22 June, 2026 | 11:13 PM

రాజకీయంగా ఎదుర్కోలేకే ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌పై దుష్ప్రచారం!

22-06-2026 08:52 PM

- అవినీతి పరులతో ముడిపెట్టే కుట్రలపై ఆగ్రహం

– తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టిన రుద్రంగి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎర్రం గంగ నర్సయ్య 

రుద్రంగి,(విజయక్రాంతి): ప్రజాస్వామ్యలో రాజకీయంగా ఎదుర్కోలేకనే తమ నాయకుడు రాష్ట్ర ప్రభుత్వ విప్,కాంగ్రెస్ పార్టీకి చెందిన ఏకైక మున్నూరు కాపు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పై కొందరు ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నారని  రుద్రంగి మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎర్రం గంగ నరసయ్య మండిపడ్డారు. ప్రజల్లో ఆది శ్రీనివాస్ పై రోజురోజుకు పెరుగుతున్న ఆదరణను జీర్ణించుకోలేక రాజకీయ ప్రత్యర్థులు నిరాధార ఆరోపణలకు పాల్పడుతున్నారని వారు ఆరోపించారు.

ఒక సామాన్య కుటుంబం నుంచి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆది శ్రీనివాస్ తన కష్టంతో,ప్రజల సమస్యలపై నిరంతర పోరాటంతో ఈ స్థాయికి ఎదిగారని పేర్కొన్నారు.ఎలాంటి రాజకీయ వారసత్వం లేకుండా, డబ్బు,అధికార అండదండలు లేకుండా ప్రజల విశ్వాసాన్ని సంపాదించుకున్న నాయకుడిగా ఆయన మహోన్నతమైన గుర్తింపు పొందారని అన్నారు.ఇటీవల వెలుగులోకి వచ్చిన ధాన్యం అక్రమ రవాణా కేసును అడ్డం పెట్టుకుని కొందరు కావాలనే ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేరును వివాదంలోకి లాగేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.

ధాన్యం కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తికి సంబంధించిన కుటుంబ సభ్యుడు కాంగ్రెస్ నాయకుడు కావడమే తప్ప,ఆది శ్రీనివాస్‌కు ఆ వ్యవహారంతో ఎలాంటి సంబంధం లేదని వారు స్పష్టం చేశారు.అయినప్పటికీ ఆయన ప్రతిష్టను దెబ్బతీయాలనే ఉద్దేశంతో కొందరు అసత్య ప్రచారానికి దిగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు."చట్టం ముందు అందరూ సమానమే.ఎవరైనా తప్పు చేసి ఉంటే దర్యాప్తు సంస్థలు,న్యాయవ్యవస్థ తమ పని తాము చేసుకుంటాయి.కానీ ఎలాంటి ఆధారాలు లేకుండా ప్రజా ప్రతినిధులను కేసులతో ముడిపెట్టడం రాజకీయ నీచ సంస్కృతికి నిదర్శనం" అని ధ్వజమెత్తారు.

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తున్న ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌పై జరుగుతున్న ఈ దుష్ప్రచారం ప్రజల్లో ఏమాత్రం ప్రభావం చూపదని వారు ధీమా వ్యక్తం చేశారు.రాజకీయ ప్రత్యర్థులు అసత్యాలను ఎంతగా ప్రచారం చేసినా అవి సత్యాలుగా మారవని,చివరకు నిజమే గెలుస్తుందని స్పష్టం చేశారు.బీసీ వర్గాలకు చెందిన యువ నాయకుడిగా ఆది శ్రీనివాస్ సాధించిన రాజకీయ ప్రాధాన్యత కొందరికి అసహనంగా మారిందని, అందుకే వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని ఆరోపించారు.

ప్రజలు అన్ని విషయాలను గమనిస్తున్నారని, అభివృద్ధి,ప్రజా సేవలతో ముందుకు సాగుతున్న తమ నాయకుడిపై చేస్తున్న కుట్రలను అదే స్థాయిలో తిప్పికొడతామని పేర్కొన్నారు. "రాజకీయంగా ఎదుర్కోలేని వారు తప్పుడు ప్రచారాలు, వ్యక్తిగత దాడులు మానుకుని ప్రజా సమస్యలపై పోటీ పడాలనీ, ప్రజల తీర్పే అంతిమమని గంగా నర్సయ్య స్పష్టం చేశారు.ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌పై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ప్రజాస్వామ్యవాదులు,బీసీ సంఘాలు,కాంగ్రెస్ కార్యకర్తలు తీవ్రంగా ఖండిస్తూ మీడియా, సోషల్ మీడియా వేదికల్లో వస్తున్న నిరాధార కథనాలను ప్రజలు నమ్మవద్దని వారు విజ్ఞప్తి చేశారు.