17 August, 2026 | 5:02 PM

మఠంపల్లి మండలంలో రూ.8 లక్షల నిధుల గందరగోళం?

17-08-2026 03:29 PM

మఠంపల్లి ఆగస్టు 17 (విజయక్రాంతి): మఠంపల్లి మండలంలో గత ఐదు, ఆరు నెలల క్రితం ఇన్చార్జ్ ఎంపీడీవోగా పనిచేసిన కాలానికి సంబంధించిన నిధుల వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మండల పరిధిలోని ఇద్దరు పంచాయతీ కార్యదర్శుల పేర్లతో సుమారు రూ.8 లక్షల మేర నిధులకు సంబంధించిన లావాదేవీలు, వినియోగంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

నిధులు ఏ పనుల కోసం మంజూరయ్యాయి? వాటిని ఏ విధంగా ఖర్చు చేశారు? పనులు వాస్తవంగా జరిగాయా? అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. ఇన్చార్జ్ ఎంపీడీవోగా పనిచేసిన సమయంలో సంబంధిత నిధుల నిర్వహణలో విధి విధానాలు పాటించారా లేదా అన్నదానిపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇద్దరు కార్యదర్శుల పేర్లపై నమోదైన నిధుల వివరాలు, బిల్లులు, వౌచర్లు,పనుల అంచనాలు, చెల్లింపుల వివరాలను సమగ్రంగా పరిశీలిస్తే అసలు విషయం వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని స్థానికులు పేర్కొంటున్నారు.

ప్రభుత్వ నిధులు ప్రజల అవసరాల కోసం వినియోగించాల్సి ఉండగా, వాటి విషయంలో గందరగోళం నెలకొన్నట్లు ఆరోపణలు రావడం అధికార వర్గాల్లోనూ చర్చకు దారితీసింది. నిధుల వినియోగానికి సంబంధించి సంబంధిత రికార్డులను పరిశీలించి, అవసరమైతే ప్రత్యేక ఆడిట్ నిర్వహించాలని స్థానికులు కోరుతున్నారు. రూ.8 లక్షల నిధులకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారులు బహిర్గతం చేసి, నిధుల వినియోగంలో ఏవైనా అవకతవకలు జరిగితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మండల పరిషత్ సూపరిడెంట్  సెలవు రోజున సంబంధిత ఇన్చార్జి అధికారి బీరువా లాకర్ పగలగొట్టి చెక్కులు తీసి డబ్బులు డ్రా చేసినట్టుగా సమాచారం. అయితే ఈ వ్యవహారంపై సంబంధిత అధికారుల అధికారిక వివరణ వెలువడాల్సి ఉంది.