22 June, 2026 | 9:52 PM

కోయగూడెం ఓసీపీలో సింగరేణి డైరెక్టర్ (ఈ&ఎం) తిరుమల రావు పర్యటన

22-06-2026 07:49 PM

టేకులపల్లి,(విజయక్రాంతి): సింగరేణి  డైరెక్టర్ (ఈ&ఎం) యం.తిరుమల రావు సోమవారం ఇల్లందు ఏరియాలోని కోయగూడెం ఓసీపీని సందర్శించి గని కార్యకలాపాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కేఓసీ వ్యూ పాయింట్ నుండి గనిలో జరుగుతున్న బొగ్గు ఉత్పత్తి, ఓబీ తొలగింపు, బ్లాస్టింగ్, లోడింగ్, రవాణా పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి సంబంధిత అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. రోజువారీ బొగ్గు ఉత్పత్తి, రవాణా లక్ష్యాలు, ప్రస్తుత ప్రగతి, యంత్రాల పనితీరు తదితర అంశాలపై ఇల్లందు ఏరియా జనరల్ మేనేజర్ వి.కృష్ణయ్యతో సమీక్ష నిర్వహించారు.

అనంతరం డైరెక్టర్ యం. తిరుమల రావు మాట్లాడుతూ.. వర్షాకాల పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఉత్పత్తి, రవాణా కార్యకలాపాలకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా ముందస్తు ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని అధికారులకు సూచించారు. అలాగే ఉద్యోగుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, రక్షణ ప్రమాణాలను కచ్చితంగా పాటిస్తూ ఉత్పత్తిని కొనసాగించాలని సూచించారు. సంస్థ నిర్దేశించిన రోజువారీ, నెలవారీ, వార్షిక ఉత్పత్తి లక్ష్యాలను అధిగమించేలా సమష్టిగా కృషి చేయాలని తెలిపారు.

ఈ సందర్భంగా డైరెక్టర్ యం. తిరుమలరావు  బొగ్గు రవాణా వ్యవస్థపై ప్రత్యేక దృష్టి సారించారు. గనికి సంబంధించిన టీసీ పాయింట్లు, వెయ్‌బ్రిడ్జిలు, చెక్‌పోస్టులు, బొగ్గు నిల్వ ప్రదేశాలు, రవాణా మార్గాలను సందర్శించి తనిఖీలు నిర్వహించారు. బొగ్గు రవాణా ప్రక్రియ పారదర్శకంగా జరుగుతోందా, ఎక్కడైనా బొగ్గు అక్రమ రవాణాకు లేదా నష్టానికి అవకాశం ఉందా అనే అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు.

ఇటీవల వెలువడిన వార్తల నేపథ్యంలో ప్రతి దశను సమగ్రంగా తనిఖీ చేసి సంబంధిత అధికారులకు అవసరమైన సూచనలు జారీ చేశారు. బొగ్గు ఉత్పత్తి నుండి రవాణా వరకు అన్ని దశల్లో పర్యవేక్షణను మరింత బలోపేతం చేసి సంస్థ ఆస్తులను పరిరక్షించడంతో పాటు ఉత్పత్తి లక్ష్యాల సాధనకు కట్టుబడి పనిచేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కె ఓ సి మేనేజర్ శ్రీనివాసరావు, ప్రాజెక్టు ఇంజనీర్ ఎం చిన్నయ్య, ఐటి మేనేజర్ చైతన్య, జూనియర్ ఇన్స్పెక్టర్ ఎస్ రాజేష్, ఇతర అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.