15 March, 2026 | 4:05 AM

బీఆర్‌ఎస్‌లోకి మాజీ మంత్రి జీవన్‌రెడ్డి?

15-03-2026 02:14 AM
  1. కాంగ్రెస్‌ను వీడుతున్న సీనియర్ నేత!
  2. ఈ నెల 20న ముహూర్తం?

కరీంనగర్, మార్చి 14 (విజయక్రాంతి): మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత తాటిపర్తి జీవన్‌రెడ్డి పార్టీ మారనున్నట్టు తెలిస్తున్నది. అందుకు ఈ నెల 20న ముహూర్తం నిర్ణయించినట్టు సమాచారం. జీవన్‌రెడ్డికి, జగిత్యాల ప్రస్తుత ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌కు మధ్య ఎప్పటి నుంచో పచ్చగడ్డి వేస్తే భగ్గు మనే వైరం ఉంది. గత ఎన్నికల్లో సంజయ్ కుమార్ బీఆర్‌ఎస్ నుంచి గెలవగా, జీవన్‌రెడ్డి కాంగ్రెస్ నుం చి పోటీ చేసి ఓడిపోయారు.

అయితే, అనూహ్యంగా సంజయ్ కుమార్ కాంగ్రెస్‌లో చేరడం, ఆయనకు ప్రభుత్వం, పార్టీలో ప్రాధాన్యత పెరగడం జీవన్‌రెడ్డికి మింగుడుపడటం లేదు. తనను సంప్రదించకుండానే బద్ధ శత్రువును పార్టీలోకి తీసుకోవడం తనను అవమానించడమేనని ఆయన భావిస్తున్నారు. మున్సిప ల్ ఎన్నికల టికెట్ల కేటాయింపులోనూ తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. దీంతో పార్టీపై ఆయన చాలా కా లంగా అసహనం వ్యక్తం చేస్తూనే ఉన్నారు.

జీవన్‌రెడ్డి వంటి సీనియర్ నేత పార్టీ వీడకుండా ఉండేందుకు కాంగ్రెస్ అధిష్టానంతో పాటు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వయంగా రంగంలోకి దిగి బుజ్జగించే ప్రయత్నం చేసిన ట్లు తెలుస్తోంది. అయినప్పటికీ, దశాబ్దాలుగా పార్టీ కోసం కష్టపడితే, ప్రత్యర్థిని తెచ్చి నెత్తిన కూర్చోబెట్టడం ఏమిటి అని ఆయన తన సన్నిహితుల వద్ద వాపోయినట్లు సమాచారం.

ఈ పరిణామాలతో ఆయన వెనక్కి తగ్గే సూచనలు కనిపించడం లేదని తెలుస్తున్నది. ఒకవేళ జీవన్‌రెడ్డి బీఆర్‌ఎస్‌లో చేరితే, జగిత్యాల నియోజకవర్గంలో సమీకరణాలు పూర్తిగా మారిపోతాయి. కాగా పార్టీ మార్పుపై వస్తున్న ఊహగానాలపై జీవన్‌రెడ్డి స్పందించలేదు.