద్య సదుపాయాలు కల్పించాలని కోరుతున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం, వైద్యశాఖ అధికారులు తక్షణ చర్యలు తీసుకుని మధిర పట్టణానికి ప్రత్యేక అర్బన్ హెల్త్ సెంటర్ ఏర్పాటు చేయాలని స్థానికులు స్థానిక శాసనసభ్యులు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రత్యేక చొరవతో అర్బన్ హెల్త్ సెంటర్ ప్రారంభించాలని ప్రజలు కోరుతున్నారు.