మందమర్రిలో నకిలీ పత్తి విత్తనాల ముఠా గుర్తు రట్టు..
- స్విఫ్ట్ డిజైర్ కార్, 30కిలోల నకిలీ విత్తనాలు స్వాధీనం
మందమర్రి,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా మందమర్రి సర్కిల్ ఇన్స్పెక్టర్ పర్స రమేష్ ప్రత్యేక పర్యవేక్షణ ఆదేశాల మేరకు, నకిలీ విత్తనాల విక్రయదారులపై మందమర్రి పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులు ఉమ్మడిగా మెరుపు దాడి చేసి నకిలీ పత్తి విత్తనాల ముఠా గుట్టురట్టు చేశారు. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. అమాయక రైతులను మోసం చేస్తూ నకిలీ విత్తనాలను విక్రయిస్తున్న ఇద్దరు నేరస్థులను పట్టుకుని, వారి నుండి సుమారు 30 కిలోల నకిలీ పత్తి విత్తనాలు రవాణాకు ఉపయోగించిన స్విఫ్ట్ డిజైర్ కారును స్వాధీనం చేసుకున్నారు.
మందమర్రి పరిధిలోని రామన్ కాలనీ బ్రిడ్జ్ సమీపంలో నకిలీ విత్తనాల రవాణా జరుగుతోందనే నమ్మదగిన సమాచారంతో, మందమర్రి పోలీసులు వ్యవసాయ అధికారి (AEO) కలిసి సంయుక్తంగా వాహన తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో అనుమానాస్పదంగా వచ్చిన ఒక స్విఫ్ట్ డిజైర్ కారు (నెంబర్: TS19 H 5554) ను ఆపి తనిఖీ చేయగా, ఎలాంటి రశీదులు, పర్మిట్లు లేని సుమారు 30 కిలోల నకిలీ పత్తి విత్తనాలు లభ్యమయ్యాయి. శ్రీపతి నగర్ కు చెందిన మహమ్మద్ సాహెబ్ జానీ, మహమ్మద్ అఫ్రోజ్ ను పట్టుకున్నారు.
నిందితులు సులభంగా ఎక్కువ డబ్బు సంపాదించాలనే దురాశతో, బైంసాకు చెందిన అబ్దుల్ రజాక్ వద్ద కిలో రూ. 1000/- చొప్పున ఈ నకిలీ పత్తి విత్తనాలను కొనుగోలు చేశారు. వాటిని మందమర్రి ప్రాంతానికి తీసుకువచ్చి, ఇక్కడి చుట్టుపక్కల గ్రామాల్లోని అమాయక రైతులకు ఒక్కో కిలో రూ. 2500/- చొప్పున విక్రయించి భారీగా లాభాలు గడపాలని ప్లాన్ చేశారు. రైతులకు నమ్మకం కలిగించేందుకు బ్రాండెడ్ కంపెనీల నకిలీ సంచులను వాడుతూ మోసానికి పాల్పడుతున్నారు. సిఐ రాజేష్ ను ఉన్నతాధికారులు అభినందించారు.ఈ నేరస్తులను పట్టుకోవడంలో చొరవ చూపిన మందమర్రి ఎస్సై జి. నరేష్, కానిస్టేబుల్ రాకేష్, చైతన్య లను మందమర్రి సిఐ ప్రత్యేకంగా అభినందించారు.






