calender_icon.png 28 December, 2024 | 3:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారీగా తగ్గిన విదేశీ మారక నిల్వలు

28-12-2024 12:32:51 AM

ఒక్కవారంలోనే తరలిన 8.47 బిలియన్ డాలర్లు

ముంబై, డిసెంబర్ 27:  విదేశీ ఇన్వెస్టర్లు దేశీయ మార్కెట్ నుంచి పెట్టుబడులు తరలిస్తున్న నేపథ్యంలో రిజర్వ్‌బ్యాంక్ వద్దనున్న విదేశీ మారక నిల్వలు భారీగా క్షీణించాయి.  శుక్రవారం ఆర్బీఐ విడుదల చేసిన గణాంకాల ప్రకారం  డిసెంబర్ 20తో ముగిసిన వారంలో ఫారిన్ ఎక్సేంజ్ (ఫారెక్స్) రిజర్వులు మరో 8.478 బిలియన్ డాలర్లు తగ్గి 644.391 బిలియన్ డాలర్ల వద్ద నిలిచాయి. 

సెప్టెంబర్ చివరినాటి రికార్డు గరిష్ఠస్థాయి 704.885 బిలియన్ డాలర్ల  నుంచి ఇప్పటివరకూ 60 బిలియన్ డాలర్లు క్షీణించాయి.  తాజాగా డిసెంబర్ 20తో ముగిసిన వారం లో విదేశీ మారక నిల్వల్లో ప్రధాన భాగమైన విదేశీ కరెన్సీ ఆస్తులు 6.014 బిలియన్ డాలర్లు క్షీణించి 556.562 బిలియన్ డాలర్ల స్థాయికి చేరాయి.

రూపాయి పతనాన్ని నిరోధించేందుకు  రిజర్వ్‌బ్యాంక్ డాలర్లు విక్ర యించడం కూడా విదేశీ కరెన్సీ తగ్గుదలకు కారణం. అమెరికా డాలరుయేతర కరెన్సీలైన యూరో, పౌండు, యెన్ తదితర విదేశీ కరెన్సీల విలువ డాలరుతో పోలిస్తే తగ్గుదల, పెరుగుదలను కరెన్సీ ఆస్తుల లెక్కింపులో పరిగణనలోకి తీసుకుంటారు. 

బంగారం నిల్వలూ తగ్గాయ్

ఆర్బీఐ వద్దనున్న బంగారం నిల్వలు మాత్రం సమీక్షావారంలో 2.33  బిలియన్ డాలర్లు తగ్గి 65.726 బిలియన్ డాలర్లకు చేరాయి. స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ (ఎస్‌డీఆర్‌లు) 112 మిలియన్ డాలర్ల తగ్గుదలతో 17.885 బిలియన్ డాలర్ల వద్ద నిలిచినట్లు రిజర్వ్‌బ్యాంక్ తెలిపింది. ఐఎంఎఫ్ వద్దనున్న రిజర్వులు కూడా 23 మిలియన్ డాలర్లు తగ్గి 4.217 బిలియన్ డాలర్ల వద్దకు చేరాయి.