అమెరికాలో గంగారం యువకుడు మృతి
- మూడు రోజుల క్రితం మృతి
- స్వగ్రామానికి మరో నాలుగు రోజులు
- ట్రంప్ వీసాల మెలికకు, యువకుడి బలి
బిజినేపల్లి: నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలంలోని గంగారం గ్రామానికి చెందిన సాయి అరుణ్ రెడ్డి (26) అనే యువకుడు అమెరికాలో ఉన్నత చదువుల కోసం వెళ్లి, అక్కడే అనారోగ్యంతో మూడు రోజుల క్రితం మృతి చెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం సాయి అరుణ్ రెడ్డి అనే యువకుడి తల్లి సరళమ్మ గ్రామంలోనే అంగన్ వాడి కార్యకర్తగా పని చేస్తుండగా, తండ్రి వెంకట్ రెడ్డి వ్యవసాయం చేస్తున్నాడు. అరుణ్ 2020 నాటికి బి.టెక్ పూర్తి చేసుకొని, 2021 చివరి నాటికి అరుణ్ అమెరికాలో ఉన్నత చదువుల కోసం వెళ్ళాడు. కాగా కొద్ది నెలలు గా అరుణ్ అనారోగ్యంతో బాధ పడుతున్నాడు.
వ్యాధి ప్రారంభ దశలోనే అరుణ్ ఇండియాకు వచ్చి వ్యాధి నయం అయ్యాక అమెరికా తిరిగి వెళ్ళాలి అనుకున్నాడు. కానీ ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వీసా నిబంధనలు కఠిన తరం చేయడంతో అమెరికాకు తిరిగి రావడం కష్టమని భావించాడని స్నేహితులు తెలిపారు. దీంతో చేసేది లేక అక్కడే వైద్యం చేయించుకున్నా, బాగోగులు చూసే వారు లేక ఫలితం లేకుండా పోయింది. కొద్ది రోజులుగా వ్యాధి ముదిరి మూడు రోజుల క్రితం తాను నివాసం ఉండే ఇంటిలోనే చనిపోయాడు.
మృతదేహం తరలింపుకు 30 లక్షలు
అరుణ్ మృతదేహం ఇండియాకు తీసుకురావడానికి దాదాపు రూ.30 లక్షల వరకు ఖర్చు అవుతుందని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. ఈ మొత్తం అక్కడి తెలుగు ఆ అరుణ్ స్నేహితులు చందాలుగా వేసుకొని ఏర్పాట్లు చేస్తున్నారని గ్రామస్తులు తెలిపారు. మూడు రోజుల క్రితం చనిపోయిన అరుణ్ మృతదేహం స్వగ్రామానికి రావడానికి మరో మూడు రోజుల వరకు సమయం పట్టవచ్చని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అరుణ్ రెడ్డి మృతికి ట్రంప్ విధించిన వీసా నిబంధనలు కూడా ఒక కారణంగా చెప్తున్నారు.






