నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించాలి
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసిన ఎంఎల్‌ఎ జారే
దమ్మపేట, జూన్ 11 (విజయక్రాంతి): అశ్వారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జారే ఆదినారాయణ గురువారం హైదరాబాద్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పంచాయతీ రాజ్, రూరల్ డెవలప్మెంట్ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క), మైనారిటీ సంక్షేమ శాఖా మంత్రి మొహమ్మద్ అజారుద్దీన్ లను కలిసి అశ్వారావుపేట నియోజకవర్గ అభివృద్ధికి నిధులను కేటాయించాలని కోరారు.
నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న వివిధ కీలక అభివృద్ధి పనులకు, మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక బడ్జెట్ నిధులు కేటాయించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ను కోరారు. పంచాయతీ రాజ్, రూరల్ డెవలప్మెంట్ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) ను కలిసి ఏజెన్సీ ప్రాంతాల్లో అంతర్గత రోడ్ల నిర్మాణం, తాగునీటి సమస్యల శాశ్వత పరిష్కారం, గ్రామీణ ప్రగతి నిధుల మంజూరుకై విజ్ఞప్తి చేశారు.
మైనారిటీ సంక్షేమ శాఖా మంత్రి మొహమ్మద్ అజారుద్దీన్ ను కలిసి నియోజకవర్గ యువత కోసం క్రీడా మైదానాల (స్టేడియం) ఏర్పాటు, క్రీడా మౌలిక సదుపాయాల కల్పన, మైనారిటీ సంక్షేమ నిధులపై చర్చించారు. అంతరం ఎంఎల్‌ఎజారె ఆదినారాయణ హైదరాబాద్ లోని తెలంగాణ సెక్రటేరియట్ నందు అశ్వారావుపేట నియోజకవర్గానికి చెందిన అనారోగ్య బాధితుల నుంచి స్వీకరించిన ముఖ్యమంత్రి సహాయనిధి (సి ఎం ఆర్ ఎఫ్) దరఖాస్తులను ఆ విభాగంలో సంబం ధిత అధికారులకు అందజేశారు.
నియోజక వర్గ ప్రజలకు అవసరమైన సమయంలో ప్రభుత్వ సహాయం అందేలా నిరంతరం కృషి చేస్తున్న తరుణంలో ఆర్థిక ఇబ్బందు లతో వైద్యం పొందుతున్న బాధితులకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్థిక సహాయంతో పాటు నిమ్స్ ఆసుపత్రిలో విలువైన వైద్యం ఉచితంగా అందిస్తున్నట్టు పేర్కొన్నారు. ప్రజల సమస్యల పరిష్కారమే తన ప్రధాన బాధ్యత అని, అశ్వారావుపేట నియోజకవర్గ ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందేలా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని తెలిపారు.






