కొండపోచమ్మ కమిటీలో కాంగ్రెస్‌ ‘కలహం’!

03-09-2026 | 01:34pm
  1. హుటాహుటిన ప్రమాణ స్వీకారం.. స్థానికులకు మొండిచేయి?
  2. శ్రీకాంత్‌రావు వర్గం వర్సెస్ నర్సారెడ్డి వర్గం 
  3. మధ్య ముదురుతున్న విభేదాలు
  4. సర్పంచ్‌కు సమాచారం లేదా?.. 
  5. తిగుల్‌ నర్సాపూర్‌లో గ్రామస్తుల ఆగ్రహం

జగదేవపూర్ (విజయక్రాంతి): సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలంలోనీ కొండపోచమ్మ ఆలయ కమిటీ నూతన పాలకవర్గం నియామకం జగదేవపూర్ మండల కాంగ్రెస్‌లో మరోసారి వర్గ విభేదాలను తెరపైకి తెచ్చిందా? అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. రాష్ట్ర దేవాదాయ శాఖ నియమించిన ఎనిమిది మంది నూతన డైరెక్టర్లు బుధవారం హుటాహుటిన ప్రమాణ స్వీకారం చేయడం, నియామక ప్రక్రియపై స్థానికులకు ముందస్తు సమాచారం లేకపోవడం వివాదానికి దారితీసింది.

స్థానికులకు పదవులేవీ?,

కొండపోచమ్మ ఆలయం తిగుల్‌ నర్సాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఉండగా, ఆలయ పాలకవర్గంలో స్థానికులకు ప్రాతినిధ్యం కల్పించకపోవడంపై గ్రామస్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆలయ నిర్వహణ, యోగక్షేమాలు చూసే అవకాశం స్థానికులకు ఇవ్వకుండా దూర ప్రాంతాలకు చెందిన వారికి డైరెక్టర్‌ పదవులు కట్టబెట్టడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ బడా నాయకుల అనుచరులకే పదవులు దక్కాయంటూ ఆరోపించారు.

రాజకీయ వర్గపోరుకు ఆలయ కమిటీ వేదికా?

జగదేవపూర్ మండల కాంగ్రెస్‌లో ఇప్పటికే శ్రీకాంత్‌రావు వర్గం, నర్సారెడ్డి వర్గాల మధ్య విభేదాలు ఉన్నాయన్న ప్రచారం నేపథ్యంలో కొండపోచమ్మ ఆలయ కమిటీ నియామకాలు ఆ విభేదాలకు మరింత ఆజ్యం పోశాయన్న చర్చ మొదలైంది. రాత్రికి రాత్రే రాజకీయ పెద్దలతో మాట్లాడి దేవాదాయ శాఖ ద్వారా పదవులు ఇప్పించుకున్నారంటూ కొందరు స్థానికులు ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలపై సంబంధిత నేతల పూర్తి వివరణ వెలువడాల్సి ఉంది.

దళిత సర్పంచ్‌కే సమాచారం ఇవ్వరా?

గ్రామ పంచాయతీ పరిధిలోని ఆలయ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంపై స్థానిక దళిత సర్పంచ్‌కు కనీస సమాచారం ఇవ్వకపోవడంపై కూడా గ్రామస్తులు ప్రశ్నలు సంధించారు. రాజకీయ ఆధిపత్య పోరులో దళిత నాయకులను పావులుగా మార్చడం ఎంతవరకు సమంజసమని ఆవేదన వ్యక్తం చేశారు. రెడ్డి, రావు వర్గాల రాజకీయ పోరులో దళిత నాయకులు బలికావాలా?’ అంటూ కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈవో కార్యాలయం వద్ద ఉద్రిక్తత

నూతన డైరెక్టర్లు నియామక పత్రాలు తీసుకున్న అనంతరం పాలకవర్గ రిజిస్టర్‌లో సంతకాలు చేసేందుకు ఈవో కార్యాలయానికి వెళ్లగా, అక్కడే స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ గ్రామానికి చెందిన ఒక్కరికీ డైరెక్టర్‌ పదవి ఎందుకు ఇవ్వలేదని ఈవో మూసినం మైసయ్యను నిలదీశారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అక్కడే ఉన్న ఎస్సై కృష్ణారెడ్డి జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

సమాచారం ఉంటే అందరం వెళ్లేవాళ్లం

ఈ వ్యవహారంపై కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు కొంపెల్లి కరుణాకర్‌ను ‘విజయక్రాంతి’ ప్రతినిధి వివరణ కోరగా, కొండపోచమ్మ ఆలయ కమిటీ నియామకాలపై తనకు ఎలాంటి సమాచారం లేదని తెలిపారు. ఒకే పార్టీకి చెందిన వారమైనందున సమాచారం ఉండి ఉంటే అందరం కలిసి కార్యక్రమానికి వెళ్లేవాళ్లమని పేర్కొన్నారు. పార్టీ పెద్దలు ఈ విషయాన్ని గమనించాలని ఆయన కోరారు. కొండపోచమ్మ ఆలయ కమిటీ నియామకాల వ్యవహారం అధికారిక ప్రక్రియనా? లేక కాంగ్రెస్‌లోని అంతర్గత రాజకీయ సమీకరణాల ఫలితమా? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. స్థానికులకు ప్రాతినిధ్యం కల్పించాలన్న డిమాండ్‌తో గ్రామస్తులు భవిష్యత్తులో ఎలాంటి కార్యాచరణకు దిగుతారో వేచి చూడాల్సిందే.

మరిన్ని వార్తలు