calender_icon.png 20 February, 2026 | 3:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బడ్జెట్‌లో నిధులివ్వాలి

20-02-2026 01:18:36 AM

హామీలు 95% పెండింగ్‌లోనే..

ఆరు గ్యారెంటీలు, 420 హామీలకు నిధులివ్వకుంటే కాంగ్రెస్‌ను నిలదీస్తాం

సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగలేఖ

హైదరాబాద్, ఫిబ్రవరి 19 (విజయక్రాంతి): ఇప్పటికీ కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో 95 శాతం పెండింగ్‌లో నే ఉన్నాయని, వాటికి ఈసారైన బడ్జెట్‌లో కేటాయింపులు చేయాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ ఆర్ డిమాండ్ చేశారు. త్వరలో ప్రవేశపెట్టే 2026-- 2027 బడ్జెట్‌లో 6 గ్యారెంటీలు, 420 హామీలు, డిక్లరేషన్ల కింద ఇచ్చిన వాగ్దానాల అమలుకు తగిన నిధు లు కేటాయించకపోతే, ఎక్కడికక్కడ కాంగ్రెస్‌ను ప్రజలపక్షాన నిలదీస్తామని ఆయన హెచ్చరించారు.

ఈ బడ్జెట్‌లో మహిళలు, వృద్ధులు, విద్యార్థి, యువత, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, రైతన్నల కోసం భారీగా నిధులు కేటాయించాలని కోరారు. సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం బహిరంగ లేఖ రాశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సం దర్భంగా మీరిచ్చిన హామీల గురించి తెలంగాణ ప్రజల పక్షాన గుర్తుచేసేందుకే ఈ లేఖ రాస్తున్నాన్నారు. తెలంగాణ ప్రజలకు ఆరు గ్యారెంటీలు, 420 హామీల పేరిట 

 మభ్యపెట్టి రెండేళ్లు గడిచినా ఇప్పటికీ అమలుకు నోచుకోని నేపథ్యంలో, కనీసం ఈ సారి బడ్జెట్ లోనైనా అవసరమైన నిధులు కేటాయించాలని నాలుగు కోట్ల ప్రజల పక్షాన కోరుతున్నట్లు లేఖలో పేర్కొన్నారు. వృద్ధులు, వితంతువులకు అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం పెన్షన్‌ను నాలుగు వేలకు పెంచడానికి ఎన్ని నిధులు కావాలో లెక్కగట్టి ప్రతి పైసాను ఈసారి బడ్జెట్‌లో కేటాయించాల్సిన బాధ్యత మీపై ఉందన్నారు.

అలాగే రాష్ట్ర జానాభాలో సగభాగంగా ఉన్న ప్రతి ఒక్క మహిళకు మహాలక్ష్మి కింద నెలకు రూ. 2,500లు అందజేస్తామని హామీ ఇచ్చి రెండున్నరేళ్లు కావొస్తున్న ఇప్పటికీ ఒక్క లబ్దిదారుకు ఒక్క పైసా దక్కలేదని పేర్కొన్నారు. అందుకే ఈసారి బడ్జెట్ కేటాయింపుల్లో ఈ గ్యారెంటీ అమలుకు అడుగులు పడకపోతే ఆడబిడ్డలు ఊరుకునే ప్రసక్తే లేదనే విషయాన్ని గుర్తుచేస్తున్నాని తెలిపారు.

అలాగే కేసీఆర్ హయాంలో తెలంగాణను పంజాబ్‌నే తలదన్నేలా, దేశానికే ధాన్యాగారంగా తీర్చిదిద్దిన రైతులకు అందిన రైతుబంధును 15 వేలకు మొత్తాన్ని బడ్జెట్‌లో కేటాయించాలని కోరా రు. ఇప్పటికే మూడుసార్లు పెండింగ్‌లో పెట్టిన రైతుబంధు పాత బకాయిలను కూడా చెల్లించాలన్న రైతుల డిమాండ్‌ను మీ ముందు ఉంచుతున్నట్లు తెలిపారు.కౌలు రైతులకు, రైతు కూలీలకు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం వారి ఖాతాల్లో నిధులు జమచేయాలని కోరారు. 

నిరుద్యోగుల హామీ ఏమైంది..?

నిరుద్యోగులకిచ్చిన ప్రతి హామీ కూడా రెండేళ్ల నుంచి పెండింగ్‌లోనే ఉంది. తొలి ఏడాదే రెండులక్షల ఉద్యోగాల భర్తీతోపాటు, జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి వంటి హామీల అమలుకు కూడా బడ్జెట్ లో కేటాయింపులు చేయాలని తెలంగాణ యువతీ యువకుల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డ ఆటో డ్రైవర్లకు ఇస్తానన్న ఆర్థిక సహాయం అందజేయడానికి 2026--2027 బడ్జెట్‌లో తగిన నిధులు కేటాయించాలని కేటీఆర్ కోరారు. ఇప్పటికీ మీరిచ్చిన హామీ ల్లో 95 శాతం పెండింగ్‌లోనే ఉన్న నేపథ్యంలో.. ఈ సారైన బడ్జెట్‌లో కేటాయిం పులు చేయాలని, లేకపోతే తెలంగాణ సమాజం ఇంకా ఓపికపట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. . 

హామీల ఆధారంగా..

ఢిల్లీ నేతల సమక్షంలో మ్యానిఫెస్టోను విడుదల చేయడమే కాకుండా చివరికి ఇంటింటికీ గ్యారెంటీ కార్డులను కూడా పంపిణీ చేసి, ఇన్నేళ్లపాటు దగా చేయడాన్ని తెలంగాణ సమాజం సహించదని, అప్పటి సీఎల్పీ నాయకుడు, ప్రస్తుత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈ గ్యారంటీ కార్డులను భద్రంగా దాచిపెట్టుకోవాలని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ గ్యారంటీ కార్డులో ఉన్న ప్రతి ఒక్క గ్యారంటీని తూచా తప్పకుండా అమలు చేస్తామని చేసిన వాగ్దానానికి ఇన్నాళ్లు పాతరేయడం ప్రజలకు వెన్నుపోటు పొడవడమేనని కేటీఆర్ విమర్శించారు.

నాటి గ్యారంటీ కార్డులే ఇవాళ బాకీ కార్డులై మీ పాపాలను ప్రజాక్షేత్రంలో ప్రశ్నిస్తున్నాయి.. ప్రజల నోట్లో మట్టి కొట్టిన మీ పాపాల ప్రక్షాళన జరగాలంటే కనీసం ఈ సారి బడ్జెట్ లోనైనా మ్యానిఫెస్టోలో హామీల ఆధారంగా బడ్జెట్ కేటాయిం పులు చేయాల్సిన బాధ్యత మీపై ఉందన్నారు. 

ఒక్కొక్కరికి రూ. వేలల్లో బాకీ..

తెలంగాణలోని ఒక్కో అక్క చెల్లెమ్మకే కాంగ్రెస్ ప్రభుత్వం ఏకంగా 62,500 రూపాయలు బాకీ పడిందని, అవ్వ తాతలకు, బీడీ కార్మికులకు నెలకు రూ. 4 వేలు పెన్షన్ చేస్తామన్నారు.. కానీ, ఈ 25 నెలల్లో ఒక్కొక్కరికి రూ. లక్ష రూపాయల వరకూ బాకీ పడ్డారన్నారు. అలాగే దివ్యాంగులను దారుణంగా దగాచేశారని, కళ్యాణ లక్ష్మి/షాదీ ముబారక్ కింద ఈ రెండేళ్లలో పెళ్లి చేసుకున్న ఆడిబిడ్డల తల్లులందరికీ తులం బంగారం బాకీ పడ్డారని వెల్లడించారు.

యువ వికాసం కింద రూ. 5 లక్షల విద్యా భరోసా కార్డు ఇవ్వనే లేదని, విద్యార్థినులకు స్కూటీలు ఇవ్వలేదని, ఫీజు రీయింబర్స్‌మెంట్ కూడా వేల కోట్లు బాకీ పేరుకుపోవడంతో విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పడే ప్రమాదం పొంచి ఉందన్నారు.  ఇలా చెప్పుకుంటూ పోతే 42 పేజీల అభయహస్తం మేనిఫెస్టోలోని 420 హామీల్లో 5 శాతం కూడా అమలు చేయకుండా తెలంగాణ ప్రజలను దగా చేసిన ఘనచరిత్ర కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని మండిపడ్డారు. 

రెండు లక్షల ఉద్యోగాలేవీ?

హైదరాబాద్ యూత్ డిక్లరేషన్లో అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న హామీని మాట మార్చి ఐదేళ్లలో భర్తీ చేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొనడం నిరుద్యోగ యువత గొంతుకోయడమేనని పేర్కొన్నారు. నిరుద్యోగులకు ప్రతి నెలా రూ. 4 వేల నిరు ద్యోగ భృతి చెల్లిస్తామన్న వాగ్దానాన్ని పూర్తి గా గంగలో కలిపి ఇప్పటివరకు నయా పైసా కూడా చెల్లించకుండా యువతను మోసగించారని తెలిపారు. కేసీఆర్ హ యాంలో నియామక ప్రక్రియ పూర్తిచేసిన వాటికి కాగితాలిచ్చి ఫోటోలకు ఫోజు లివ్వడం తప్ప పట్టుమని పదివేల కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వకపోవడం అత్యంత దారుణమన్నారు. 

ఆటోడ్రైవర్ల సంక్షేమ బోర్డు ఏదీ?

ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం ప్రతి ఆటో డ్రైవర్‌కు సంవత్సరానికి రూ. 12 వేల ఆర్థిక సహాయం అందజేస్తామని, వారికోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి సామాజిక భద్రత కల్పిస్తామన్నారని, ఈ రెండేళ్లలో ఈ హామీల అమలుకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని పేర్కొన్నారు. ఉపాధి లేక రోడ్డునపడ్డ ఒక్కోఆటో డ్రైవర్‌కు కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 24 వేలు బాకీ పడిన నేపథ్యంలో.. ఆ బకాయిలను కూడా ఈ బడ్జెట్‌లో కేటాయించాలని కోరారు.

అభయహస్తంలో పొందుపరిచిన గ్యారెంటీలు, 420 హామీల అమలుకు ఎన్ని నిధులు అవసరమో ప్రకటించి బడ్జెట్‌లో ప్రతి పైసాకు లెక్క కట్టాలని తెలంగాణలోని సకల జనుల తరపున డిమాండ్ చేస్తున్నానని పేర్కొన్నారు. లేకుంటే ఎక్కడికక్కడ కాంగ్రెస్‌ను ప్రజలపక్షాన నిలదీస్తామని, తెలంగాణ ప్రజాగ్రహానికి ముఖ్యమంత్రితోపాటు, మంత్రులు ప్రజాక్షేత్రంలో తిరగలేరనే విషయాన్ని స్పష్టంచేస్తున్నానని కేటీఆర్ లేఖలో హెచ్చరించారు. 

రైతు ఖాతాల్లో నిధులేవీ?

రైతులకు ఇబ్బందులు కలగకుండా ఖరీఫ్, రబీ సీజన్లు ప్రారంభానికి ముందే క్రమం తప్పకుండా కేసీఆర్ ప్రభుత్వం రైతుబంధును వారి ఖాతాల్లో నేరుగా జమ చేసిన విషయం మీకు గుర్తులేనట్టు నటించినా, తెలంగాణలోని ప్రతి రైతుకు గుర్తుందన్నారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికలకు ముందు మీరు (సీఎం) ఓ సభలో మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే రైతుల ఖాతాల్లో రైతుబంధు నిధులు జమ చేస్తామని వాగ్దానం చేసి 10 రోజులు కావొస్తున్నా ఇప్పటి వరకు రైతుల ఖాతాల్లో రైతుబంధు నిధులు జమకాలేదన్నారు. మీ ప్రకటనలన్నీ గాలి మాటలేనని మరొకసారి రుజువైందని విమర్శించారు. 

చర్యలు కనిపించడంలేదు..

ప్రస్తుతం మీడియాలో వస్తున్న వార్తలు, సమాచారం ప్రకారం రానున్న బడ్జెట్లో కూడా అభయహస్తంలో హామీ ఇచ్చిన గ్యారెంటీలకు నిధుల కేటాయింపు చేస్తున్నట్లు కనబడటం లేదని. ప్రజాపాలన పేరిట మరొక్కసారి ప్రజలను మభ్యపెట్టడానికి సన్నాహాలు చేస్తున్నట్లు కనబడుతోందని లేఖలో పేర్కొన్నారు. పనికిరాని అంశాలను తెరపైకి తెచ్చి ప్రతిసారి అటెన్షన్ డైవర్ట్ చేయాలని మీరు (సీఎం) చేస్తున్న కుట్రలు తెలంగాణ సమాజానికి అర్థమైపోయాయన్నారు.

2023 ఎన్నికల సందర్భంగా ఏఐసీసీ మాజీ అధ్యక్షులు, ప్రస్తుత లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ,  సోనియా గాంధీ సమక్షంలో కాంగ్రెస్ అభయహస్తం పేరిట దాదాపు 420 హామీలు ఇచ్చిన విషయాన్ని గాలికొదిలేయడం అత్యంత దుర్మార్గమన్నారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో 6 గ్యారంటీలను తూచా తప్పకుండా అమలుచేస్తామని, మొదటి క్యాబినెట్‌లోనే 6 గ్యారంటీలకు చట్టబద్ధత తీసుకువస్తామని నాడు పీసీసీ అధ్యక్షుడిగా మీరు హామీ ఇచ్చిన విషయాన్ని మీరు మరిచిపోయినట్టు నటించినా, ప్రజలకు మాత్రం అన్నీ గుర్తున్నాయనే విషయాన్ని స్పష్టంచేస్తున్నాని తెలిపారు