3 September, 2026 | 1:47 PM

సింగరేణి కార్మికులకు కాంగ్రెస్ మొండి చేయి

03-09-2026 | 12:49pm

కేటీకె 1వ గని గేట్ మీటింగులో పాల్గొన్న గండ్ర 

భూపాలపల్లి టౌన్, సెప్టెంబర్ 03 (విజయక్రాంతి): రేవంత్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో సింగరేణి కార్మికులకు(Singareni workers) అనేక హామీలు ఇచ్చి మోసం చేసిందని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. టీబీజికేఎస్ ఆధ్వర్యంలో సింగరేణి భూపాలపల్లి ఏరియా కేటీకె 1వ గనిలో గురువారం ఉదయం నిర్వహించిన గేట్ మీటింగులో గండ్రతో పాటు టీబీజికేఎస్ రాష్ట్ర అధ్యక్షులు మిరియాల రాజిరెడ్డి ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ(Congress government) ఎన్నికల ముందు ప్రజలకు 6 గ్యారంటీలు, అనేక హామీలు ఇచ్చినట్లుగానే కార్మికులకు అనేక వాగ్దానాలు ఇచ్చి వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలం చెందిందని ఆరోపించారు.

విధుల్లో అనారోగ్యానికి గురైన కార్మికులకు మెడికల్ ఇన్వాలిడేషన్(Medical Invalidation) కల్పించే విషయంలో సరైన చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. మెడికల్ బోర్డు ఏర్పాటులో నిర్లక్ష్యం వహిస్తున్నారని, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారిని తిరస్కరిస్తూ యధావిధిగా డ్యూటీలు చేయిస్తున్నారని, దాంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. ఇంకా ప్రభుత్వానికి సమయం ఉందని ఇప్పటికైనా కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీబీజికేఎస్ నాయకులు, కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.