1,057 మందికి గ్యాలంట్రీ పతకాలు
- తెలంగాణ నుంచి 15 మంది ఎంపిక
- ఎస్పీ జగదీశ్వర్‌రెడ్డికి రాష్ట్రపతి విశిష్ట సేవా పతకం
- డీఎస్పీ రమేష్‌కు విశిష్ట సేవా పతకం
హైదరాబాద్, ఆగస్టు 14 (విజయక్రాంతి): దేశ స్వాత్రంత్య దినోత్సవాన్ని పురస్కరించుకుని పోలీసు, అగ్నిమాపక, హోంగార్డ్, పౌర రక్షక వంటి విభాగాల్లో సేవలందిస్తోన్న సిబ్బందికి కేంద్ర ప్రభుత్వం గ్యాలంట్రీ/సేవా పతకాలను ప్రకటించింది. దేశవ్యాప్తంగా 1,057 మందిని ఈ పతకాలకు హోంశాఖ ఎంపిక చేసింది. వీరిలో 92 మందికి రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలు, 301 మందికి పోలీసు మెడల్ ఫర్ గ్యాలంట్రీ, 664 మందికి పోలీసు విశిష్ట సేవా పతకాలు (మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్) అందించనుంది.
గ్యాలంట్రీ పతకాలు దక్కించుకున్న 301 మందిలో అత్యధికంగా 197 మంది తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న పోలీసులున్నారు. జమ్మూకశ్మీర్‌లో పనిచేస్తోన్న 51 మంది, ఈశాన్య రాష్ట్రాల్లో విధులు నిర్వర్తిస్తోన్న 12 మంది పోలీసులకు ఈ పతకాలు దక్కాయి. ప్రాణాలను, ఆస్తులను కాపాడటం, నేరాలను నిరోధించడంలో అసమాన ధైర్య సాహసాలు ప్రదర్శించిన వారికి కేంద్ర హోంశాఖ ఏటా ఈ అవార్డులను అందజేస్తోంది.
తెలంగాణ నుంచి వీరే..
తెలంగాణ నుంచి 15 మంది జాబితాలో ఉన్నారు. వీరిలో ముగ్గురు పోలీసులకు గ్యాలంట్రీ మెడల్స్, ఇద్దరికి రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలు, 10 మందికి పోలీసు విశిష్ట సేవా పతకాలు ప్రకటించారు.
రాష్ట్రపతి విశిష్ట సేవా పతకం: ఎస్పీ ఆర్. జగదీశ్వర్ రెడ్డి, తెలంగాణ అదనపు డిప్యూటీ కమిషనర్ జోగుల నర్సయ్య
గ్యాలంట్రీ మెడల్స్: బి. సత్యరావు (జూనియర్ కమాండో), కె. సందీప్ (జూ. కమాండో), జె. వంశీకృష్ణ (జూ.కమాండో)
విశిష్ట సేవా పతకం: పీ వెంకటరమణ (అడిషనల్ డిప్యూటీ కమిషనర్), భూమన రవికుమార్ రెడ్డి (డిప్యూటీ సూపరింటెండెంట్), బీ రమేష్ (డిప్యూటీ సూపరింటెండెంట్), ఆశల గంగారామ్ (అసిస్టెంట్ కమిషనర్), ఆర్‌జీ శివమారుతి (అసిస్టెంట్ కమిషనర్), సీ రాము లు (హెడ్ కానిస్టేబుల్), డీ సత్యనారాయణ (అసిస్టెంట్ కమాండో), కే తిరుపతిరాజు (హెడ్ కానిస్టేబుల్), భూపతి శ్రీనివాసరావు (డిప్యూటీ సూపరింటెండెంట్), యాదయ్య (ఫైర్ సర్వీస్
ఏపీ నుంచి 21 మంది ఎంపిక..
ఆంధ్రప్రదేశ్ నుంచి 21 మంది వీటికి ఎంపికయ్యారు. ఇందులో ఏడుగురు పోలీసులకు గ్యాలంట్రీ మెడల్స్, ఇద్దరికి రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలు, 11 మందికి పోలీసు విశిష్ట సేవా పతకాలు లభించనున్నాయి. ఏపీకి చెందిన ఐజీ గుడి విజయ్ కుమార్, ఐజీ బలంకారి వెంకట రామిరెడ్డి రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలకు ఎంపికయ్యారు.
హెడ్ కానిస్టేబుళ్లు కొర్లాన మహేశ్, పైడి శ్రీరామమూర్తి, అడారి హేమసుందర రావు, చింతపల్లి సత్యనారాయణ, రౌతు మహేశ్, ఆబోతుల అప్పలనాయుడు, రుతాల కన్నబాబుకు గ్యాలంట్రీ మెడల్స్ దక్కాయి. అలాగే కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)లో పనిచేస్తోన్న 21 మంది అధికారులకు కూడా ఈ పతకాలు దక్కాయి. వీరిలో ఆరుగురు అధికారులకు రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలు, 15 మందికి పోలీసు విశిష్ట సేవా పతకాలు ప్రకటించారు. వీరిలో విశాఖపట్నం డీఎస్పీ (సీబీఐ)గా ఉన్న సంజయ్ కుమార్ సమాల్‌కు రాష్ట్రపతి విశిష్ట సేవా పతకం దక్కింది.
ఎస్పీ జగదీశ్వర్‌రెడ్డికి అభినందనల వెల్లువ..
ఇంటలిజెన్స్ విభాగంలోని ఎస్పీ ఆర్. జగదీశ్వర్ రెడ్డికి రాష్ట్రపతి పోలీస్ పథకం దక్కడంతో ఆయన్నే ఏడీజీపీ విజయ్ కుమార్ (ఐపీఎస్) సహా పలువురు ఉన్నతాధికారులు అభినందించారు. రెగట్టే గోపాల్ రెడ్డి కుమారుడైన ఆర్. జగదీశ్వర్ రెడ్డి 1969న జన్మించారు. హైదరాబాద్‌లోని ఇంటలిజెన్స్ విభాగంలో ఎస్పీగా పనిచేస్తున్నారు. ఈయన పనితీరు, సేవా భావానికి గుర్తింపుగా అంతకుముందు కూడా పలు గౌరవాలను అందుకున్నారు.
2005లో కఠిన సేవా పురస్కారం, 2009లో ఉత్తమ సేవా పురస్కారం, 2011లో సీఎం శౌర్య పతకం, 2014లో అంతరిక్ష సురక్షా పురస్కారం, 2017లో భారత పోలీస్ పతకం, 2021లో మహోన్నత సేవా పురస్కారంతోపాటు 2006లో ఒక ఉగ్రవాదిని అదుపులోకి తీసుకున్నందుకు గాను సీబీఐ పురస్కారం, ప్రశంసాపత్రం కూడా లభించింది. ఇప్పటివరకు 85 ప్రశంసా పత్రాలు, 8 అభినందన పత్రాలు, రెండు ప్రత్యేక ప్రశంసలు ఆయన వృత్తిపరమైన నైపుణ్యాన్ని ప్రతిబింబిస్తున్నాయి.
పౌరుల రక్షణకు కట్టుబడి ఉంటా: డీఎస్పీ రమేష్
పోలీసు విభాగంలో విశిష్ట సేవలకుగాను 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రతిష్టాత్మక ‘ఇండియన్ పోలీస్ మెడల్’కు ఎంపికైన 1995 బ్యాచ్‌కు చెందిన డీఎస్పీ బీ రమేష్ ఎంపికయ్యారు. ఆయన చూపిన నిబద్ధత, శౌర్యాన్ని గుర్తిస్తూ ఈ అవార్డుకు కేంద్ర హోంశాఖ ఎంపిక చేసింది. డీఎస్పీ రమేష్ ఈగిల్ ఫోర్స్‌లో సేవలందిస్తున్నారు. మూడు దశాబ్దాలుగా పోలీస్ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్నారు.
ఇప్పటికే ఈయనకు 2014లో సేవా పతకం, 2019లో ఉత్కృష్ట సేవా పతకం, 2021లో ఉత్తమ సేవా పతకం లభించాయి. విశిష్ట సేవా పతకానికి ఎంపికైన సందర్భంగా డీఎస్పీ రమేష్ మాట్లాడుతూ.. తన కెరీర్‌లో అండగా నిలిచిన తోటి పై అధికారులకు, ఈగిల్ ఫోర్స్ బృందానికి, కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. సమాజంలో శాంతిభద్రతలను కాపాడటానికి, పౌరుల రక్షణకు, యూనిఫామ్ గౌరవాన్ని నిలబెట్టేందుకు ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటానని, పనిచేస్తానని పునరుద్ఘాటించారు.






