సైబర్ అవగాహనలో ప్రతిభచాటిన గీతం విద్యార్థులు
‘సురక్షా కా తిరంగా’ కార్యక్రమంలో ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున చేతుల మీదుగా పురస్కారం
పటాన్ చెరు, ఆగస్టు 17: ఆన్ లైన్ సైబర్ నేరాలను నిరోధించేలా నిర్వహించిన రాష్ట్ర స్థాయి షార్ట్ వీడియో, రీల్ పోటీలో హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం విద్యార్థులు అగ్రస్థానం సాధించారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్బీ) తన స్పార్క్ (అవగాహన, బాధ్యతాయుతమైన సైబర్ స్పేస్ కోసం విద్యార్థి కార్యక్రమం)లో భాగంగా ‘సురక్షా కా తిరంగా: అప్రమత్తంగా ఉండండి, క్షుణ్ణంగా తెలుసుకోండి, సైబర్ సురక్షితంగా ఉండండి’ పేరిట బంజారాహిల్స్ లోని ఇంటిగ్రెటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (ఐసీసీసీ)లో ఈ పోటీలను నిర్వహించింది.
ఈ కార్యక్రమానికి ప్రముఖ టాలీవుడ్ నటుడు అక్కినేని నాగార్జున, తెలంగాణ పోలీసు డైరెక్టర్ జనరల్ సి.వి. ఆనంద్, తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్, హైదరాబాదులో పోలీసు కమిషనర్ వి.సి. సజ్జనార్ సహా పలువురు ప్రముఖులు, సీనియర్ పోలీసు అధికారులు హాజరయ్యారు.
‘మోసాల నుంచి స్వేచ్ఛ’ అనే ఇతివృత్తంతో స్వాతంత్ర్య దినోత్సవ సైబర్ అవగాహన ప్రచారంలో భాగంగా, విద్యార్థులు, ప్రజలు సురక్షితమైన డిజిటల్ పద్ధతులను అవలంబించేలా, సైబర్ బెదిరింపుల పట్ల అప్రమత్తంగా ఉండేలా ప్రోత్సహించడానికి, ఆన్ లైన్ మోసాలను నివారించడంపై అవగాహన కల్పించడానికి టీజీసీఎస్బీ రాష్ట్ర వ్యాప్తంగా ఒక లఘు వీడియో, రీల్ పోటీని నిర్వహించింది.
హైదరాబాదు ప్రాంగణంలోని గీతం స్కార్క్ క్లబ్ ఈ రాష్ట్ర స్థాయి పోటీలో పాల్గొని, తమ ప్రభావవంతమైన సృజనాత్మక ప్రదర్శనకు ప్రథమ బహుమతిని కైవసం చేసుకుంది. సైబర్ భద్రతను, బాధ్యతాయుతమైన డిజిటల్ ప్రవర్తనను ప్రోత్సహించడంలో వారు చేసిన కృషికి గుర్తింపుగా, ఈ కార్యక్రమంలో గీతం విద్యార్థులకు ప్రముఖుల చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందజేశారు.
సైబర్ అవగాహన ప్రచారానికి విద్యార్థులు చేస్తున్న కృషికి మద్దతునిచ్చిన సంగారెడ్డి డీఎస్పీ వేణుగోపాలరెడ్డి సహకారంతో గీతం జట్టు ఈ పోటీలలో పాల్గొంది. సురక్షితమైన, మరింత బాధ్యతాయుతమైన డిజిటల్ వాతావరణాన్ని సృష్టించే లక్ష్యంతో చేపట్టిన ఈ పోటీలలో విద్యార్థులు చూపిన సృజనాత్మకత, అవగాహన, చురుకైన భాగస్వామ్యానికి గీతం నాయకత్వం వారిని అభినందించింది. ఈ విజయం, గొప్ప సామాజిక చైతన్యం కల్పించడం కోసం తమ జ్జానాన్ని, ప్రతిభను వినియోగించడంలో గీతం విద్యార్థులకున్న నిబద్ధతను ప్రతిబింబిస్తుంది.
గీతం స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ లోని కృత్రిమ మేధస్సు-డేటా సైన్స్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ టి.శశివర్ణన్ ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేశారు. రాష్ట్ర స్థాయిలో లభించిన ఈ గుర్తింపు గీతంకు గర్వకారణమే గాక, సైబర్ అవగాహన, బాధ్యతాయుతమైన సాంకేతిక వినియోగం, సామాజిక ప్రాముఖ్యత గల కార్యక్రమాలలో విద్యార్థుల భాగస్వామ్యంపై విశ్వవిద్యాలయం నిరంతరం చూపుతున్న ప్రాధాన్యతను ఇది నొక్కి చెబుతుంది.






