పోచారం డంపింగ్ యార్డ్‌లో పేరుకుపోయిన చెత్త
తగలబెట్టడంతో దట్టమైన పొగ
ఊపిరి సలపని దుర్వాసన
అనారోగ్య సమస్యలు
శాశ్వత పరిష్కారం కోసం స్థానిక ప్రజలు ఎదురుచూపు
ఘట్ కేసర్, జూన్ 8 (విజయక్రాంతి): హైదరాబాద్ తూర్పు ప్రాంతంలో శరవేగం గా విస్తరిస్తున్న ఐటీ, నివాస హబ్లలో పో చారం, అన్నోజిగూడ ప్రాంతాలు ముఖ్యమైనవి. అయితే గత కొంతకాలంగా ఈ ప్రాంత వాసులను, ముఖ్యంగా అన్నోజిగూడ ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్) టోల్గేట్ సమీపంలోని డంపింగ్ యార్డ్ తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది.
ఒకవైపు ఐటీ కంపెనీల మిరుమి ట్లు గొలిపే భవనాలు, మరోవైపు సాఫ్ట్వేర్ ఉద్యోగులు, మధ్యతరగతి ప్రజల కలల నివాసాలు (గేటెడ్ కమ్యూనిటీలు) ఇదీ పోచారం డివిజన్ అన్నోజిగూడ ప్రాంతపు ముఖచి త్రం. కానీ ఈ అందమైన చిత్రానికి వెనుక వై పున ఒక నల్లని మచ్చలా మారింది ORR టోల్గేట్ సమీపంలోని డంపింగ్ యార్డ్. రోజురోజుకూ పెరుగుతున్న చెత్త కుప్పలు, దాని నుంచి వస్తున్న దుర్వాసన స్థానికుల పాలిట శాపంగా మారాయి.
గుట్టలుగా పేరుకుపోతున్న వ్యర్థాలు
పోచారం మున్సిపాలిటీ పరిధితో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి సేకరిస్తున్న టన్నుల కొద్దీ తడి, పొడి చెత్తను నిబంధనలకు విరుద్ధంగా ఇక్కడే పడేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్లాస్టిక్ వ్యర్థాలు, కుళ్ళిపోయిన ఆహార పదార్థాలు, కొన్నిసార్లు రసాయన వ్యర్థాలు కూడా ఇక్కడ చేరడంతో ఈ ప్రాంతం ఒక పెద్ద ‘చెత్త గుట్ట’లా దర్శనమిస్తోంది.
ఊపిరి సలపని దుర్వాసన అనారోగ్య సమస్యలు
సాయంత్రం అయిందంటే చాలు కనీసం కిటికీలు కూడా తెరుచుకోలేని పరిస్థితి. గాలి ఎటు వీస్తే అటు కంపు కొడుతుంది. పిల్లలు, వృద్ధులు శ్వాసకోస సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు.
స్థానిక ప్రజల ఆవేదన
ఈ డంపింగ్ యార్డ్ కారణంగా చుట్టుపక్కల కాలనీల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చెత్త పేరుకుపోవడంతో దోమలు, ఈగలు విపరీతంగా పెరిగిపోయి మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు ప్రబలుతున్నాయి.
భూగర్భ జలాలు కలుషితం
వర్షం పడినప్పుడు ఈ చెత్త నుంచి వచ్చే రసాయన ద్రవాలు భూమిలోకి ఇంకిపోయి, చుట్టుపక్కల ఉన్న బోరు బావుల నీరు కూడా కలుషితం అవుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కాలుష్య పొగలు
కొన్నిసార్లు ఈ చెత్త కుప్పలకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో వచ్చే దట్టమైన పొగ ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రయాణించే వాహనదారులను సైతం తీవ్రంగా ఇబ్బంది పెడుతూ ప్రమాదాలకు దారితీస్తోంది.
మారిన ఐటీ లుక్.. ఆందోళనలో స్థానికులు
ఒకప్పుడు ప్రశాంత వాతావరణం, మెరుగైన కనెక్టివిటీ ఉంటుందని ఇక్కడ కోట్లాది రూపాయలు వెచ్చించి ఇళ్లు, ప్లాట్లు కొనుగోలు చేసిన ప్రజలు ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారు. అంతర్జాతీయ స్థాయి ఐటీ కంపెనీలు ఉన్న ఈ ప్రాంతంలో, ఔటర్ టోల్గేట్ వంటి ప్రధాన కూడలి పక్కనే ఇలాంటి అపరిశుభ్ర వాతావరణం ఉండటం నగర ప్రతిష్టను దెబ్బతీస్తోందని మేధావులు అభిప్రాయపడుతున్నారు.
పరిష్కారం ఎప్పుడు?
ఈ సమస్యపై స్థానిక కాలనీల సంక్షేమ సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు పలుమార్లు గతంలో మున్సిపల్ అధికారులకు, ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు సమర్పించారు. ఈ డంపింగ్ యార్డును ఇక్కడి నుంచి తక్షణమే జనావాసాలు లేని సుదూర ప్రాంతానికి తరలించాలని, చెత్తను ఇలా బహిరంగంగా పడేయకుండా, శాస్త్రీయ పద్ధతిలో రీసైక్లింగ్ చేసే ప్లాంట్లను ఏర్పాటు చేయాలని, అభివృద్ధి అంటే కేవలం భవనాలు, రోడ్లు నిర్మించడం మాత్రమే కాదు ప్రజలకు స్వచ్ఛమైన గాలి, నీరు అందించడం కూడా. పోచారం డివిజన్ అన్నోజిగూడ ప్రాంతాన్ని ఈ ‘కంపిన’ సమస్య నుంచి విముక్తి చేసి, మళ్లీ ‘స్వచ్ఛ’ సుందర ప్రాంతంగా మార్చాల్సిన బాధ్యత అధికారులపై ఎంతైనా ఉంది. పాలకులు త్వరగా స్పందించి శాశ్వత పరిష్కారం చూపిస్తారని స్థానికులు ఆశగా ఎదురుచూస్తున్నారు.






