20 March, 2026 | 3:48 AM

తరాలుగా బీసీలకు పరభవమే!

20-03-2026 01:38 AM

బీసీలను వెనుకకు నెట్టేస్తున్న మూడు అగ్రవర్ణాలు

  1. ఎమ్మెల్యేలుగా అగ్రవర్ణాలకే తాంబూలం 
  2.   5% ఉన్న కులాలకే 50% ఎమ్మెల్యే పదవులు 
  3. బీసీలు 51% ఉన్నా.. మొత్తం స్థానాల్లో 16%లోపే ఎమ్మెల్యేలు 
  4. గర్జిస్తున్న బీఎస్పీ, బీసీ ఇంటలెక్చువల్ ఫోరం, బీసీ సమాజ్‌లు 
  5. రాజకీయంగా అంతరిస్తున్న బ్రాహ్మణ, వైశ్య కులాలు


హైదరాబాద్, మార్చి 19 (విజయక్రాంతి): దశాబ్దాలుగా వెనుకబడిపోయిన బీసీ సామాజికవర్గాలపై అగ్రవర్ణ కులాల రాజకీయ పెత్తనం కొనసాగుతోంది. రాజకీయంగా బీసీ సామాజికవర్గాలను ఎదగ నీయకుండా, ఎమ్మెల్యేలుగా కానీయకుం డా అగ్రవర్ణ రాజకీయ కులాలు అణగదొక్కుతున్నాయి.

సమాజంలో 51 శాతాని కంటే ఎక్కువగా ఉన్న బీసీ సమాజానికి ఇప్పటివరకు ఎమ్మెల్యేలుగా అందిన అవకాశాలు పిడికెడుకూడా లేవు. అదే రాజకీయంగా గుత్తాధిపత్యాన్ని చెలాయిస్తున్న మూడు అగ్రవర్ణ కులాల జనాభా మొత్తం 5.05 శాతం అయినప్పటికీ.. వారే మొత్తం ఎమ్మెల్యేల్లో 50 శాతానికిపైగా ఉండటం ఈ రాజకీయ దోపిడీకి పరాకాష్టగా మేధావులు, బహుజన నాయకులు చెబుతున్నారు.

గణాంకాల ప్రకారం..

తరతరాలుగా బీసీలతోసహా ఇతర కులాలకు రాజకీయంగా జరుగుతున్న అన్యాయానికి సంబంధించిన గణాంకాలను పలువురు మేధావులు విడుదల చేశారు. ఆల్ ఇండియన్ బహుజన్ సమా జ్ పార్టీ నేషనల్ కోఆర్డినేటర్, మాజీ డీజీ పీ జే పూర్ణచందర్‌రావు, బీసీ ఇంటలెక్చువల్ ఫోరం ప్రతినిధి, ఐఏఎస్ రిటైర్డ్ అధి కారి టీ చిరంజీవులు, బీసీ సమాజ్ ప్రతినిధి సంగం సూర్యారావులు గణాంకాల ను విడుదల చేస్తూ.. తరతరాలుగా బీసీ లు, ఎస్సీ, ఎస్టీ, ముస్లింలలోని కులాలకు రాజకీయంగా ఎలాంటి అన్యాయం జరుగుతుందో స్పష్టంగా పేర్కొన్నారు.

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 78 ఏండ్లు గడుస్తు న్నా.. ప్రజలందరికీ స్వేచ్ఛా, సమానత్వం, సామాజిక న్యాయం అందకపోవడానికి కులమే ప్రధాన కారణమని వారు పేర్కొంటున్నారు. తెలంగాణలో రాజకీయ పరిస్థితు లు అగమ్యగోచరంగా, అవినీతిమయంగా, అసంపూర్ణ ప్రజాస్వామ్యకరంగా ఉన్నాయని వారంటున్నారు.

రాజకీయ దోపిడీ..

స్వాతంత్య్రం వచ్చిన తరువాత జరిగిన మొదటి ఎన్నికలు.. 1952 నుంచి మొదలుకుని.. మొన్నటి 2023 వరకు అసెంబ్లీలో అడుగు పెట్టిన ఎమ్మెల్యేలను కులాల వారీగా పరిశీలిస్తే.. బీసీలకు ఎంతగా రాజకీయ అన్యాయం జరుగుతుందో అర్థమ వుతుంది. 2014లో ఏర్పడిన కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటంబ సర్వేలో.. అలాగే 2024లో అధికార కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన తెలంగాణ కులగణన సర్వేలను పరిశీలిస్తే.. రాజకీయంగా బీసీలు, ముస్లింలకు తీవ్రమైన అన్యాయం జరుగుతున్నట్టుగా అర్థమవుతుంది. ఇప్పటివరకు మొత్తం 16 సార్లు ఎమ్మెల్యే ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో మొత్తం 1,743 మంది ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. 1952 నుంచి 2023 వరకు కులాల వారీగా ఎవరి శాతం ఎంత అనేది పరిశీలిద్దాం..

పై గణాంకాలను పరిశీలిస్తే.. 1952 నుం చి 2023 వరకు ఎన్నికైన ఎమ్మెల్యేలలో రెడ్డి, కమ్మ, వెలమలే అత్యధికంగా 798 మంది ఉండగా గమనార్హం. కేవలం 5 శాతం వరకు మాత్రమే ఉన్న ఈ మూడు కులాలకు చెందినవారు ఓటర్లను ప్రలోభాలకు గురిచేసి.. అమలుకు నోచుకోని హామీలిచ్చి తెలంగాణ శాసనసభకు అత్యధికంగా ఎన్నికవుతున్నట్టుగా బీసీ మేధావులు ఘంటాప థంగా చె బుతున్నారు. 2023లోనూ ఈ మూడు కులాలకు చెందినవారే సభలో 50 శాతంకం టే ఎక్కువగా (మొత్తం 119లో.. 60 మంది ) ఉన్నట్టుగా బీసీ మేధావులు వెల్లడించిన గ ణాంకాల వల్ల స్పష్టం అవుతోంది. ఇందులో నూ అత్యధికంగా రెడ్ల రాజకీయ ఆధిపత్యం కొనసాగుతున్నట్టుగా స్పష్టంగా చెప్పవచ్చు.

111 బసీ కులాలకు దక్కని అసెంబ్లీ ప్రవేశం..

1952 నుంచి పరిశీలిస్తే.. 2023 వరకు మొత్తం 279 మంది మాత్రమే బీసీలు అసెంబ్లీలో అడుగుపెట్టారు. సమాజంలో 51 శాతం ఉన్న బీసీ ప్రజలకు దక్కిన అవకాశాలు వేళ్ళమీద లెక్కపెట్టవచ్చు. 2023 ఎన్ని కల్లో కేవలం 19 మంది మాత్రమే బీసీ వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఉన్నా రు. అంటే సమాజంలో సగానికంటే ఎక్కువగా ఉన్న బీసీలకు దక్కిన ఎమ్మెల్యేలు కేవ లం 10 శాతం మాత్రమే. ఇప్పటికీకూడా బీసీ వర్గాల్లోని 111 కులాలకు ఇప్పటికీ అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశం రానేలేదు.

అలాగే 100కుపైగా ఎస్సీ, ఎస్టీ, ముస్లిం కు లాలకుకూడా ఈ అవకాశం రాలేదంటే.. అగ్రవర్ణాలు ఎంతగా రాజకీయ దోపిడీకి పాల్పడుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. 1955లో బ్రాహ్మణుల పాలన అంతమై.. రెడ్డిల పాలనలోకి.. 1983 నుంచి కమ్మ, రెడ్డి ల పాలనలోకి.. 2014 నుంచి వెలమ, రెడ్డి, కమ్మల పాలనలోకి రాష్ట్రం వెళ్ళిపోయింది. బలిజ, విశ్వబ్రాహ్మిణ్, ఖత్రి లాంటి అనేక కులాలు అవకాశం ఇప్పటికీ దక్కని జాబితాలో ఉన్నాయి.

1952 నుంచి 2023 వరకు చూస్తే.. బీసీల్లో అత్యధికంగా ము న్నూరు కాపులకు 83 మంది ఎమ్మెల్యేలు (జనాభాలో 3.59 శాతం), ముదిరాజ్‌ల నుంచి 29 మంది (6.68 శాతం జనాభా), గౌడ్‌లకు 54 మంది (4.33 శాతం జనాభా), యాదవ్‌లకు 29 మంది (5.33 శాతం జనాభా), కురుమలకు నలుగురు (1.53 శాతం జనాభా), పద్మశాలీలకు 23 మంది (3.62 శాతం జనాభా) అవకాశం వచ్చింది. ఇప్పటివరకు కేవలం 20 బీసీ కులాలకు చెందిన ఎమ్మెల్యేలు మాత్రమే అసెంబ్లీలో అడుగుపెట్టారు.

రాజకీయ ఆధిపత్యం..

సమాజంలో కేవలం 5.05 శాతం మాత్రమే ఉన్న రెడ్డి, వెలమ, కమ్మ కులాలే.. ఎక్కువగా ఎమ్మెల్యేలుగా అవుతూవస్తున్నా రు. 51 శాతంకంటే ఎక్కువగా ఉన్న బీసీలకు అవకావం రానివ్వకుండా.. ఈ మూడు కులాలే రాజకీయ ఆధిపత్యం చేస్తూ.. దోపిడీ చేస్తున్నారని మేధావులు విశ్లేషిస్తున్నారు. జనాభా ప్రకారం ఏయే కులానికి ఎంతమేర ఎమ్మెల్యే పదవులు దక్కాయనేది పరిశీలిస్తే.. ఈ రాజకీయ దోపిడీ స్పష్టంగా అర్థమవుతుంది. ఇందుకు ఈ గణాంకాలను పరిశీలి ద్దాం. 1952 నుంచి ఇప్పటివరకు ఎన్నికైన ఎమ్మెల్యేలు.. 

పై గణాంకాలను పరిశీలిస్తే.. జనాభా దామాషా ప్రకారం చూసుకుంటే.. అగ్రవర్ణ రాజకీయ అధిపత్యం చెలాయిస్తున్న మూడు కులాలు రెడ్డి, కమ్మ, వెలమల శాతం 5.05 అయితే.. వారికి దక్కాల్సినవి కేవలం 88 మంది ఎమ్మెల్యేలే (1952 నుంచి 2023 వరకు). అయితే ఈ మూడు కులాల నుంచి ఇప్పటివరకు మొత్తం 798 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. అంటే.. ఇతర కులాలకు ముఖ్యంగా బీసీలకు దక్కాల్సిన 710 ఎమ్మెల్యే పదవులను వారు దోపిడీ చేసినట్టుగా చెప్పవచ్చు.

అదే సమయంలో కమ్మ, రెడ్డి, వెలమ కులాలకంటే అత్యధికంగా ఉన్న ముదిరాజ్, యాదవ్, గౌడ్‌లకు కేవలం 112 ఎమ్మెల్యేలుగా అవకాశం దక్కడం ఇక్కడ ప్రస్తావనార్హం. అగ్రవర్ణాల్లో అత్యధికంగా రెడ్డి కులంవారు 505 ఎమ్మెల్యే పదవులను దోపిడీ చేసినట్టుగా బీసీ వర్గాలు ప్రధానంగా ఆరోపిస్తున్నాయి. అటుతరువాత వెలమ కులం వారు తమ జనాభా దామాషాకంటే 144 మంది ఎమ్మెల్యే పదవులను ఎక్కువగా అనుభవించినట్టు తెలుస్తుంది. ఇక కమ్మ సామా జిక వర్గం నుంచి 61 మంది ఎక్కువగా ఎ మ్మెల్యేలుగా అయినట్టు గణాంకాల ను బట్టి అర్థమవుతోంది.

జనాభా దామాషా ప్రకా రం చూసుకుంటే.. బీసీలకు దక్కాల్సిన 621 ఎమ్మెల్యే పదవులను .. అగ్రవర్ణ రాజకీయ అధిపత్య కులాలు ఎత్తికెళ్ళినట్టుగా తేలుతోంది. అలాగే ముస్లింలకు దక్కాల్సివాటి కంటే.. 116 స్థానాలు తగ్గిపోవడం గమనా ర్హం. ముస్లింలలోనూ.. దూదేకుల లాంటి కులానికి అవకాశాలు రావడం లేదు. అలాగే నాయీ బ్రాహ్మిణ్, వడ్డెర, కుమ్మరి, ఉప్పర లాంటి కులాలతోపాటు.. మొత్తం 12.54 శాతం ఉన్న బీసీ కులాలకు దక్కాల్సిన 220 ఎమ్మెల్యే పదవులు ఇప్పటి వరకు దక్కలేదంటే.. రాజకీయ దోపిడీ ఎలా సాగుతోందో అర్థంచేసుకోవచ్చు.

రాజకీయంగా అంతరిస్తున్న బ్రాహ్మణ, వైశ్య కులాలు.. 

అయితే అగ్రవర్ణాల్లోని కొన్ని కులాలు మొదట్లో ఆధిపత్యం చెలాయించినప్పటికీ.. అటు తరువాత రెడ్డి, వెలమ, కమ్మ కులాల ఆధిపత్యంలోకి వచ్చిన తరువాత మెల్లగా కనుమరుగు అవుతున్నట్టుగా గ ణాంకాలను విశ్లేషిస్తే అర్థమవుతుం ది. 1952లో మొత్తం 31 మంది బ్రాహ్మణులు, ఒక వైశ్య కులానికి చెందిన ఎమ్మెల్యేలు అసెంబ్లీలో అడుగు పెట్టగా.. 2023 నాటికి అదికాస్తా.. ఒకటితో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

అంటే బ్రాహ్మణ, వైశ్య కులాలకు రాజకీయ అవకాశాలు అంతరిస్తున్నట్టుగా మేధావులు విశ్లేషిస్తున్నారు. 1972 వరకు 10 కంటే ఎక్కువగా ఎమ్మెల్యేలు ఉంటూ వచ్చిన బ్రాహ్మణుల సంఖ్య... నేటికి ఒకటికి పడిపోయింది. ఇక వైశ్యులకు మొదటి నుంచి తక్కువ అవకా శాలు వస్తున్నాయి. ఎన్నికలు వచ్చి న ప్రతిసారీ.. ఒకటి అర మాత్రమే దక్కుతున్నాయి. 2004, 2009లో ఒక్క వైశ్య ఎమ్మెల్యేకూడా లేకపోవడం గమనార్హం.   

మూడు సీఎం కులాలు.. 25 ఎమ్మెల్యే కులాలు.. 

ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్న గణాంకాలను పరిశీలిస్తే.. మొత్తం మీద కేవలం 25 కులాల నుంచే ఎమ్మెల్యేలుగా అయినట్టుగా తేలుతుంది. అలాగే మూడు కులాల నుంచే సీఎంలుగా అయినట్టుగా స్పష్టం. అంటే.. 25 కులాలు ఎమ్మెల్యే కులాలుగా.. 3 కులాలు (రెడ్డి, కమ్మ, వెలమ) సీఎం పదవులను అధిష్టించే కులాలుగా రాజ్యమేలుతున్నాయి. సమాజంలో ఉన్న మరో 200 కులాలు ఇప్పటివరకు అసెంబ్లీ గడప తొక్కలేదు. అంటే.. నానాటికి  పేదలు మరింత పేదలుగా, దుర్భర దారిద్య్రంలో బతుకుతున్నారు.

రాజకీయ అధికారారం ఉన్నవాళ్లకే మేడలు, మిద్దెలు, మీడియా వ్యాపారాలు, వాళ్ళకే ఊళ్లు, ఉద్యోగాలు, పదవులు, చదువులు, హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జీలుకూడా వాళ్లే. జాతి సంపదంతా వాళ్ళదే. మిగిలిన కులాల ప్రజలు వీరికి బానిసలు. ఈ ఆత్మగౌరవం లేని విషమ పరిస్థితి, నిరుద్యోగం, నిరక్షరాస్యత, అనారోగ్యం నుంచి బయటపడాలంటే.. అసెంబ్లీలో అడుగుపెట్టడమే బహుజనులకు ఉన్న ఏకైక దారి. అసెంబ్లీ నుంచి వెలివేసినట్టుగా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కులాలు.. బహుజన ఉద్యమం ద్వారా కదం తొక్కాలి.

 డాక్టర్ జే పూర్ణచందర్‌రావు, మాజీ డీజీపి, 

ఆల్ ఇండియన్ బహుజన్ సమాజ్ పార్టీ, నేషనల్ కోఆర్డినేటర్