దేశానికి రాహుకేతువే రాహుల్‌గాంధీ
- అభివృద్ధిని, సంస్కరణలను అడ్డుకోవడమే కాంగ్రెస్ నైజం
- రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్
హైదరాబాద్, ఆగస్టు 15 (విజయక్రాంతి): పార్లమెంట్‌లో ప్రజాప్రయోజనాలకు సంబంధించిన బిల్లులు రాకుండా అడ్డుపడుతూ రాహుల్ గాంధీ దేశానికి ‘రాహు కేతువు’గా మారిపోయారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కే లక్ష్మణ్ మండిపడ్డారు. దేశంలో అభివృద్ధి, సంస్కర ణలను అడ్డుకోవడమే కాంగ్రెస్ పనిగా పెట్టుకుందన్నారు. విపక్షాలు ఎన్ని కుట్రలు పన్నినా... 2029 ఎన్నికల నాటికి చట్టసభల్లో 33 శాతం మహిళా రిజర్వేషన్లను అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు.
రాజకీయాల్లో అసలు జోకర్ రాహుల్ గాంధీనేనని కౌంటర్ ఇచ్చారు. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కాస్తా ‘యాంటీ ఇండియా కాంగ్రెస్ కమిటీ’గా మారిపోయిందని విమర్శించారు. రాష్ట్రంలో సనాతన ధర్మాన్ని కించపరచడమే కాంగ్రెస్ ‘రెండు కళ్ల సిద్ధాంతం’అని ఆరోపించారు. ముస్లిం రిజర్వేషన్లపై రేవంత్‌రెడ్డి బుజ్జగింపు రాజకీయాలు పనిచేయవని స్పష్టం చేశారు. శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో డాక్టర్ కే లక్ష్మణ్ మాట్లాడారు.
ప్రపంచ దేశాల అధినేతలతో దౌత్య సంబంధాలు మెరుగుపరుస్తూ, భారతదేశ గౌరవాన్ని పతాక శీర్షికకు తీసుకెళ్తుంటే.. ప్రతిపక్ష నేతగా చెప్పుకునే రాహుల్ గాంధీ స్టేజీ మీద వెకిలిచేష్టలు, నాటకాలు చేస్తూ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. గతంలో ప్రధానిగా ఇందిరా గాంధీ స్వయంగా పాలస్తీనా, క్యూబా అధినేతలను ఆలింగనం చేసుకున్నప్పుడు విదేశాంగ విధానం గుర్తుకురాలేదా అని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని ప్రజలు 100 సార్లకు పైగా ఓడించినా వారి బుద్ధి మారలేదని విమర్శించారు.
వక్ఫ్ బోర్డు సవరణలు, ఆర్టికల్ 370 రద్దు, ముస్లిం మహిళల కోసం తెచ్చిన త్రిపుల్ తలాక్ రద్దు, పెద్ద నోట్ల రద్దు, వన్ నేషన్ రేషన్, డిజిటల్ లావాదేవీలు, జాతీయ భద్రత కోసం తెచ్చిన విదేశీ నిధుల నియంత్రణ వంటి ప్రతి చారిత్రాత్మక సంస్కరణలపై, బిల్లులపై రచ్చ చేస్తూ అడ్డుకున్నారని మండిపడ్డారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం ప్రాతినిథ్యం కల్పించేందుకు ప్రధాని మోదీ చారిత్రాత్మక ‘నారీ శక్తి వందన్ అధినియం’ బిల్లును తీసుకొస్తే, పార్లమెంటులో ఆ బిల్లును కాంగ్రెస్, ఇండీ కూటమి పార్టీలు కుట్రపూరితంగా అడ్డుకున్నాయని గుర్తు చేశారు.
అలాగే 50 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) చేపట్టి దేశవ్యాప్తంగా 800 పైగా ఎంపీ స్థానాలను, తెలంగాణలో అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలను రాజ్యాంగబద్ధంగా పెంచుతామన్నారు. తెలంగాణలో సీఎం రేవంత్‌రెడ్డి ‘రెండు కళ్ల సిద్ధాంతం’ పేరుతో హిందువులను, సనాతన ధర్మాన్ని దెబ్బతీస్తున్నారని, రాష్ట్రంలో ఆలయాలపై దాడులు జరుగుతున్నా పట్టించుకోవడం లేదని ఆరోపించారు.






