9 June, 2026 | 1:47 AM

ఇంటర్ విద్యార్థులకు గుడ్‌న్యూస్..

09-06-2026 12:05 AM
  1. బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్న భోజనం   అమలు చేయనున్న ప్రభుత్వం
  2. జిల్లాలో 35,607 మంది విద్యార్థులకు ప్రయోజనం

కరీంనగర్, జూన్ 8 (విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం ఇంటర్మీడియట్ విద్యార్థుల కోసం ఉదయం అల్పాహారం (బ్రేక్ ఫాస్ట్), మధ్యాహ్న భోజన పథకాలను ప్రవేశపెట్టింది. ఈనెల 12 నుండి ఈ పథకాలు రాష్ట్రవ్యాప్తంగా అమలు కానున్నాయి. దీని ద్వారా దాదాపు 1.92 లక్షల మంది పేద విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది.

విద్యార్థులకు పోషకాహారం అందించేందుకు రోజుకో వెరైటీ చొప్పున మెనూను సిద్ధం చేశారు. ఇందులో దోశ, పూరీ, మిల్లెట్ ఇడ్లీ, బోండా, ఉప్మా వంటి వంటకాలు ఉంటాయి. వీటితో పాటు చట్నీ, సాంబార్, మికస్డ్ వెజిటబుల్ కుర్మాను అందించనున్నారు. అల్పాహారంతో పాటు రోజు తప్పించి రోజు పాలు లేదా రాగిజావను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

జిల్లాలో 35,607 మంది విద్యార్ధులకు ప్రయోజనం..

జిల్లాలో ఈ పథకం ద్వారా 35,607 మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది. జిల్లాలో 11 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, 11 మోడల్ జూనియర్ కళాశాలలు, 8 కస్తూరిబా గాంధీ జూనియర్ కళశౠలు, 10 మహాత్మా జ్యోతిబాపూలే జూనియర్ కళాశాలలు, 6 తెలంగాణ సోషల్ వెల్ఫేర్ జూనియర్ కళాశాలలు, 9 మైనార్టీ జూనియర్ కళాశాలలు, 49 ప్రైవేట్ జూనియర్ కళాశాలలు ఉన్నాయి.

వీటిలో ఇంటర్ మొదటి సంవత్సరంలో జనరల్ విద్యార్థులు 16988 మంది, వొకేషనల్లో 1671 మంది, మొత్తం 18659 మంది విద్యార్థులు ఉన్నారు. రెండవ సంవత్సరంలో జనరల్లో 15417 మంది, వొకేషనల్లో 1531 మంది, మొత్తం 169748 మంది విద్యార్థులు ఉన్నారు. మొదటి, రెండవ సంవత్సరంలో కలిపి మొత్తం 35607 మంది విద్యార్థులకు లబ్ది చేకూరనుంది.