ప్రగతి స్కూల్‌లో ముందస్తు కృష్ణాష్టమి వేడుకలు
అశ్వాపురం,(విజయక్రాంతి): మల్లెలమడుగులోని ప్రగతి ఇంగ్లీష్ మీడియం హైస్కూల్‌లో గురువారం ముందస్తు కృష్ణాష్టమి వేడుకలను(Krishnashtami celebrations) ఘనంగా నిర్వహించారు. చిన్నారుల్లో భక్తిభావంతో పాటు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన పెంపొందించాలనే ఉద్దేశంతో పాఠశాల యాజమాన్యం ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేసింది. విద్యార్థులు(Students) శ్రీకృష్ణుడు, రాధాదేవి వేషధారణలో ముస్తాబై అలరించారు. సంప్రదాయ దుస్తుల్లో చిన్నారులు శ్రీకృష్ణుడి బాల్యలీలలను ప్రదర్శించడంతోపాటు నృత్యాలు, భక్తిగీతాలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.
దీంతో పాఠశాల ఆవరణలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు కృష్ణాష్టమి ప్రాముఖ్యత, శ్రీకృష్ణుడి బోధనలు, బాల్యలీలలు, ధర్మమార్గం గురించి విద్యార్థులకు వివరించారు. పాఠశాల ప్రిన్సిపాల్ జి. ఈశ్వర్ మాట్లాడుతూ విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీయడంతోపాటు మన సంస్కృతి, సంప్రదాయాలపై ఆసక్తిని పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యతో పాటు నైతిక విలువలు, సంస్కృతి, సంప్రదాయాలను విద్యార్థులు అలవర్చుకోవాలని సూచించారు.






