రైతుల సమస్యలపై కల్లూరులో బీఆర్ఎస్ గర్జన
400 ట్రాక్టర్లతో భారీ ర్యాలీ.. సీతారామ జలాల కోసం పోరాటానికి సండ్ర పిలుపు
కల్లూరు,(విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలనలో రైతులకు చేసిందేమీ లేదని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు సండ్ర వెంకట వీరయ్య(Sandra Venkata Veeraiah) విమర్శించారు. రైతుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ బీఆర్ఎస్(BRS) ఆధ్వర్యంలో కల్లూరులో రైతు గర్జన నిర్వహించారు. చెన్నూరు నుంచి కల్లూరు సెంటర్ వరకు సుమారు 400 ట్రాక్టర్లతో భారీ ర్యాలీ చేపట్టారు.
ఈ సందర్భంగా సండ్ర మాట్లాడుతూ.. తల్లాడ, కల్లూరు ప్రాంత రైతులకు సీతారామ ప్రాజెక్టు(Sitarama Project) ద్వారా గోదావరి జలాలను పూర్తిస్థాయిలో అందించాలని డిమాండ్ చేశారు. యూరియా(Urea) కోసం రైతులు పడుతున్న ఇబ్బందులకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు. అవసరమైతే సాగునీటి కోసం ఇరిగేషన్ కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు.
కేసీఆర్(KCR) హయాంలో అమలు చేసిన రైతుబంధు(Rythubandhu), రైతుబీమా, సీతారామ ప్రాజెక్టు వంటి కార్యక్రమాలే రైతులకు మేలు చేశాయని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వంద రోజుల్లో పూర్తి చేస్తామని,1000 రోజులు పూర్తయినా అమలు చేయలేదని విమర్శించారు.రైతుల సమస్యలపై రానున్న రోజుల్లో మరింత పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని స్పష్టం చేశారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పాలెపు రామారావు, మాజీ జెడ్పీటీసీ కట్టా అజయ్‌కుమార్, లక్కినేని రఘు, కౌన్సిలర్ పెడకండి రామకృష్ణ, కనపర్తి శ్యామల రాజ్ కుమార్, బోబోలు లక్ష్మణరావు, కాటంనేని వెంకటేశ్వరరావు, కొరకొప్పు ప్రసాద్, మేకల కృష్ణ, దేవరపల్లి భాస్కరరావు, ఇస్మాయిల్,షేక్ కమ్లీ,తాజా మాజీ సర్పంచులు, మండల, గ్రామ నాయకులు,కార్యకర్తలు, అభిమానులు, రైతులు పాల్గొన్నారు.






