రైతు రాజ్యం కాదు.. రావణ రాజ్యం!
కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై బీఆర్‌ఎస్ ధ్వజం..
రైతు సమస్యలపై భారీ నిరసన
అశ్వాపురం,(విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో రైతాంగానికి ఇచ్చిన హామీలను అమలు చేయకుండా తీవ్ర అన్యాయం చేసిందని గురువారం బీఆర్‌ఎస్ అశ్వాపురం మండల(Ashwapuram Mandal) అధ్యక్షుడు కోడి అమరేందర్ యాదవ్ ఆరోపించారు. రైతు సంక్షేమం పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పాలనలో రైతుల(Farmers) కష్టాలు మరింత పెరిగాయని విమర్శించారు. రైతు రాజ్యం వస్తుందని ఆశిస్తే.. రావణ రాజ్యం వచ్చిందంటూ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
రైతులకు సాగునీరు అందించడంలో ప్రభుత్వం విఫలమైందని, సాగునీటి ప్రాజెక్టులను పట్టించుకోకుండా రైతాంగాన్ని ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు. రైతు బీమా(Farmer's Insurance) విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని, రుణమాఫీ కూడా పూర్తిస్థాయిలో అమలు కాలేదని విమర్శించారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన రైతు బీమా వంటి పథకాలు రైతు కుటుంబాలకు భరోసా కల్పించాయని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఎకరాకు ఏటా రూ.15 వేల రైతు భరోసా, పండించిన పంటకు గిట్టుబాటు ధర, సన్న వడ్లకు రూ.500 బోనస్, కౌలు రైతులకు రైతు భరోసా ఇస్తామని హామీలు ఇచ్చారని, వాటి అమలు ఏమైందని ప్రశ్నించారు. రైతు కూలీలకు ఏటా రూ.12 వేల చొప్పున ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అందిస్తామని ఇచ్చిన హామీ పరిస్థితిని ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
ధాన్యం కొనుగోళ్లపై నిర్లక్ష్యం: రైతులు కష్టపడి పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సరైన ఏర్పాట్లు చేయడం లేదని అమరేందర్ యాదవ్ ఆరోపించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఇబ్బందులు పడుతున్నారని, సన్న వడ్లకు రూ.500 బోనస్ ఇస్తామని చెప్పి ఒక సీజన్‌కే పరిమితం చేశారని విమర్శించారు. ఈ ఏడాది ఏడు రకాల వడ్లను సాగు చేసిన రైతులకే బోనస్ వర్తింపజేస్తామని చెప్పడం ద్వారా హామీని నీరుగార్చారని ఆరోపించారు.
యూరియా కోసం రైతుల అవస్థలు: రాష్ట్రవ్యాప్తంగా యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. పంటల సాగు కీలక దశలో ఎరువులు సకాలంలో అందించాల్సిన ప్రభుత్వం ఆ విషయంలో విఫలమైందని ఆరోపించారు. షాపుల్లో యూరియా దొరకని పరిస్థితుల్లో యాప్‌ల ద్వారా అందుబాటులోకి తెస్తామని చెప్పడం వల్ల రైతుల సమస్యలు పరిష్కారం కావని విమర్శించారు. రైతులకు అవసరమైనంత యూరియాను సకాలంలో అందించాలని డిమాండ్ చేశారు.
మారెళ్లపాడు ప్రాజెక్టును పూర్తి చేయాలి: అశ్వాపురం మండల రైతాంగ సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు మారెళ్లపాడు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలని బీఆర్‌ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ప్రాజెక్టు పనుల్లో జాప్యం కారణంగా రైతులు ఆందోళన చెందుతున్నారని, ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. రైతుల భూములను నిషేధిత జాబితాలో చేర్చడంపై కూడా వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చి ప్రస్తుతం ప్రభుత్వం చేతులెత్తేసిందని ఆరోపించారు.
సంబంధిత సర్వే నంబర్లను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని, నెల్లిపాక శివారులో సుమారు 1,000 నుంచి 1,100 ఎకరాలకు సంబంధించిన సర్వే నంబర్ 190 సమస్యను పరిష్కరించి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిస్థాయిలో అమలు చేసి, రైతుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని బీఆర్‌ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే రైతుల పక్షాన బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో మరింత ఉధృతంగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండల ప్రధాన కార్యదర్శి మర్రి మల్లారెడ్డి, సీనియర్ నాయకులు సూదిరెడ్డి గోపిరెడ్డి, కంచగట్ల వీరభద్రం, మొగిళ్ల వీరారెడ్డి, చిలక వెంకటరమయ్య, తూము రాఘవులు, మొండికుంట సర్పంచ్ మర్రి సంధ్య, నెల్లిపాక సర్పంచ్ మండ్రు రామకృష్ణ, గొల్లగూడెం సర్పంచ్ కోండ్రు సోమయ్య, ఆనందపురం సర్పంచ్ ముర్రం సమ్మయ్య, కళ్యాణపురం సర్పంచ్ లకావత్ రామారావు, మండల యువజన విభాగం అధ్యక్షుడు గద్దల రామకృష్ణ, ఉపసర్పంచులు దేవనబోయిన మహేష్, గాడిద మహేష్, నాయకులు గొర్రెముచ్చ వెంకటరమణ, బొర్రా శ్రీను, గుంపెన శ్రీను, నజీర్ సోను, కడారి వేణు, డాక్టర్ బాబు, ఇసంపల్లి పున్నారావు తదితరులు, కార్యకర్తలు, యువజన నాయకులు, రైతులు పాల్గొన్నారు.






