22 April, 2026 | 6:38 AM

ఫీజు రీయింబర్స్‌మెంట్ ఎత్తివేతకు ప్రభుత్వం కుట్ర

22-04-2026 12:27 AM

ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి

బడంగ్పేట్, ఏప్రిల్ 21(విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని అటకెక్కించేందుకు ప్రయత్నిస్తోందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు. మంగళవారం బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో అభివృద్ధి పనులపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడం వల్లే విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, హాల్ టికెట్ రాక ఒక ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని ఆమె మండిపడ్డారు.

’ప్రజాపాలన’ అనేది కేవలం ప్రచారానికే పరిమితమైందని, క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుతున్న ప్రయోజనం శూన్యమని విమర్శించారు. కనీసం దోమల నివారణ వంటి పౌర సమస్యలను కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. రోడ్డు విస్తరణ పేరుతో బాధితులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా, నష్టపరిహారం (TౄR) చెల్లించకుండా కూల్చివేతలు చేపట్టడం సరికాదని అధికారులను హెచ్చరించారు.

గత BRS ప్రభుత్వ హయాంలో బడంగ్పేట్ పరిధిలో రోడ్ల విస్తరణ కోసం రూ. 168 కోట్లు మంజూరయ్యాయని, ఆ పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. బాలాపూర్ నుంచి ఆదిభట్ల వరకు, జిల్లెలగూడ నుంచి బడంగ్పేట్ వరకు రోడ్ల విస్తరణకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. దివంగత వైఎస్సార్ ప్రవేశపెట్టి, కేసీఆర్ కొనసాగించిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రస్తుత ప్రభుత్వం నీరుగార్చాలని చూస్తోందని, వెంటనే బకాయిలు విడుదల చేసి విద్యార్థులకు భరోసా ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు.